Online Passport : ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ సేవలు ఐదు రోజులు బంద్.. కారణం ఇదే
29 August 2024, 10:22 IST
- Online Passport Service Shutdown : ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ సేవలకు ఐదు రోజులపాటు అంతరాయం కలగనుంది. కొత్త అపాయింట్‌మెంట్‌లు వచ్చే ఐదు రోజులపాటు మూసివేయనున్నట్టుగా ప్రభుత్వం పేర్కొంది. ఆగస్టు 29 రాత్రి నుంచి ఈ సేవలు తాత్కలికంగా నిలిపివేయనున్నారు.
పాస్‌పోర్ట్ సేవలు ఐదు రోజులు బంద్
ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ దరఖాస్తుల సేవలు రానున్న ఐదురోజులు మూసివేయనున్నట్టుగా ప్రభుత్వం చెప్పింది. ఈ వ్యవధిలో కొత్త అపాయింట్‌మెంట్‌లు ఏవీ షెడ్యూల్ చేయడం లేదని వెల్లడించింది. ముందుగా బుక్ చేసిన అపాయింట్‌మెంట్‌లు కూడా రీషెడ్యూల్ చేయనున్నట్టుగా తెలిపింది. ఈ మేరకు ఆగస్టు 29న అంటే గురువారం రాత్రి నుంచి సేవలు ఐదురోజులపాటు నిలిచిపోనున్నాయి.
'పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ సాంకేతిక నిర్వహణ కోసం 29 ఆగస్ట్ 2024, గురువారం రాత్రి 8 గంటల నుంచి 2 సెప్టెంబర్, సోమవారం ఉదయం 6 గంటల వరకు పనిచేయదు. ఈ వ్యవధిలో పౌరులకు MEA/RPO/BOIల కోసం సిస్టమ్ అందుబాటులో ఉండదు. /ISP/DoP/Police Authorities 30 ఆగస్ట్ 2024 కోసం ఇప్పటికే బుక్ చేసిన అపాయింట్‌మెంట్‌లు తగిన విధంగా రీషెడ్యూల్ చేస్తారు. ఈ విషయం దరఖాస్తుదారులకు తెలియజేస్తాం.' అని పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌లో పేర్కొన్నారు.
అపాయింట్‌మెంట్‌ల రీషెడ్యూల్ కోసం ప్రణాళికలను కలిగి ఉంటామని ఓ అధికారి చెప్పారు. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల వంటివాటి నిర్వహణ కార్యకలాపాలు ఎల్లప్పుడూ ముందుగానే ప్లాన్ చేస్తారని తెలిపారు. తద్వారా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగదని వెల్లడించారు. అపాయింట్‌మెంట్ రీషెడ్యూల్ చేయడం పెద్ద పని కాదు అని అధికారి అన్నారు.
పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసేందుకు లేదా పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించడానికి దేశవ్యాప్తంగా కేంద్రాలలో అపాయింట్‌మెంట్‌లను బుక్ చేయడానికి ఉపయోగిస్తారు. అపాయింట్‌మెంట్ రోజున, దరఖాస్తుదారులు తప్పనిసరిగా పాస్‌పోర్ట్ కేంద్రాలకు చేరుకోవాలి. ధృవీకరణ కోసం వారి పత్రాలను అందించాలి. దీని తరువాత పోలీసు ధృవీకరణ జరుగుతుంది.
తరువాత పాస్‌పోర్ట్ దరఖాస్తుదారు చిరునామాకు చేరుతుంది. ఇందుకోసం దరఖాస్తుదారులు సాధారణ మోడ్‌ను ఎంచుకోవచ్చు, దీనిలో పాస్‌పోర్ట్ దరఖాస్తుదారునికి 30-45 పని దినాలలో చేరుతుంది. తత్కాల్ మోడ్‌లో కూడా చేసుకోవచ్చు. దీనితో త్వరగా పాస్‌పోస్ట్ వస్తుంది.