కొవిడ్ పేరుతో అరాచకం.. పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేసి..
02 April 2022, 15:35 IST
- చైనాలో అక్కడి ప్రభుత్వం అమలు చేసే కఠిన నిబంధనల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాగా కొవిడ్ పేరుతో మరో అరాచకానికి పాల్పడింది చైనా. కొవిడ్ సోకిన పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తోంది. చైనా చర్యలతో తల్లిదండ్రులు భయపడిపోతున్నారు.
షాంఘైలో…
Shanghai covid rules | కొవిడ్ పేరుతో సొంత ప్రజలపై.. చైనా ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. షాంఘైలో కరోనా సోకిన పిల్లలను.. వారి తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తోంది. పిల్లల క్షేమసమాచారాలు సైతం తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతున్నారు. ఫలితంగా తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు.
ఇంత అరాచకమా?
ఎస్తెర్ జావో అనే మహిళ.. తన రెండున్నరేళ్ల పిల్లను.. గత నెల 26న షాంఘై ఆసుపత్రికి తీసుకెళ్లింది. జ్వరంతో బాధపడుతున్న ఆ చిన్నారికి కొవిడ్ పరీక్షలు చేయించారు. అందులో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ వెంటనే జావో, ఆమె భర్తకు కూడా కరోనా పరీక్షలు చేశారు. వారిద్దరికి కూడా పాజిటివ్ వచ్చింది.
అంతే..! అక్కడితో ఆ కుటుంబం కథ మారిపోయింది. షాంఘైలో పిల్లలకు, తల్లిదండ్రులకు వేరువేరుగా క్వారంటైన్ ఏర్పాట్లు చేసింది అక్కడి ప్రభుత్వం. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా.. పిల్లలను వారి నుంచి లాగేసుకుని క్వారంటైన్లో పెడుతోంది. ఎందుకు అని ప్రశ్నిస్తే.. కొవిడ్ కట్టడి కోసం అని చెబుతోంది.
కానీ.. జావో కూతురికి రెండున్నరేళ్లే. ఆ వయస్సులో పిల్లలను ఒంటరిగా ఎలా వదిలేస్తారు? అందుకే.. అలా చేయవద్దని అధికారులను జావో వేడుకుంది. కానీ ఫలితం దక్కలేదు. రెండున్నరేళ్ల చిన్నారిని.. పిల్లల క్వారంటైన్ కేంద్రంలో పెట్టడం కష్టం కాబట్టి.. ఆమెను షాంఘై హెల్త్ క్లీనిక్‌కు పంపించారు. జావో, ఆమె భర్తను వేరువేరుగా క్వారంటైన్లో పెట్టారు.
China corona 4th wave news | అప్పటి నుంచి జావో మనసంతా తన కూతురిపైనే ఉంది. ఆమె క్షేమసమాచారాలు అడుగుతున్నా.. ఎవరు పట్టించుకోవడం లేదు. పిల్లల వివరాల కోసం ఓ గ్రూప్ చాట్ ఏర్పాటు చేశారు. పిల్లల వివరాలను అప్పుడప్పుడు వైద్యులు.. అందులో చెబుతూ ఉంటారు.
"మా బిడ్డను చూసి చాలా రోజులైంది. ఫొటోలు లేవు. నా కూతురు ఎలాంటి పరిస్థితుల్లో ఉందోనని భయమేస్తోంది," అని జావో కన్నీరు పెట్టుకుంది.
తల్లిదండ్రులకు దూరమైన పిల్లలు కన్నీరుపెట్టుకుంటున్న దృశ్యాలు.. చైనాలోని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అవి చూసిన జావో.. ఇక ఏడుపు ఆపుకోలేకపోతోంది.
ఆ దృశ్యాలు జిన్షన్ హెల్త్‌కేర్‌కు చెందినవిగా తెలుస్తోంది. అక్కడి సిబ్బందిని.. అంతర్జాతీయ మీడియా సంప్రదించగా.. వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించినా ఫలితం లేదు. 'చిన్నపిల్లలను ఎందుకింతలా హింసిస్తున్నారు?' అని ప్రశ్నించినా.. సమాధానం లేదు. అదే సమయంలో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన దృశ్యాలను ప్రభుత్వం తొలగించడం గమనార్హం.
జావోలాగే.. అనేకమంది తల్లులు క్వారంటైన్లో ఉంటున్నారు. తమ పిల్లల క్షేమసమాచారాలు అందక విలవిలలాడిపోతున్నారు.
ఒక్కోసారి.. మూడు నెలల పసికందును కూడా తల్లి నుంచి వేరుచేస్తున్నారు. 5-6ఏళ్ల పిల్లలను కూడా.. తల్లిదండ్రుల నుంచి వేరు చేసి క్వారంటైన్ కేంద్రాల్లో పెడుతున్నారు.
గత కొన్ని రోజులుగా.. చైనావ్యాప్తంగా కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేసులను నియంత్రించేందుకు ప్రభుత్వం.. లాక్డౌన్ అస్త్రాన్ని ప్రయోగించింది. కాగా.. అంతర్జాతీయంగా చూసుకుంటే.. షాంఘైలో కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. అయినప్పటికీ అక్కడి అధికారులు.. ఇలాంటి నిబంధలను పెట్టి పౌరులను మరింత బాధకు గురిచేస్తుండటం గమనార్హం.
షాంఘైలో శనివారం ఒక్కరోజే 6,051కేసులు(లక్షణాలు లేనివి) వెలుగులోకి వచ్చాయి. అంతకుముందు రోజు ఆ సంఖ్య.. 4,144గా ఉంది.
టాపిక్