Telangana Budget : బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్!
Telangana Cabinet Meet : తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ లోని ఆయన అధికారిక నివాసం ప్రగతి భవన్ లో సమావేశం జరిగింది. బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
తెలంగాణ కేబినెట్(Telangana Cabinet).. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించింది. ఈ మేరకు 2023-2024 రాష్ట్ర బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ(Assembly)లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టనుందని వార్తలు వస్తున్నాయి. కొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections) జరగనున్నాయి. టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్(BRS)గా మారిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇది.

దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ(BRS Party) విస్తరించాలని.. ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ కు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అధిక కేటాయింపులు బడ్జెట్లో ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కేబినెట్ బడ్జెట్ మీద చర్చించింది. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
3వ తేదీన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మెుదలు అయ్యాయి. 12వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు(Budget Sessions) ఉంటాయి. బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు ప్రవేశ పెడతారు. 9 నుండి 11 వ తేదీ వరకు శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులపై అసెంబ్లీ(Assembly)లో చర్చ ఉండనుంది. ఈ నెల 12న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చిస్తారు. ద్రవ్యి వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడే ఛాన్స్ ఉంది.
తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్(KCR) మహారాష్ట్రలోని నాందేడ్ కు బయలుదేరారు. బీఆర్ఎస్ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ వెలుపల బీఆర్ఎస్ మెుదటి సభ ఇది. సభ కోసం భారీగా జనాలను తరలిస్తున్నారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన సభ తర్వాత పార్టీకి ఇది రెండో బహిరంగ సభ. ఈ సమావేశంలో నాందేడ్, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో నాయకులు BRSలో చేరనున్నారు.