తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  మహిళపై సామూహిక అత్యాచారం.. ఆరు రోజుల పాటు చెరువు దగ్గరే..!

మహిళపై సామూహిక అత్యాచారం.. ఆరు రోజుల పాటు చెరువు దగ్గరే..!

HT Telugu Desk HT Telugu

11 February 2022, 19:18 IST

google News
    • ఓ మహిళ.. ఆరు రోజుల పాటు ఓ చెరువు దగ్గర అపస్మారక స్థితిలో పడి ఉన్న ఘటన రాజస్థానలో వెలుగు చూసింది. ఈ నెల 4న ఇద్దరు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె గొంతునులిమి చంపేందుకు ప్రయత్నిచారు. ఆమె మరణించిందని భావించి ఓ చెరువు వద్ద పడేసి వెళ్లారు. చివరికి.. ఆరు రోజుల తర్వాత పోలీసులు ఆమెను రక్షించారు.
మహిళపై సామూహిక అత్యాచారం.. ఆ రోజుల పాటు చెరువు దగ్గరే..!
మహిళపై సామూహిక అత్యాచారం.. ఆ రోజుల పాటు చెరువు దగ్గరే..! (hindustan times)

మహిళపై సామూహిక అత్యాచారం.. ఆ రోజుల పాటు చెరువు దగ్గరే..!

Nagaur crime news | రాజస్థాన్​లో​ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నగౌర్​ జిల్లాలో.. ఓ 35ఏళ్ల మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె గొంతునులిమి చంపే ప్రయత్నం చేశారు. ఆమె మరణిచిందని భావించి.. ఓ చెరువు దగ్గర పడేసి వెళ్లిపోయారు. ఆరు రోజుల తర్వాత పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లగా.. ఆమె బతికే ఉందని తేలింది. అంటే ఆరు రోజుల పాటు ఆమె అక్కడే అపస్మారక స్థితిలో ఉండిపోయింది.

ఇదీ జరిగింది..

ఈ నెల 4న.. ఓ మహిళ అదృశ్యమైంది. రెండు రోజుల తర్వాత.. ఆమె కుటుంబసభ్యులు డీడ్వానా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. సురేశ్​ మేఘ్వాల్​ అనే వ్యక్తి కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Didwana Nagaur crime news | అయితే బాధితురాలి ఆచూకీ కనుగొనడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన కాల్​ రికార్డింగ్​ వివరాలు వంటి విషయాలను కూడా పట్టించుకోలేదని సమాచారం. ఈ ఘటనపై స్పందించిన ఎస్​పీ రామ్​ మూర్తి.. డీడ్వానా స్టేషన్​ అధికారి, హెడ్​ కానిస్టెబుల్​ను సస్పెండ్​ చేశారు. అనంతరం కేసు బాధ్యతలను సర్కిల్​ ఇన్​స్పెక్టర్​కు అప్పగించారు. అనంతరం మేఘ్వాల్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో భాగంగా అసలు విషయాలు బయటపడ్డాయి. 4వ తేదీన.. మరో వ్యక్తితో కలిసి ఆ మహిళను అత్యాచారం చేసినట్టు మేఘ్వాల్​ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత గొంతు నులిమి చంపేసినట్టు వెల్లడించాడు.

"ఆ తర్వాతి రోజు(అంటే ఘటన జరిగిన ఆరు రోజుల తర్వాత).. పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. చివిరికి ఆమె కనిపించింది. ఆమె మరణించిందని పోలీసులు తొలుత భావించారు. కానీ ఆమె బతికే ఉందని తెలుసుకున్నారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది," అని ఎస్​పీ వెల్లడించారు.

వైద్యుల నివేదిక ఆధారంగా.. నిందితులపై అపహరణ, అత్యాచారం, హత్యా ప్రయత్నం కింద కేసులు నమోదు చేశారు అధికారులు. మరో నిందితుడిని కూడా పట్టుకున్నారు. వారికి తగిన శిక్ష విధిస్తామని స్పష్టం చేశారు.

ఆశ్రమానికి సమీపంలో మహిళ మృతదేహం

దేశంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​లో.. కొన్ని నెలల క్రితం అపహరణకు గురైన ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు తాజాగా వెలికితీశారు. సమాజ్​వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఫతేహ్​ బహదూర్​ సింగ్​కు చెందిన ఆశ్రమానికి సమీపంలో ఆ మహిళ మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ వ్యవహారంలో ఆయన కుమారుడి హస్తం ఉందని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

డిసెంబర్​ 8న.. ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​కు చెందిన 22ఏళ్ల దళిత మహిళ అనూహ్యంగా అదృశ్యమైంది. ఆ తర్వాతి రోజు.. ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాజ్​వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఫతేహ్​ బహదూర్​ సింగ్​ కుమారుడు రాజోల్​ సింగ్​.. తన కుమార్తెను అపహరించాడని ఫిర్యాదులో పేర్కొంది.

నెల రోజులు గడిచినా.. కేసులో ఎలాంటి పురోగతి లభించలేదు. గత నెల 24న, ఎస్​పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​.. లఖ్​నవూ పర్యటనలో ఉండగా.. బాధితురాలి తల్లి ఆయన వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆయన ఎదుటే తన శరీరానికి నిప్పంటించుకునేందుకు ప్రయత్నించింది. తన కుమార్తెను అపహరించారని, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించింది.

Unnao case | ఈ ఘటన జరిగిన రోజే.. పోలీసులు రాజోల్​ను అరెస్ట్​ చేశారు. విచారణ అనంతరం.. ఫతేహ్​ బహదూర్​ గతంలో కట్టిన ఆశ్రమానికి సమీపంలో.. ఓ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. అది తన కుమార్తె మృతదేహమేనని ఆ తల్లి గుర్తించింది.

మరోవైపు.. అక్రమ సంబంధం వ్యవహారమే ఈ పరిణామాలకు దారితీసిన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

"రాజోల్​ సింగ్​ను రిమాండ్​కు తరలించి విచారించాము. ఆ తర్వాత.. గురువారం నాడు మహిళ మృతదేహాన్ని వెలికితీశాము. ఆశ్రమానికి సమీపంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. స్థానిక నిఘా వ్యవస్థ ద్వారా ఘటనాస్థలాన్ని గుర్తించాము. అక్రమ సంబంధం వ్యవహారమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. విచారణ జరుగుతోంది. నేరస్థులను విడిచిపెట్టము. త్వరలోనే మిగిలినవారిని అరెస్ట్​ చేస్తాము," అని ఉన్నావ్​ అదనపు ఎస్​పీ శశి శేఖర్​ సింగ్​ మీడియాకు వెల్లడించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు పోలీసులు. కాగా మహిళపై దాడి జరిగిందని పోస్టుమార్టంలో తేలింది. అంతేకాకుండా ఆమె మెడను విరిచేశారాని, తలపై బలంగా కొట్టారని రిపోర్టులో స్పష్టమైంది.

ఎన్నికలు జరుగుతున్న ఉత్తర్​ప్రదేశ్​లో ఈ వ్యవహారం రాజకీయ దుమారానికి దారితీసింది. ఎస్​పీపై బీఎస్​పీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఘటనకు పాల్పడిన వారిని విడిచిపెట్టకూడదని, బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని బీఎస్​పీ చీఫ్​ మాయావతి ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

"దళిత మహిళ మృతదేహాన్ని ఎస్​పీ నాయకుడి పొలాల్లో వెలికితీసిన ఘటన అత్యంత బాధాకరం, అత్యంత తీవ్రమైన విషయం. ఈ ఘటన వెనక ఎస్​పీ నాయకుడి హస్తం ఉందని బాధితురాలి కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. నిందితులను అరెస్ట్​ చేసి కఠినంగా శిక్షించాలి," అని మాయావతి ట్వీట్​ చేశారు.

తదుపరి వ్యాసం