Parliament Special Session: సెప్టెంబర్ లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు..
31 August 2023, 16:57 IST
Parliament Special Session: సెప్టెంబర్ లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 22 వరకు, ఐదు రోజుల పాటు ఈ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
Parliament Special Session: సెప్టెంబర్ లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 22 వరకు, ఐదు రోజుల పాటు ఈ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.
ఎజెండా తెలియదు..
సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 22 వరకు, ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ప్రకటించారు. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయని ట్వీట్ చేశారు. తన ట్వీట్ కు పార్లమెంటు భవనం ఫొటోను జత చేశారు. అయితే, ఈ సమావేశాల ఎజెండాను ఆయన ప్రకటించలేదు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలన్న ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఐదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అకస్మాత్తుగా ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలను నిర్వహించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
మణిపూర్ హింసపై..
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్ట్ 11 వరకు జరిగాయి. మణిపూర్ లో హింస పై ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, మణిపూర్ పరిస్థితులపై సభలో చర్చ జరగాలని, ప్రధాని స్పందించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు వర్షాకాల సమావేశాలను అడ్డుకున్నాయి. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. చర్చ అనంతరం జరిగిన ఓటింగ్ లో విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.
జీ 20 సదస్సు అనంతరం..
సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ 20 సదస్సు జరుగుతోంది. ఆ సదస్సు పూర్తయిన అనంతరం ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. కాగా, సాధారణంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ చివరి వారంలో ప్రారంభమవుతాయి.