తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Scam Alert : అమ్మాయి చెప్పింది కదా అని 'ఇన్​వెస్ట్'​ చేస్తే.. రూ. కోటి నష్టం! వీరి​తో జాగ్రత్త!

Scam alert : అమ్మాయి చెప్పింది కదా అని 'ఇన్​వెస్ట్'​ చేస్తే.. రూ. కోటి నష్టం! వీరి​తో జాగ్రత్త!

Sharath Chitturi HT Telugu

12 September 2023, 5:20 IST

google News
  • Scam alert : డేటింగ్​ యాప్​లో కలిసిన ఓ అమ్మాయి చెప్పింది కదా అని క్రిప్టో యాప్​లో ఏకంగా రూ. 1కోటి ఇన్​వెస్ట్​ చేశాడు ఓ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​. చాలా రోజులు గడిచిన తర్వాత కానీ తాను మోసపోయినట్టు అతనికి అర్థం కాలేదు! ఈ ఘటన గుజరాత్​లో చోటుచేసుకుంది.

అమ్మాయి చెప్పింది కదా అని 'ఇన్​వెస్ట్'​ చేస్తే.. రూ. కోటి నష్టం!
అమ్మాయి చెప్పింది కదా అని 'ఇన్​వెస్ట్'​ చేస్తే.. రూ. కోటి నష్టం!

అమ్మాయి చెప్పింది కదా అని 'ఇన్​వెస్ట్'​ చేస్తే.. రూ. కోటి నష్టం!

Scam alert : దేశంలో సైబర్​ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో ఏదో ఒక మూల, ఈ తరహా నేరాలు నిత్యం వార్తల్లో కనిపిస్తూనే ఉన్నాయి. అధికారులు ఎన్ని విధాలుగా హెచ్చరికలు జారీ చేస్తున్నా.. మోసగాళ్ల ఉచ్చులో పడి ప్రజలు భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటూనే ఉంటున్నారు. ముఖ్యంగా డేటింగ్​ యాప్స్​ ఇందుకు అడ్డాగా మారాయి. తాజాగా.. ఇదే విధంగా ఓ వ్యక్తి, రూ. 1కోటి నష్టపోయాడు.

ఇదీ జరిగింది..

అహ్మదాబాద్​లో నివాసముంటున్న కుల్దీప్​ అనే సాప్ట్​వేర్​ ఇంజినీర్​.. ఇటీవలే డేటింగ్​ యాప్​లో అకౌంట్​ క్రియేట్​ చేసుకున్నాడు. మ్యాచ్​ల కోసం వెతుకుతుండగా.. అదితి అనే మహిళతో అతనికి పరిచయం అయ్యింది. ఇద్దరు కొన్ని రోజులు మాట్లాడుకున్నారు. తాను యూకేకు ఎక్స్​పోర్ట్స్​ చేస్తానని, ఆ మహిళ, అతనికి చెప్పింది. ఆ తర్వాత.. కుల్దీప్​కు 'బనోకాయిన్​' అనే యాప్​ గురించి చెప్పింది. ఈ క్రిప్టోకరెన్సీ యాప్​లో ఇన్​వెస్ట్​ చేస్తే భారీ లాభాలు వస్తాయని, వెంటనే పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించింది.

అమ్మాయి చెప్పింది కదా అని, ముందు వెనుక ఆలోచించకుండా.. రూ 1.లక్ష ఇన్​వెస్ట్​ చేశాడు ఆ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​. కొన్ని రోజుల్లోనే ఆ రూ.లక్షపై సుమారు రూ. 6,500 లాభం కనిపించింది. లాభాలు చూసేసరికి.. అదితిని పూర్తిగా నమ్మేశాడు కుల్దీప్​. ఇక ఆ మహిళ చెప్పడం, అతను వెంటనే ఇన్​వెస్ట్​ చేయడం చకచకా జరిగిపోయింది. ఇలా.. జులై 20 నుంచి ఆగస్ట్​ 31 వరకు.. ఏకంగా రూ. 1.34కోట్ల వరకు యాప్​లో డిపాజిట్​ చేశాడు కుల్దీప్​.

Dating app scam : సెప్టెంబర్​ 3న.. యాప్​ నుంచి రూ. 2.59లక్షలు విత్​డ్రా చేద్దామని ప్రయత్నించిన సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​కు షాక్​ తగిలింది. అకౌంట్​ ఫ్రీజ్​ చేసినట్టు మెసేజ్​ వచ్చింది. అకౌంట్​ను యాక్టివేట్​ చేయాలంటే.. రూ. 35లక్షలు డిపాజిట్​ చేయాలని మరో మెసేజ్​ వచ్చింది.

కుల్దీప్​లో భయం మొదలైంది. వెంటనే అదితికి ఫోన్​ చేశాడు. అటువైపు నుంచి సమాధానం లేదు. మళ్లీ మళ్లీ ట్రై చేసినా, అదితి ఫోన్​ ఎత్తలేదు. ఆ తర్వాత కుల్దీప్​కు అసలు విషయం అర్థమైంది. తాను భారీగా మోసపోయినట్టు గ్రహించిన అతను.. చివరికి గాంధీనగర్​ పోలీసులను ఆశ్రయించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కానీ ఇలాంటి కేసుల్లో మోసపోయిన డబ్బు తిరిగి వస్తుందా? లేదా? అనేది ప్రశ్నార్థకమే!

తస్మాత్​ జాగ్రత్త..

Cyber crime news : ఈ తరహా స్కామ్స్​ రోజు జరుగుతూనే ఉంటున్నాయి. మన కష్టంతో సంపాదించిన డబ్బును.. ఎవరో చెప్పారని, ముందు వెనుక ఆలోచించకుండా.. ఎక్కడపడితే అక్కడ డిపాజిట్​ చేయడం ఎంత వరకు కరెక్ట్​? ఒక్కసారి ఆలోచించండి.. ఇలాంటి స్కామ్స్​కు దూరంగా ఉండండి.

తదుపరి వ్యాసం