Rajasthan budget 2023 : పాత బడ్జెట్‌నే మళ్లీ చదివిన సీఎం! విపక్షాలు ఫైర్..
10 February 2023, 12:35 IST
Rajasthan budget 2023 live : రాజస్థాన్ సీఎం అశోక్ అశోక్ గహ్లోత్.. రాష్ట్ర అసెంబ్లీలో పాత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు! ఈ విషయంపై విపక్షాలు మండిపడ్డాయి.
బడ్జెట్‌కు ముందు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్..
Rajasthan budget 2023 live : బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాజస్థాన్ అసెంబ్లీలో శుక్రవారం తీవ్ర గందరగోళం నెలకొంది. సీఎం అశోక్ గహ్లోత్.. పాత బడ్జెట్‌నే ప్రవేశపెట్టారని విపక్ష బీజేపీ ఆరోపించింది. బడ్జెట్ డాక్యుమెంట్లు లీక్ అయినట్టు విమర్శించింది. బీజేపీ నిరసనల మధ్య సభ 30 నిమిషాల పాటు వాయిదా పడింది.
ఇదీ జరిగింది..
రాజస్థాన్‌లో సీఎం పదవితో పాటు ఆర్థికశాఖ బాధ్యతలు కూడా అశోక్ గహ్లోత్ చేతుల్లోనే ఉంది. కాగా.. శుక్రవారం ఉదయం ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది చివర్లో.. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అశోక్ గహ్లోత్ బృందం రూపొందించిన బడ్జెట్‌పై అక్కడి ప్రజల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
Ashok Gehlot Rajasthan budget 2023 : అయితే.. బడ్జెట్ డాక్యుమెంట్లలో పొరపాటు జరిగినట్టు తెలుస్తోంది! 2023-24 బడ్జెట్‌కి బదులు పాత బడ్జెట్ సారాంశాన్నే అశోక్ గహ్లోత్ మళ్లీ చదివినట్టు సమాచారం. పట్టణాభివృద్ధి, కృషి బడ్జెట్ వంటి అంశాలపై 8 నిమిషాల పాటు అశోక్ గహ్లోత్ చేసిన ప్రసంగం.. 2022-23 బడ్జెట్‌ను పోలి ఉంది! ఈ విషయాన్ని గ్రహించిన విపక్ష బీజేపీ.. సభలో గందరగోళాన్ని సృష్టించింది.
బడ్జెట్ ప్రతులను సీఎం మాత్రమే తీసుకురావాలని, కానీ ఇప్పుడు ఆ డాక్యుమెంట్లు అధికారుల చేతులు మారుతూ వస్తున్నాయని బీజేపీ పేర్కొంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందే.. బడ్జెట్ డాక్యుమెంట్లు లీక్ అయ్యాయని ఆరోపించింది.
Rajasthan budget 2023 : ఈ పరిణామాలపై బీజేపీ నేత, మాజీ సీఎం వసుంధర రాజే.. అశోక్ గహ్లోత్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
"అసలు ఏ బడ్జెట్ చదువుతున్నారో సీఎంకే తెలియడం లేదు. సభలోకి వచ్చే ముందు కనీసం ఒక్కసారి కూడా చూసుకుని ఉండరు. దీని బట్టి.. ప్రజా పాలనలో ఈ ప్రభుత్వం ఎంత సీరియస్‌గా ఉందో తెలిసిపోతోంది. ఇలాంటి వారు పాలిస్తున్నంత కాలం.. ఈ రాష్ట్రం నాశనం అవ్వకతప్పదు. నేను సీఎంగా ఉన్నప్పుడు కనీసం 2,3 సార్లైనా బడ్జెట్‌ను చదివి, ఆ తర్వాతే అసెంబ్లీలోకి తీసుకొచ్చేదానిని," అని వసుంధర రాజే తన నిరసన వ్యక్తం చేశారు.
సభ వాయిదా..
Ashok Gehlot latest news : బీజేపీ నేతల నిరసనలు రాజస్థాన్ అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణానికి దారి తీశాయి. నేతల నిరసనలను నియంత్రించేందుకు స్పీకర్ సీపీ జోషి విఫలయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సభ 30 నిమిషాల పాటు వాయిదా పడింది. అనంతరం స్పీకర్ వెల్‌లోకి వెళ్లిన బీజేపీ నేతలు అక్కడ బైఠాయించి ఆందోళన చేపట్టారు.
గహ్లోత్ వివరణ..
పాత బడ్జెట్‌ను చదివిన వ్యవహారంపై వివరణ ఇచ్చారు గహ్లోత్.
“మీకు బడ్జెట్ కాపీలు ఇచ్చాము. నా దగ్గర ఉన్న దానిలో ఒక పేజీ తప్పుగా వచ్చింది. అది చదివాను. రెండింట్లో వ్యత్యాసాన్ని మీరు చెప్పగలరు. అంత మాత్రన బడ్జెట్ లీక్ అయ్యిందని ఎలా అనగలరు?” అని అన్నారు అశోక్ గహ్లోత్.