Tailor attacks customer | కత్తెరతో కస్టమర్‌పై టైలర్ దాడి.. నడిరోడ్డు మీద..!
02 February 2022, 20:50 IST
Mumbai crime news | రూ. 30 కోసం కస్టమర్‌ను కత్తెరతో పొడిచి, తీవ్రంగా గాయపరిచాడు ఓ టైలర్. ఇప్పుడు ఆ కస్టమర్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ముంబయిలో జరిగింది.
రూ. 30 కోసం కస్టమర్‌పై టైలర్ దాడి
Pant alteration dispute | మహారాష్ట్ర ముంబయిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ టైలర్.. తన కస్టమర్‌పై నడిరోడ్డు మీద కత్తెరతో దాడి చేశాడు. పారిపోయేందుకు ప్రయత్నించిన కస్టమర్‌ను వెంబడించి పట్టుకుని, కత్తెరతో అనేకమార్లు పొడిచాడు. రూ. 30 కోసం జరిగిన గొడవ ఇందుకు కారణం.
రూ. 30 కోసం..
రోహిత్ యాదవ్ అనే వ్యక్తి అంధేరీలోని ఓ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం.. ఇంటి దగ్గర ఉన్న హరీశ్ ఠాకర్(40) అనే టైలర్ దగ్గరికి వెళ్లాడు. తన ప్యాంట్ ఆల్ట్రేషన్ చేయమని చెప్పి ఠాకర్కు ఇచ్చాడు. రూ. 100 అవుతుందని టైలర్ చెప్పగా.. సరే అని రోహిత్ వెళ్లిపోయాడు.
అదే రోజు మధ్యాహ్నం.. పనైపోయిందని, వచ్చి ప్యాంట్ తీసుకోవాలని రోహిత్‌కు హరీశ్ ఫోన్ చేశాడు. అక్కడి రోహిత్ వెళ్లగా.. తొందరగా పనిపూర్తి చేశానని, అందుకే మొత్తం 130 రూపాయలు ఇవ్వాలని హరీశ్ డిమాండ్ చేశాడు. తాను రూ. 100 మాత్రమే ఇస్తానని రోహిత్ వాదించాడు. వారి మధ్య కొంతసేపు వాగ్వాదం నడిచింది.
రూ. 100 ఇచ్చి ప్యాంట్ తీసుకుని వెళ్లిపోయాడు రోహిత్. అది చూసి హరీశ్‌కు కోపమొచ్చింది. తన కత్తెరతో రోహిత్‌ను వెంబడించాడు. నడిరోడ్డు మధ్యలో రోహిత్‌ను ఆపి కత్తెరతో బెదిరించాడు. భయపడిన రోహిత్.. హరీశ్‌ను శాంతిపజేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ టైలర్ మాత్రం తన చేతిలో ఉన్న కత్తెరతో రోహిత్ కడుపులో పొడిచాడు. పారిపోడానికి ప్రయత్నించిన రోహిత్‌ను.. హరీశ్ పట్టుకుని మరీ పలుమార్లు దాడి చేశాడు. ఆ తర్వాత టైలర్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు.. రోహిత్‌ను ఆసుపత్రిలో చేర్చారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హరీశ్ ఠాకర్ కోసం తీవ్రంగా గాలించారు. మంగళవారం అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు.