US Inflation data : 40ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం.. స్టాక్ మార్కెట్లు ఢమాల్
US Inflation data : అమెరికాకు సంబంధించిన మే నెల సీపీఐ డేటా వెలువడింది. అది 40ఏళ్ల గరిష్ఠానికి చేరడం ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
US Inflation data : ద్రవ్యోల్బణంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచానికి మరో షాక్! అమెరికాలో ద్రవ్యోల్బణం ఊహించని విధంగా నమోదైంది. మే నెలలో సీపీఐ(కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్) డేటా.. ఏకంగా 8.6శాతానికి చేరింది. ఇది 40ఏళ్ల గరిష్ఠం కావడం గమనార్హం.
ఏప్రిల్ నెలలో 7.6శాతంగా ఉన్న సీపీఐ డేటా.. మే నెలలో అంచనాలకు(8.3శాతం) మించి.. 8.6శాతానికి చేరింది. 1981 డిసెంబర్ తర్వాత ఇదే అత్యధికం. వసతి, ఆహారం, గ్యాస్ ధరలు పెరగడం ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ లెక్కన చూసుకుంటే.. విమాన టికెట్ల నుంచి సెకెండ్ హ్యాండ్ కార్లు, రెస్టారెంట్లో భోజనం వరకు.. దాదాపు అన్ని ధరలు విపరీతంగా పెరిగినట్టే! ఈ పరిస్థితులు మరికొంత కాలం కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ, భౌగోళిక సమీకరణల ఉద్రిక్తతలు ఇందుకు కారణం. ముఖ్యంగా.. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పట్లో శుభం కార్డు పడే సూచనలేవీ కనిపించడం లేదు.
ఎనర్జీ ధరలు 34.6శాతం పెరిగాయి. 2005 తర్వాత ఇదే అత్యధికం. గ్రాసరీ ధరలు 11.9శాతం పెరిగాయి. 1979 తర్వాత ఇదే ఎక్కువ. ఎలక్ట్రిసిటీ 12శాతం పెరిగింది. 2006 ఆగస్టు అనంతం ఇదే అత్యధికం. అద్దెలు కూడా 5.2శాతం పెరిగాయి. 1987 తర్వాత ఇదే ఎక్కువ.
బైడెన్‌పై ఒత్తిడి..!
FED Inflation news : ఊహించని రీతిలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో ఫెడ్ చర్యలు సరిపోవడం లేదని స్పష్టమైంది. ఫలితంగా ద్రవ్యోల్బణం కట్టడికి ఫెడ్ మరింత తీవ్రంగా కృషి చేస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటం.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది. ఆయనపై ప్రజల్లో నమ్మకం పోతోందని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో మధ్యంతర ఎన్నికలు జరుగనున్న సమయంలో ద్రవ్యోల్బణం కష్టాలు బైడెన్‌కు ప్రతికూలంగా మారాయి. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడినప్పటికీ.. ద్రవ్యోల్బణం కారణంగా.. వస్తున్న జీతాలు సరిపోవడం లేదని అనేకమంది అమెరికన్లు భావిస్తున్నారు. తమకు వేతనాలు పెంచాలని ఉద్యోగులు, కంపెనీలపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు.
స్టాక్ మార్కెట్లు ఢమాల్..
అమెరికా ద్రవ్యోల్బణం లెక్కలతో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి. యూరోప్‌లోని అన్ని ప్రధాన సూచీలు.. ఒక్కసారిగా భారీ నష్టాలను నమోదు చేశాయి. ఇక వాల్‌స్ట్రీట్‌లోని అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం నష్టాల్లోనే ముగిశాయి.
ఫెడ్ చర్యలతో ద్రవ్యోల్బణం నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందని మార్కెట్ వర్గాలు భావించాయి. కానీ అలా జరగకపోవడం వల్ల.. ద్రవ్యోల్బణం సమస్య ఇప్పట్లో పరిష్కారం అవ్వద్దన్న అంచనాలతో మదుపర్లు భారీ అమ్మకాలకు దిగారు.
సోమవారం ఓపెన్ కానున్న భారత స్టాక్ మార్కెట్లపైనా తాజా పరిణామాలు ప్రభావం చూపనున్నాయి!
సంబంధిత కథనం