Crime news : గర్భవతిని చేశాడు- పెళ్లి చేసుకోమంటే చంపేశాడు.. దిల్లీలో దారుణం!
26 October 2024, 9:50 IST
- Man kills lover in Delhi : ఓ 19ఏళ్ల యువతిని ఆమె బాయ్‌ఫ్రెండ్ గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని ఆమె ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. చివరికి, ఆమెని ఆ వ్యక్తి చంపేశాడు! దిల్లీలో జరిగింది ఈ ఘటన.
దిల్లీలో దారుణం!
దేశ రాజధాని దిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి, తన గర్ల్‌ఫ్రెండ్‌ని గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని ఆమె అడుగ్గా, కోపంతో ఆ యువతిని చంపేసి, మృతదేహాన్ని పాతిపెట్టాడు! మృతిచెందిన యువతి వయస్సు కేవలం 19!
ఇదీ జరిగింది..
పశ్చిమ దిల్లీలోని నంగ్లోయి అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివాసముండే సోని అనే 19ఏళ్ల యువతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు 6వేలకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమెకు సంజు అలియాస్ సలీమ్ అనే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. వారిద్దరికి సంబంధించిన ఫొటోలు వారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్‌లో చాలానే ఉన్నాయి.
అయితే సలీమ్ సోనీని గర్భవతి చేశాడు. పెళ్లి చేసుకుందామని ఆమె పదేపదే అతడిని అడిగడం మొదలుపెట్టింది! కానీ సలీమ్ ఎప్పుడూ సోనీని సీరియస్‌గా తీసుకోలేదు. చివరికి, 7వ నెల వచ్చేసరికి పెళ్లి గురించి సోనీ మరింత మాట్లాడటం మొదలుపెట్టింది. కానీ తాను పెళ్లికి సిద్ధంగా లేనని, అబార్షన చేయించుకోవాలని అతను చెప్పేవాడు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య తరచూ గొడవ జరిగేది. ఈ నేపథ్యంలోనే సలీమ్, సోనీని చంపాలని నిర్ణయించుకున్నాడు.
గత సోమవారం.. సలీమ్‌ని చూసేందుకు సోనీ వెళ్లింది. అప్పుడే అతను మరో ఇద్దరు సన్నిహితులను పిలిపించాడు. వారందరు కలిసి సోనీని హరియాణాలోని రోహ్తక్కి తీసుకెళ్లారు. అక్కడ, వారందరు సోనీని చంపేశారు. ఎవరికీ దొరకకుండా మృతదేహాన్ని పాతిపెట్టారు.
సోనీ ఇంటికి తిరిగిరాకపోవడంతో ఇంట్లో వాళ్లకి ఆందోళన మొదలైంది. వారు పోలీసులను సంప్రదించారు. "ఎవరితోనే సోనీ ఎక్కువ మాట్లాడుతోందని మాకు తెలుసు. కానీ అతనెవరో తెలియదు," అని చెప్పారు.
చివరికి.. దర్యాప్తు సలీమ్ వరకు వెళ్లింది. ఫలితంగా అసలు విషయం బయటపడింది. పోలీసులు సలీమ్‌ని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
బాయ్‌ఫ్రెండ్‌ని చంపిన మహిళ..
మరోవైపు ఓ మహిళ, తన బాయ్‌ఫ్రెండ్‌ని చంపిన ఘటన దిల్లీలోని ముకుంద్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం మహిళ అతడి తలపై గ్రైండింగ్ స్టోన్‌తో కొట్టింది, ఆపై సుత్తితో కొట్టి, చివరకు కత్తితో పొడిచి చంపేసింది.
మృతుడిని మహ్మద్ తవారాక్ (30)గా గుర్తించారు. అతన్ని చంపిన తర్వాత నిందితురాలు మున్నీ యాదవ్ సమీపంలోని భల్స్వా డెయిరీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి హత్య చేసినట్లు అంగీకరించింది. అయితే తవారాక్ తరచూ తనపై దాడి చేయడంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు తెలిపారు.
యాదవ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
2022లో ముకుంద్‌పూర్ పార్ట్ 2లోని ఓ ఫ్లాట్‌లో యాదవ్, తవారక్ కలిసి నివసించడం ప్రారంభించారని పోలీసులు తెలిపారు. వీరిద్దరికి గతంలోనే వేరువేరు పెళ్లిళ్లు జరిగాయి. యాదవ్‌కు నలుగురు, తవారాక్, ఒక బిడ్డ ఉన్నారు.
వారిమధ్య మనస్పర్థలు ఉండేవని, చిన్నచిన్న విషయాలకు తరచూ గొడవపడేవారని ఇరుగుపొరుగు వారు తమకు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు.
తవారాక్ తరచూ మద్యం సేవించి తనను, తన పిల్లలను కొట్టేవాడని యాదవ్ దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఔటర్) నితిన్ వల్సన్ తెలిపారు.