PM Modi: ‘‘మూడున్నర గంటల నిద్ర; సాయంత్రం ఆరు లోపే భోజనం’’- ఎంపీలతో ప్రధాని మోదీ పంచుకున్నవిశేషాలు
10 February 2024, 16:37 IST
PM surprise lunch to MPs: వేరువేరు పార్టీలకు చెందిన కొందరు ఎంపిక చేసిన ఎంపీలకు ప్రధాని మోదీ సర్ ప్రైజ్ ఇచ్చారు. జీవితకాలంలో ప్రధాని మోదీ ఇచ్చిన ఈ సర్ ప్రైజ్ ను మర్చిపోలేమని ఆ ఎంపీలు చెబుతున్నారు. వారికి పార్లమెంట్ క్యాంటీన్ లో ప్రధాని మోదీ లంచ్ పార్టీ ఇచ్చారు.
పార్లమెంట్ క్యాంటీన్ లో ప్రధాని తో కలిసి లంచ్ చేస్తున్న ఎంపీలు
PM surprise lunch to MPs: పార్లమెంటులో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వేరువేరు పార్టీలకు చెందిన కొందరు ఎంపిక చేసిన ఎంపీలను తనతో పాటు లంచ్ కు తీసుకెళ్లి, వారిని ఆశ్చర్యపరిచారు.
8 మంది ఎంపీలు
పార్లమెంట్ క్యాంటీన్ లో ఆ 8 మంది ఎంపీలు ప్రధానితో పాటు కూర్చుని అన్నం, కిచిడీ, పనీర్, పప్పు, రాగి మిఠాయిలు తిన్నారు. ఈ సందర్భంగా తన దినచర్యలోని పలు విశేషాలను మోదీ వారితో పంచుకున్నారు. ఈ లంచ్ పార్టీ బిల్లును కూడా ప్రధాని మోదీ తానే స్వయంగా చెల్లించడం విశేషం.
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా..
ప్రధాని ప్రత్యేకంగా ఎంపిక చేసి తనతో పాటు లంచ్ కు తీసుకువెళ్లిన ఎంపీల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ఆయనతో పాటు బీజేడీ నేత సుస్మిత్ పాత్రా, ఆర్ఎస్పీ నేత ఎన్కే ప్రేమచంద్రన్, బీఎస్పీ నుంచి రితేష్ పాండే, బీజేపీ నుంచి హీనా గవిట్, ఎస్ ఫాంగ్నన్ కొన్యక్, జమ్యాంగ్ సెరింగ్ నామ్గ్యాల్, ఎల్ మురుగన్ ఉన్నారు.
ఆశ్చర్యపోయారు..
అకస్మాత్తుగా ప్రధాని మోదీ (PM Modi) పార్లమెంట్ లో ఎంపీలకు ఉద్దేశించిన క్యాంటీన్ లో కనిపించడంతో అక్కడ భోజనం చేస్తున్న ఇతర ఎంపీలు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రధాని మోదీ తో పాటు వివిధ పార్టీలకు చెందిన 8 మంది ఎంపీలు కూడా ఉండడంతో వారు కాసేపు ఏం జరుగుతోంది అన్న అయోమయానికి గురయ్యారు. అకస్మాత్తుగా తమను భోజనానికి తీసుకువెళ్లడంపై ఆ 8 మంది ఎంపీలు కూడా ఆనంద, ఆశ్చర్యాలకు లోనయ్యారు. ఆ తరువాత తమ సంతోషాన్ని వారు పలు వార్తా మాధ్యమాలతో పంచుకున్నారు.
మూడున్నర గంటల నిద్ర
పార్లమెంట్ క్యాంటీన్ లో లంచ్ లో తనతో పాటు కూర్చున్న ఎంపీలతో పిచ్చాపాటిగా పలు విషయాలను ప్రధాని మోదీ (PM Modi) చెప్పారు. తన దినచర్య విశేషాలు, తన విదేశీ పర్యటన అనుభవాలు, తాను కరాచీ వెళ్లిన నాటి విషయాలు ప్రధాని మోదీ వారికి వివరించారు. రోజులో తాను మూడున్నర గంటలు మాత్రమే నిద్రిస్తానని వారికి చెప్పారు. అలాగే, తాను సాయంత్రం 6 లోపే రాత్రి భోజనం ముగిస్తానని, ఆ తరువాత ఏమీ తీసుకోనని వివరించారు. ఆ ఎంపీలతో కలిసి ప్రధాని మోదీ పార్లమెంట్ క్యాంటీన్ లో దాదాపు 45 నిమిషాలు ఉన్నారు.
వివిధ పార్టీల ఎంపీలు..
ప్రధానితో లంచ్ చేసిన ఎంపీలు పార్టీలకు అతీతంగా, భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ‘‘ప్రధాని మోదీ సాధారణ వ్యక్తిలా మాతో కూర్చున్నారు. ప్రధానిలా కూర్చోలేదు.. భోజనం తర్వాత బిల్లు కూడా ప్రధానినే చెల్లించారు. ఆ ఫీలింగ్స్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నా. అవి జీవితంలో మరచిపోలేని క్షణాలు’’ అని ఎంపీ మురుగన్ ప్రధాని మోదీతో కలిసి భోజనం చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
టెన్షన్ పడ్డాను..
ప్రధాని మోదీ తన కోసం అడిగారని తెలియగానే తాను కొంచెం టెన్షన్ పడ్డానని బీజేపీ ఎంపీ హీనా గవిత్ అన్నారు. ‘‘నేను అక్కడికి చేరుకునే సరికి అప్పటికే ఇతర పార్టీలకు చెందిన మరికొంత మంది ఎంపీలు అక్కడే ఉన్నారు. ప్రధానిని కలిశాం. చిరునవ్వుతో పలకరించారు. మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నానని చెప్పారు. మేము ఆయనను అనుసరించాము. అతను మమ్మల్ని పార్లమెంటు హౌస్ లోని ఎంపిల క్యాంటీన్ కు తీసుకెళ్లాడు. మేము అక్కడికి చేరుకునేసరికి అప్పటికే అక్కడ భోజనం చేస్తున్న ఎంపీలు అక్కడ ప్రధానిని చూసి కాస్త షాక్ అయ్యారు. ప్రధానితో కలిసి లంచ్ చేయడం మరపురాని అనుభవం... ఇది జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం' అని బీజేపీ ఎంపీ హీనా పేర్కొన్నారు.