Chennai rains: చెన్నైలో భారీ వర్షాలు; రజినీకాంత్ ఇంట్లోకి వరదనీరు; మరో 2 రోజులు ఇదే పరిస్థితి
16 October 2024, 18:27 IST
- చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో భారీ వర్షాలకు సూపర్ స్టార్ రజినీకాంత్ నివాస ప్రాంగణంలోకి వర్షపు నీరు చేరింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు, ఈ రోజు రాత్రి వరకు తుపాను తీరం దాటుతుందని, మరో రెండు రోజులు చెన్నై సహా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
చెన్నైలో భారీ వర్షాలు
Chennai rains: చెన్నై, పరిసర జిల్లాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షానికి జన జీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారుల్లో భారీగా వరద నీరు చేరింది. దాంతో, పలు ప్రాంతాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. చెన్నై నగరంలో నిత్యావసర సేవలకు అంతరాయం ఏర్పడింది.
రజినీ కాంత్ ఇంట్లోకి వరదనీరు
నగరంలో ల్యాండ్ మార్క్ అయిన పోయెస్ గార్డెన్ లోని సూపర్ స్టార్ రజినీకాంత్ విలాసవంతమైన విల్లా లోకి భారీగా వరద నీరు చేరింది. రజినీ కాంత్ (Rajini kanth) ఇంటిముందు భారీగా వరద నీరు చేరిన దృశ్యాలను చూపే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోతో పాటు చెన్నై వరదలను చూపిస్తున్న వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. సూపర్ స్టార్ ఇంకా బహిరంగ ప్రకటన చేయనప్పటికీ, రజినీకాంత్ ఇంటి భద్రతను నిర్ధారించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. రజినీకాంత్ నివాసానికి వరద (Flood) రావడం ఇదే మొదటిసారి కాదు. 2023 లో చెన్నైలో మిచాంగ్ తుఫాను కారణంగా ఇలాంటి సంఘటన జరిగింది.
డ్రైనేజీ వ్యవస్థపై భారం
భారీ వర్షాలకు చెన్నై (chennai) నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ అతలాకుతలం కావడంతో నగరంలో ఈ దుస్థితి నెలకొంది. అయితే రజినీకాంత్ నివాసం చుట్టుపక్కల ఉన్న నీటిని బయటకు పంపేందుకు నగరపాలక సంస్థ అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. మరోవైపు, భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నై సెంట్రల్-మైసూరు కావేరి ఎక్స్ ప్రెస్ తో సహా నాలుగు ఎక్స్ప్రెస్ రైళ్లను దక్షిణ రైల్వే రద్దు చేసింది. పలు రైళ్లను చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కు దారి మళ్లించడం లేదా నిలిపివేయడం జరిగింది. చెన్నై నుంచి బయల్దేరే పలు దేశీయ విమానాలను కూడా రద్దు చేశారు.
వాతావరణ హెచ్చరిక
అల్పపీడనం ఈ రోజు తీరం దాటే అవకాశం ఉండడంతో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, చెన్నై జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు తీరం వైపు కదులుతుండటంతో చెన్నై, పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం అక్టోబర్ 17 తెల్లవారుజామున పుదుచ్చేరి- నెల్లూరు మధ్య ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. తమిళనాడులో ఈ నెల 17న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
చెన్నై వర్షాలు ప్రభుత్వ స్పందన
తమిళనాడు ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు అత్యవసర సేవలు మినహా సెలవు ప్రకటించింది. డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, 219 బోట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతే తప్ప ప్రయాణాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. వర్షాలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి చెన్నై కార్పొరేషన్ 24 గంటల కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది. నీట మునిగిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.