PM Modi ISRO visit : ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ సెల్యూట్..!
PM Modi ISRO visit : ప్రధాని మోదీ.. బెంగళూరుకు వెళ్లి ఇస్రో శాస్త్రవేత్తలను కలిశారు. వారిని అభినందించారు. ఈ క్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేేశారు.
PM Modi ISRO visit : చంద్రుడి దక్షిణ ధ్రువంలో చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ప్రాంతాన్ని ఇకపై శివశక్తిగా పిలువనున్నట్టు భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. జాబిల్లిపై ఇండియా అడుగుపెట్టిన ఆగస్ట్ 23వ తేదీని.. 'నేషనల్ స్పేస్ డే'గా నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్‌కు శనివారం ఉదయం వెళ్లారు ప్రధాని మోదీ. చంద్రయాన్-3 మిషన్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తలను కలిసి, వారి కృషిని అభినందించారు. ఈ క్రమంలోనే పలు విషయాలపై ప్రసంగించారు.
"ఆగస్ట్ 23న జరిగిన దృశ్యాలు, ఆ క్షణాలు.. నా కళ్ల ముందు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఇది భారత దేశం గర్వించదగిన విషయం. మిషన్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన మిమ్మల్ని కలవాలని, మీకు సెల్యూట్ చేయాలని అనిపించింది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా వస్తాయి. చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ప్రాంతాన్ని 'శివశక్తి'గా పిలుద్దాము. చంద్రుడి ఉపరితలంపై పడిన చంద్రయాన్-2 ప్రాంతాన్ని 'తిరంగ' అని పిలుద్దాము. ఇండియా చేసిన కృషికి ఇది చిహ్నంగా మారుతుంది. విఫలమనేది అంతం కాదని.. ఇది గుర్తుచేస్తుంది," అని ప్రధాని మోదీ అన్నారు.
అంతకుముందు.. ఒక్క రోజు గ్రీస్ పర్యటనను ముగించుకుని శనివారం ఉదయం బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో దిగారు మోదీ. ఆయనకు బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వారందరిని ఉద్దేశించి మాట్లాడారు మోదీ. ఇస్రోను అభినందించారు. ఈ క్రమంలోనే జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అన్న నినాదాన్ని ఇచ్చారు.
"చంద్రయాన్-3 ల్యాండింగ్ సమయంలో నేను ఇండియాలో లేను. సంతోషంతో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. దేశానికి వచ్చిన తర్వాత, తొలుత బెంగళూరుకు వచ్చి, శాస్త్రవేత్తలను కలవాలని నిర్ణయించుకున్నాను," అని ప్రధాని మోదీ అన్నారు.
చంద్రయాన్-3 ప్రస్తావన..
జులై 14న నింగిలోకి ఎగిరిన చంద్రయాన్-3 మిషన్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకుసాగింది. దశలవారీగా చంద్రుడికి చేరువైంది. చివరికి.. ఈ నెల 23 సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండ్ అయ్యింది. మొత్తం మిషన్‌లో ఇదే అత్యంత కీలక ఘట్టం. ఇక విక్రమ్ ల్యాండ్ చంద్రుడి ఉపరితలంపై దిగిన కొన్ని గంటల తర్వాత.. ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చింది. ఫలితంగా చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా చరిత్ర సృష్టించింది ఇండియా. ప్రగ్యాన్ రోవర్‌కు సంబంధించిన దృశ్యాలను సైతం విడుదల చేసింది ఇస్రో. ల్యాండింగ్ సమయం నుంచి 14 రోజుల పాటు జాబిల్లిపై పరిశోధనలు చేయనుంది ప్రగ్యాన్ రోవర్.
విక్రమ్ ల్యాండింగ్ సమయంలో ప్రధాని మోదీ ఇండియాలో లేరు. బ్రిక్స్ సమావేశం కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లారు. కాగా.. ల్యాండింగ్ ప్రక్రియను అక్కడి నుంచి లైవ్‌లో చూశారు. ల్యాండింగ్ సక్సెస్ అయిన తర్వాత.. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. నవ భారత దేశ సత్తాకు ఇది నిదర్శనం అని కొనియాడారు. ఇక తాజాగా.. శనివారం ఉదయం బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలను కలిశారు.
సంబంధిత కథనం