PM Modi: ఢిల్లీ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు; శివ శక్తి పాయింట్ పై వివరణ
26 August 2023, 15:57 IST
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నగర ప్రజలకు ముందస్తు క్షమాపణలు చెప్పారు. రానున్న జీ 20 సదస్సు సందర్భంగా నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని, నగరవాసులకు కొంత ఇబ్బంది తప్పదని, అందువల్ల ముందే క్షమాపణలు చెబుతున్నానని వివరించారు.
ప్రతీకాత్మక చిత్రం
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నగర ప్రజలకు ముందస్తు క్షమాపణలు చెప్పారు. రానున్న జీ 20 సదస్సు సందర్భంగా నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని, నగరవాసులకు కొంత ఇబ్బంది తప్పదని, అందువల్ల ముందే క్షమాపణలు చెబుతున్నానని వివరించారు. బెంగళూరు నుంచి ఢిల్లీ చేరుకున్న అనంతరం, ఢిల్లీ విమానాశ్రయం వెలుపల ఆయన అక్కడికి భారీగా వచ్చిన అభిమానులను ఉద్దేశించి కాసేపు ప్రసంగించారు.
జీ 20 సదస్సు..
‘‘సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 15 మధ్య ఢిల్లీలో జీ 20 సదస్సు కార్యక్రమాలు జరగనున్నాయి. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఢిల్లీకి రానున్నారు. అందువల్ల వారికి ఇబ్బంది కలగకుండా, అన్ని ఏర్పాట్లు చేసి, జీ 20 సదస్సును సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. అందువల్ల నగరంలో కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. ఈ అసౌకర్యాన్ని నగర ప్రజలు ఓర్చుకోవాలి. ఈ అసౌకర్యానికి గానూ వారికి నేను ముందే క్షమాపణలు చెబుతున్నాను’’ అని ప్రధాని మోదీ తెలిపారు.
శివశక్తి పాయింట్..
బెంగళూరులో ఇస్రో సైంటిస్ట్ లను ఉద్దేశించి ప్రసంగిస్తూ. . ప్రధాని మోదీ చంద్రయాన్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ అయిన ప్రదేశానికి శివశక్తి పాయింట్ అని పేరు పెట్టారు. ఆ ప్రదేశానికి శివశక్తి పాయింట్ అని పేరు పెట్టడానికి గల కారణాన్ని ప్రధాని మోదీ ఢిల్లీలో వివరించారు. శివ శబ్ధాన్ని మహాదేవుడి పేరుగానే కాకుండా, శుభప్రదానికి గుర్తుగా ఉపయోగిస్తామని, అలాగే, నారీ శక్తిని శక్తిగా పూజిస్తామని ప్రధాని తెలిపారు. అందువల్ల చంద్రుడిపై చంద్రయాన్ 3 దిగిన ప్రాంతాన్ని శివశక్తి పాయింట్ గా పేరు పెట్టామని వెల్లడించారు.