సరిహద్దుల్లో శాంతి పవనాలు.. స్టాక్ మార్కెట్లకు జోష్!
15 February 2022, 16:06 IST
- Stock market news today | రష్యా- ఉక్రెయిన్ సరిహద్దుల్లో శాంతి పవనాలు నెలకొన్న తరుణంలో అంతర్జాతీయ మార్కెట్లు ఊపిరిపీల్చుకున్నాయి. ఫలితంగా.. దేశీయ సూచీలు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెనెక్స్ 1,736 పాయింట్లు, నిఫ్టీ 509.70 పాయింట్లు లాభపడ్డాయి.
భారీ లాభాల్లో ముగిసిన దేశీయ సూచీలు
stock market news live | ఉక్రెయిన్ నుంచి కొన్ని బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్టు రష్యా చెప్పడంతో అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు కాస్త శాంతించాయి. ఫలితంగా దేశీయ సూచీలు బలంగా పుంజుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 1,736.21 పాయింట్లు లాభపడి.. 58,142 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 509.70 పాయింట్లు బలపడి 17,352.45 వద్ద స్థిరపడింది.
సోమవారం భారీగా పతనమైన రంగాల్లో మంగళవారం కొనుగోళ్ల జోరు కనిపించింది. ముఖ్యంగా ఆటో, బ్యాంక్, రియాల్టి, పీఎస్యూ బ్యాంక్, ఐటీ, ఎఫ్ఎమ్సీజీ రంగాలు 2-3శాతం మేర లాభడ్డాయి.
బజాజ్ ఫినాన్స్, ఎస్బీఐ, ఎల్టీ, టైటాన్,షేర్లు 4శాతం మేర లాభపడగా.. విప్రో, రిలయన్స్, ఎయిర్టెల్ 3శాతం మేర వృద్ధి చెందాయి.
సిప్లా, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు నష్టపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్లకూ జోష్..
రష్యా- ఉక్రెయిన్ వ్యవహారం తీవ్రమైన వేళ కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉండిపోయాయి. తాజాగా.. సరిహద్దుల్లో పరిస్థితులు కాస్త శాంతించాయని వార్తలు వెలువడటంతో రష్యా, యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో నుంచి కొంతమేర తేరుకున్నాయి.
దిగొచ్చిన 'ఆయిల్'..
యుద్ధం జరిగితే సరఫరాపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలతో ముడి చమురు ధరలు ఇటీవలి కాలంలో దాదాపు 7ఏళ్ల గరిష్ఠాన్ని తాకాయి. తాజాగా శాంతి పవనాల కారణంగా కాస్త దిగొచ్చాయి. బ్యారెల్ ముడి చమురు ధర 94డాలర్లకు చేరింది.