PM Modi election campaign: ప్రధాని మోదీ లోక్ సభ ఎన్నికల ప్రచారం ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు? పార్టీ వర్గాలు ఏమంటున్నాయి?
24 January 2024, 14:31 IST
PM Modi election campaign: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో మూడు నెలల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. దాంతో, రాజకీయ పార్టీలు ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రచారాన్ని ఎక్కడి నుంచి ప్రారంభిస్తారనే చర్చ ప్రారంభమైంది.
ప్రధాని నరేంద్ర మోదీ
PM Modi election campaign: ప్రధాని నరేంద్ర మోదీ 2024 లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. తూర్పు యూపీలోని వారణాసి లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని జనవరి 25న బులంద్ షహర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
బులంద్ షహర్ నుంచి..
అయోధ్య (Ayodhya) లో నూతనంగా నిర్మించిన ఆలయంలో రామ్ లల్లా ప్రతిష్ఠా (ayodhya ram mandir) కార్యక్రమం జరిగిన కొద్ది రోజులకే బులంద్ షహర్ లో ఈ ర్యాలీ జరగనుంది. ఈ భారీ బహిరంగ సభ ఏర్పాట్లలో పార్టీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు నిమగ్నమయ్యారు. ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ ర్యాలీకి కనీసం ఐదు లక్షల మంది హాజరవుతారని భారతీయ జనతా పార్టీ పేర్కొంది.
బులంద్ షహర్ ఎందుకు?
ప్రధాని మోదీ (PM Modi) తన సొంత నియోజకవర్గమైన ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని అంతా భావించారు. కానీ, తొలి ఎన్నికల ప్రచార సభను నిర్వహించడానికి బులంద్ షహర్ ను ప్రధాని మోదీ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో 80 స్థానాలకు గాను 71 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో, వాటిలో మరో 9 స్థానాలు కోల్పోయి, 62 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ (సోనేలాల్) రెండు స్థానాల్లో విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని 14 స్థానాలకు గాను 8 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. 2024 ఎన్నికల్లో పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో అన్ని సీట్లను గెలిచేలా చక్రం తిప్పడానికి ప్రధాని మోదీ సిద్ధమవుతున్నారని, అందుకే, బులంద్ షహర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
సమాజ్ వాదీ - కాంగ్రెస్ పొత్తు
లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ ఎల్ డీ)తో పొత్తును ప్రకటించిన మరుసటి రోజే సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాష్ట్రంలో సీట్ల పంపకాలను ఖరారు చేయడానికి కాంగ్రెస్ తో మరిన్ని చర్చలు జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సీట్ల కేటాయింపు నిర్ణయాల్లో గెలుపోటములే ప్రధాన ప్రమాణమని పేర్కొంటూ లక్నోలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. కొత్త ఓటరు జాబితాలో మద్దతుదారుల నమోదు జరిగేలా చూడాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు.రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం కొంతమంది పార్టీ కార్యకర్తల పేర్లను జాబితా నుండి తొలగించిందని ఆయన ఆరోపించారు. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ప్రాథమిక స్థాయిలో సీట్ల సర్దుబాటు చర్చలు జరిపాయి.