PM Modi: ప్రధానికి స్వాగతం తెలపడానికి కర్నాటక సీఎం రాకపోవడంపై రాజకీయ దుమారం; నేనే రావద్దన్నాను అన్న ప్రధాని మోదీ
PM Modi: ప్రధాని మోదీ అనూహ్య బెంగళూరు పర్యటన టీ కప్పులో తుపాను వంటి చిన్నపాటి రాజకీయ దుమారానికి తెరలేపింది. అయితే, ప్రధాని మోదీ స్వయంగా వివరణ ఇచ్చి, ఆ వివాదానికి తెరవేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
PM Modi: ప్రధాని మోదీ అనూహ్య బెంగళూరు పర్యటన టీ కప్పులో తుపాను వంటి చిన్నపాటి రాజకీయ దుమారానికి తెరలేపింది. అయితే, ప్రధాని మోదీ స్వయంగా వివరణ ఇచ్చి, ఆ వివాదానికి తెరవేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
మోదీ కి స్వాగతం చెప్పని సీఎం..
ప్రధాని నరేంద్ర మోదీ గ్రీస్ నుంచి నేరుగా బెంగళూరుకు వచ్చారు. చంద్రయాన్ 3 విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలను స్వయంగా కలిసి, అభినందనలు తెలియజేసే ఉద్దేశంతో ఈ పర్యటన పెట్టుకున్నారు. గ్రీస్ రాజధాని ఏథెన్స్ నుంచి నేరుగా బెంగళూరు లోని హెచ్ఏఎల్ ఎయిర్ పోర్ట్ కు శనివారం ఉదయం 6 గంటలకు ఆయన చేరుకున్నారు. అయితే, ప్రధానికి స్వాగతం తెలపడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కానీ, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కానీ రాలేదు. వారికి ప్రధాని కార్యాలయం నుంచి ప్రధాని రాక గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో వారు స్వాగతం తెలపడానికి రాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కారణంగానే ప్రధాని సీఎం, డెప్యూటీ సీఎంలకు సమాచారం ఇవ్వలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శించారు.
ప్రధాని వివరణ
దీనిపై ప్రధాని మోదీ స్వయంగా వివరణ ఇచ్చారు. ఏథెన్స్ నుంచి సుదీర్ఘ ప్రయాణం కారణంగా బెంగళూరుకు కచ్చితంగా ఎప్పుడు చేరుకుంటామో తెలియని పరిస్థితి ఉండడం వల్ల రాష్ట్రం సీఎం, ఇతర అధికారులను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో ప్రొటోకాల్ పాటించాల్సిన అవసరం లేదని తానే చెప్పానని ప్రధాని మోదీ వివరించారు. ఇస్రో సైంటిస్ట్ లను స్వయంగా కలిసి, శుభాకాంక్షలు తెలపాలన్న ఉద్దేశంతో అకస్మాత్తుగా బెంగళూరు పర్యటన పెట్టుకున్నానని, ఇది అధికారిక పర్యటనగా భావించకూడదని రాష్ట్ర అధికారులకు సమాచారం ఇవ్వాలని పీఎంఓకు చెప్పానని ప్రధాని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు ఈ ఆకస్మిక పర్యటన వ్లల ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నానన్నారు.
మేం రెడీగా ఉన్నాం..
అయితే, ప్రధాని మోదీకి స్వాగతం తెలపడానికి తాను, సీఎం సిద్ధరామయ్య సిద్ధంగా ఉన్నామని, అయితే, పీఎంఓ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఏర్ పోర్ట్ కు వెళ్లలేకపోయామని డెప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ప్రధాని మోదీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, ఇది రాజకీయం చేయాల్సిన విషయం కాదని వ్యాఖ్యానించారు. ‘రాజకీయం ముగిసింది.. ఇక అభివృద్ధి పైననే మా దృష్టి’ అన్నారు.