Putin- G20: రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో జరిగే జీ 20 సదస్సుకు రాలేరు: రష్యా
26 August 2023, 17:22 IST
Putin- G20: భారత చిరకాల మిత్ర దేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో జరగనున్న జీ 20 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావడం లేదు. ప్రెసిడెంట్ పుతిన్ జీ 20 సదస్సుకు వ్యక్తిగతంగా హాజరుకావడం లేదు. ఆయనకు ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు అని రష్యా ప్రకటించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
Putin- G20: భారత చిరకాల మిత్ర దేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో జరగనున్న జీ 20 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావడం లేదు. ప్రెసిడెంట్ పుతిన్ జీ 20 సదస్సుకు వ్యక్తిగతంగా హాజరుకావడం లేదు. ఆయనకు ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు అని రష్యా ప్రకటించింది. వర్చువల్ గా ఈ సదస్సులో పాల్గొనే అవకాశాలపై ఇప్పుడే చెప్పలేమని తెలిపింది. బిజీ షెడ్యూల్ కారణంగా జీ 20 సదస్సులో పుతిన్ పాల్గొనలేకపోతున్నారని రష్యా తెలిపింది. ఉక్రెయిన్ తో ఉద్రిక్త పరిస్థితులు, మిలటరీ ఆపరేషన్ ల నేపథ్యంలో భారత్ కు స్వయంగా పుతిన్ వెళ్లే అవకాశాలు లేవని తెలిపింది.
భారత్ అధ్యక్షత
జీ 20 కి ప్రస్తుతం భారత్ అధ్యక్ష హోదాలో ఉంది. అందువల్ల ఈ కూటమి శిఖరాగ్ర సదస్సును సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 11 తేదీల మధ్య ఢిల్లీలో భారత్ నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు దాదాపు 30 దేశాల అధినేతలు హాజరుకానున్నారు. సుమారు 15 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా హాజరవుతారు. అయితే ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరుకాబోవడం లేదని రష్యా అధికారికంగా ప్రకటించింది. ప్రెసిడెంట్ పుతిన్ కు ఆ ఆలోచన లేదని స్పష్టం చేసింది. జీ 20 సదస్సుకు హాజరుకావాలని కోరుతూ రష్యా సహా జీ 20 సభ్య దేశాలకు, 9 గెస్ట్ దేశాలకు భారత్ ఇప్పటికే ఆహ్వానాలు పంపించింది.
గతంలోనూ గైర్హాజరు..
కొన్నేళ్లుగా పుతిన్ చాలా అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకు గైర్హాజరయ్యారు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని జోహన్నస్ బర్గ్ లో జరిగిన బ్రిక్స్ సదస్సుకు కూడా పుతిన్ హాజరు కాలేదు. కాని వర్చువల్ గా పాల్గొన్నారు. అలాగే, రోమ్ లో జరిగిన 2021 జీ 20 సదస్సును కూడా పుతిన్ స్కిప్ చేశారు. కోవిడ్ 19 సమస్యలతో ఆ సదస్సుకు పుతిన్ సహా చాలా మంది దేశాధినేతలు హాజరుకాలేకపోయారు. ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా 2022 లో బాలిలో జరిగిన జీ 20 సదస్సులో కూడా పుతిన్ పాల్గొనలేదు.