Rahul Gandhi Bharat Nyay Yatra: జనవరి 14 నుంచి ‘‘భారత్ న్యాయ యాత్ర’’ చేపట్టనున్న రాహుల్ గాంధీ
27 December 2023, 12:00 IST
Rahul Gandhi Bharat Nyay Yatra: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరో విస్తృత యాత్రకు తెర లేపారు. జనవరి 14 నుంచి ఆయన ‘భారత న్యాయ యాత్ర (Bharat Nyay Yatra)’ ను చేపట్టనున్నారు.
రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)
Rahul Gandhi Bharat Nyay Yatra: ఈశాన్య, మధ్య భారత రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ చేపట్టనున్న ఈ భారత న్యాయ యాత్ర (Rahul Gandhi Bharat Nyay Yatra) కొనసాగుతుంది. గతంలో, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఘన విజయం సాధించిన నేపథ్యంలో, లోక్ సభ ఎన్నికల ముందు ఈ భారత న్యాయ యాత్రకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది.
మణిపూర్ నుంచి..
రాహుల్ గాంధీ జనవరి 14 నుంచి చేపట్టనున్న భారత న్యాయ యాత్ర (Rahul Gandhi Bharat Nyay Yatra) మణిపూర్ నుంచి ప్రారంభమై ముంబైలో ముగుస్తుంది. ఈ యాత్ర మణిపూర్, అస్సాం, పశ్చిమ బెంగాల్, బిహార్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర సహా మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో జరుగుతుంది. ఈ భారత న్యాయ యాత్ర జనవరి 14న మణిపూర్ లో ప్రారంభమై, 6200 కిలో మీటర్లు కొనసాగి మార్చి 20వ తేదీన ముంబైలో భారీ బహిరంగ సభతో ముగుస్తుంది.
ఇది పాదయాత్ర కాదు.. బస్సు యాత్ర
రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత న్యాయ యాత్ర వివరాలను కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్ లు మీడియాకు వివరించారు. ఈ యాత్ర భారత్ జోడో యాత్ర (Bharat jodo yatra) తరహాలో పాదయాత్రగా సాగదని వారు తెలిపారు. భారత న్యాయ యాత్ర బస్సులో కొనసాగుతుందన్నారు. అయితే, మధ్య మధ్యలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకమవుతారని తెలిపారు. ఈ యాత్రలో మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో రాహుల్ పర్యటిస్తారన్నారు.
అందరికీ న్యాయం లక్ష్యంతో..
దేశ ప్రజలందరికీ న్యాయం అందాలన్నదే రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టనున్న ఈ యాత్ర లక్ష్యమని కేసీ వేణుగోపాల్ తెలిపారు. అందువల్ల యాత్ర పేరును భారత్ న్యాయ యాత్ర గా నిర్ధారించామన్నారు. ఈ యాత్రలో రాహుల్ గాంధీ మహిళలు, యువత, వలస కూలీలు సహా అణగారిన వర్గాలు, ప్రస్తుత ప్రభుత్వ తీరుతో అన్యాయానికి గురైన వారిని కలుస్తారని వెల్లడించారు.
మణిపూర్ నుంచి..
ఈ యాత్రను మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ప్రారంభిస్తారు. గత కొన్ని నెలలుగా హింసకు గురవుతున్న మణిపూర్ ప్రజలకు సాంత్వన చేకూర్చాలన్న ఉద్దేశంతో ఈ యాత్రను మణిపూర్ నుంచి ప్రారంభిస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఆ యాత్రను 2022 సెప్టెంబర్ 7 న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభించి 2023 జనవరి 30న కశ్మీర్ లోని శ్రీనగర్ లో ముగించారు. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతల గుండా సాగిన ఆ పాదయాత్రలో రాహుల్ గాంధీ 3970 కిలోమీటర్లు నడిచారు.