Man kills daughter : కూతురికి కరెంట్ షాక్ ఇచ్చి, చిత్రహింసలు పెట్టి చంపిన తండ్రి!
13 August 2023, 11:05 IST
Man kills daughter : పాకిస్థాన్‌లో ఓ వ్యక్తి, తన బిడ్డను కిరాతకంగా చంపేశాడు! కరెంట్ షాక్ ఇచ్చి, చిత్రహింసలు పెట్టి హత్య చేశాడు.
కూతురికి కరెంట్ షాక్ ఇచ్చి చంపిన తండ్రి!
Man kills daughter in Pakistan : పాకిస్థాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి, తన కూతురిని అతి కిరాతకంగా చంపేశాడు. కరెంట్ షాక్ ఇచ్చి, చిత్రహింసలు పెట్టి హత్య చేశాడు!
ఇదీ జరిగింది..
పాకిస్థాన్ ఖైబర్ పఖ్తుంక్వాలోని మర్దాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నిందితుడి పేరు జహూర్. అతనికి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య, అతడిని విడిచి పెట్టి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇతను కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు.
కాగా.. మొదటి భార్యతో జహూర్‌కు ఓ కూతురు ఉంది. ఆమె మైనర్. అసలు కారణం తెలియలేదు కానీ.. జహూర్, ఆమెను నిత్యం చిత్రహింసలు పెట్టేవాడని సమాచారం.
Father kills daughter in Pakistan : తాజాగా.. బాలిక తాత, ఆమెకు కొన్ని చాక్లెట్లు, ఇతర వస్తువులను తీసుకొచ్చాడు. అది జహూర్‌కు నచ్చలేదు! వెంటనే ఆమెను చిత్రహింసలు పెట్టాడు. కరెంట్ షాక్ ఇచ్చాడు.
బాలికను స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు. మరణానికి ముందు బాలిక చాలా చిత్రహింసలకు గురైందని వెల్లడించారు.
బాలిక బంధువుల ఫిర్యాదుతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు జహూర్‌ను వెంటనే అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
పంజాబ్ రాష్ట్రంలో..
Pakistan crime news : పాకిస్థాన్‌లో నేరాలు చాలా ఆందోళనకరంగా మారాయి. పంజాబ్ రాష్ట్రంలో 8 నెలల పసికందును చంపేశారు తల్లిదండ్రులు. ఎవరికీ తెలియకూడదని, భూమిలో పాతి పెట్టారు. కానీ ఈ సమాచారం పోలీసులకు అందగా.. తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు.
ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న షరీఫ్.. నిజాన్ని ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశానికి పోలీసులను తీసుకెళ్లారు. పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
"8నెలలుగా నిత్యం ఆ బిడ్డ అనారోగ్యంతోనే ఉంటోంది. మేము పేదవాళ్లం. వైద్యానికి సరిపడా డబ్బులు లేవు. అందుకే చంపేద్దామని నిర్ణయించుకున్నాము," అని నిందితుడు పోలీసులకు వివరించాడు.
మహిళలపై నేరాలు, అత్యాచారాలు..
పాకిస్థాన్‌లో మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి జూన్‌లో ఓ నివేదికను విడుదల చేసింది ఎస్ఎస్డీఓ (సస్టైనెబుల్ సోషల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్). ఒక్క సింధ్ రాష్ట్రంలోనే ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో 900కుపైగా కేసులు నమోదయ్యాయని నివేదిక పేర్కొంది.
Crime againt women in Pakistan : 2023 మొదటి నాలుగు నెలల్లో 529 మహిళలు కిడ్నాప్ అయ్యారని, 119మంది గృహ హింసకు గురయ్యారని, 56మందిపై అత్యాచారం జరిగిందని, 37మంది పరువు హత్యకు బలయ్యారని నివేదిక స్పష్టం చేసింది. కరాచీ సెంట్రల్, హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించింది.
మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని, వారి భద్రత కోసం తగిన చర్యలు చేపట్టాలని నివేదిక విజ్ఞప్తి చేసింది.