'Tiranga' row | జాతీయ పతాకం కొంటేనే పేదలకు రేషన్ అట!
10 August 2022, 19:06 IST
'Tiranga' row | పేదల రేషన్ విషయంలో తప్పు చేసి చిక్కుకుపోయిన ఘటన ఇది. ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్` వేళ అందరూ తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగరవేయాలని కేంద్రం సూచించింది. తక్కువ ధరకు జాతీయ జెండాలను అందించాలన్న ఉద్దేశంతో వాటిని అన్ని రేషన్ షాపులు, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంచింది.
ప్రతీకాత్మక చిత్రం
'Tiranga' row | రేషన్ షాపులు, పోస్టాఫీసుల్లో 20 రూపాయలకే జాతీయ జెండా లభిస్తుంది. ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసింది ప్రభుత్వం. అయితే, హరియాణాలో ఒక రేషన్ షాపు యజమాని ఒక అడుగు ముందుకు వేసి. జాతీయ జెండా కొంటేనే రేషన్ ఇస్తానని పేదలపై ఒత్తిడి చేయడం ప్రారంభించాడు.
'Tiranga' row | సిగ్గు.. సిగ్గు..
జెండా కొంటేనే రేషన్ ఇస్తామని చెప్పి తమతో బలవంతంగా రూ. 20 పెట్టి జెండా కొనిపిస్తారని ఒక వ్యక్తి చెబుతున్న వీడియో సోషల్‌మీడియాలో ప్రత్యక్షమైంది. క్షణాల్లో అది వైరల్ అయింది. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ వరకూ ఆ వీడియో చేరింది. దాంతో వెంటనే ఆయన ఆ వీడియోను షేర్ చేస్తూ.. సొంత పార్టీ పైననే విమర్శలు గుప్పించారు. స్వతంత్ర స్వర్ణోత్సవాల వేళ ఇలాంటి ఘటన సిగ్గుచేటని ఎండగట్టారు. 75 ఏళ్ల స్వతంత్ర ఉత్సవాలు పేదవాడిపై భారంగా మారడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రతీ భారతీయుడి గుండెల్లో ఉండే తిరంగా బలవంతంగా కొనిపించడం ఏంటని, కొనలేని పేదవాడి నోటి దగ్గర నుంచి ఆహారాన్ని లాక్కోవడం ఏంటని ట్విటర్‌లో తీవ్రంగా ప్రశ్నించారు.
'Tiranga' row | హరియాణాలో..
హరియాణాలోని ఒక రేషన్ షాపులో ఈ కండిషన్ పెట్టారు. రూ. 20 పెట్టి జాతీయ జెండా కొనాలని, లేదంటే రేషన్ ఇవ్వమని చెప్పారు. ఇదే విషయాన్ని అక్కడి వినియోగదారుడు ఒకరు వీడియో తీశారు. పై నుంచి ఆదేశాలు వచ్చాయని, అందువల్లనే అలా జాతీయ జెండాను బలవంతంగా అమ్ముతున్నామని ఆ రేషన్ షాపులో పనిచేసే వ్యక్తి చెప్పిన విషయాన్ని కూడా ఆ వీడియోలో పొందుపర్చారు. ఈ వీడియో వైరల్ కావడంతో.. అధికారులు రంగంలోకి దిగి.. ఆ రేషన్ షాపు లైసెన్స్ రద్దు చేశారు. తాము అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదని వివరణ ఇచ్చారు.
'Tiranga' row | సోషల్ మీడియాలోనూ రచ్చ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సోషల్ మీడియా యూజర్లు జాతీయ పతాకాన్ని(display picture) తమ డీపీగా పెట్టుకోవాలన్న ఉద్యమం కూడా ప్రారంభమైంది. ప్రధాని మోదీ తన డీపీని అలాగే మార్చుకుని, అందరూ అలా జాతీయ జెండాను డీపీగా పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాంతో, అలా డీపీ పెట్టుకోని వారిని దేశభక్తి లేనివారుగా చిత్రించి, వారిని ఆన్‌లైన్ వేదికలపై వ్యక్తిగతంగా దూషించడం ప్రారంభమైంది. జాతీయ జెండాను డీపీగా పెట్టుకుంటేనే దేశభక్తి ఉన్నట్లా? అని ఈ విషయంపై కొందరు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.