sbi bank fd interest rates 2022: ఎస్‌బీఐ వడ్డీరేట్లు పెరిగాయి.. ఎంతంటే..
15 August 2022, 10:39 IST
sbi bank fd interest rates 2022: భారతదేశ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ(SBI) తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ. 2 కోట్ల లోపు టర్మ్ డిపాజిట్లపై మాత్రమే ఈ వడ్డీరేటు పెంపు వర్తిస్తుంది.
ప్రతీకాత్మక చిత్రం
sbi bank fd interest rates 2022: దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ రుణదాత, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన రేట్లు 13.08.2022 నుండి అమలులోకి వస్తాయని బ్యాంక్ వెబ్‌సైట్ పేర్కొంది. సవరించిన వడ్డీరేట్ల ప్రకారం.. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై.. వాటి కాల వ్యవధులను బట్టి.. సాధారణ ప్రజలకు 2.90% నుండి 5.65% వరకు వడ్డీ లభిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 3.40% నుండి 6.45% వరకు వడ్డీ లభిస్తుంది. అలాగే, "SBI Wecare” డిపాజిట్ పథకంలో చేరిన వారికి మరో 0.30% ఎక్కువ వడ్డీ లభిస్తుంది. అయితే, ఇది ఐదేళ్ల కాలపరిమితికి మించిన ఎఫ్‌డీలకు మాత్రమే వర్తిస్తుంది.
SBI interest rates : వడ్డీ రేట్లు ఇలా..
7 రోజుల నుండి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 2.90% వడ్డీ రేటు కొనసాగుతుంది. అలాగే, 46 రోజుల నుండి 179 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై 3.90% వడ్డీ రేటు కొనసాగుతుంది. 180 రోజుల నుండి 210 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఇప్పుడు 4.55% వడ్డీ రేటు లభిస్తుంది. ఇది ఇప్పటివరకు 4.40% గా ఉంది. 211 రోజుల నుండి 1 సంవత్సరం లోపు మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 4.60% గా ఉంటుంది. 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాలలోపు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై SBI ఇప్పుడు 5.45% వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. ఇది గతంలో 5.30% గా ఉంది. 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల లోపు మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 5.50 శాతానికి పెంచింది. ఇది కూడా గతంలో 5.35% గా ఉంది. 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల మధ్య కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై SBI ఇప్పుడు 5.60% వడ్డీ ఇస్తుంది. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు ఇప్పుడు 5.65% వడ్డీ రేటును ఇవ్వాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. ఇది గతంలో 5.50% గా ఉంది. సీనియర్ సిటిజన్లకు ఈ అన్ని వడ్డీ రేట్లపై 0.5% వడ్డీ ఎక్కువ లభిస్తుంది.