North Korea missile launch : సరిహద్దుల్లో యుద్ధ విమానాలు.. గాల్లోకి మిసైళ్లు!
14 October 2022, 7:16 IST
North Korea missile launch today : ఉత్తర కొరియా.. క్షిపణుల ప్రయోగాన్ని జోరుగా సాగిస్తోంది. ఫలితంగా ఉత్తర- దక్షిణ కొరియాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మరో మిసైల్‌ని లాంచ్ చేసిన ఉత్తర కొరియా
North Korea missile launch today : ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణ నెలకొంది. తూర్పు తీరం వెంబడి తాజాగా.. మరో బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించింది ఉత్తర కొరియా. అంతేకాకుండా.. సరిహద్దుకు సమీపంలో ఉత్తర కొరియా యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయని దక్షిణ కొరియా ఆరోపణలు చేసింది.
గత కొన్ని రోజులుగా.. మిసైళ్ల ప్రయోగాలను వేగవంతం చేసింది ఉత్తర కొరియా. ఇప్పటికే పలుమార్లు క్షిపణులను ప్రయోగించి ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేసింది. తాజాగా శుక్రవారం షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించింది. ఇక సరిహద్దుకు సమీపంలో 10కిపైగా ఉత్తర కొరియా మిలిటరీ విమానాలు చక్కర్లు కొట్టినట్టు దక్షిణ కొరియా ఆరోపించింది. తీర్పు, పశ్చిమ తీరాల వెంబడి కాల్పులకు తెగబడుతోందని మండిపడింది. ఉద్రిక్తతలను మరింత పెంచే విధంగా ఉన్న ఉత్తర కొరియా చర్యలను దక్షిణ కొరియా జాతీయ భద్రతా మండలి ఖండించింది. సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్తతలు సృష్టించకూడదన్న 2018 ఒప్పందానికి ఉత్తర కొరియా తూట్లు పొడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
దక్షిణ కొరియాపై కోపం..!
North Korea South Korea tensions : ఉత్తర కొరియాపై కొన్ని రోజుల క్రితం అనూహ్య నిర్ణయం తీసుకుంది దక్షిణ కొరియా. క్షిపణుల అభివృద్ధిలో పాల్గొన్న పలువురు ఉత్తర కొరియావాసులు, వ్యవస్థలపై ఆంక్షలు విధించింది. ఉత్తర కొరియాపై దక్షిణ కొరియా ఈ తరహా చర్యలు చేపట్టడం ఐదేళ్లల్లో ఇదే తొలిసారి!
కాగా.. తాజా క్షిపణి ప్రయోగాన్ని ఉత్తర కొరియా సమర్థించుకుంది. దక్షిణ కొరియా.. గురువారం చేపట్టిన ఆర్టిలరీ ఫైరింగ్ డ్రిల్స్‌కు వ్యతిరేకంగా తాము మిసైల్‌ను ప్రయోగించి, తమ శక్తిని చాటిపెట్టినట్టు పేర్కొంది.
అంతకుముందు.. బుధవారమే మరో రెండు మిసైళ్లను ప్రయోగించింది ఉత్తర కొరియా. వీటి ప్రయోగాలను ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దగ్గరుండి పర్యవేక్షించారు.
Kim Jong UN : మిసైల్ ప్రయోగాలు పెరుగుతుండటంతో.. ఉత్తర కొరియా వ్యవహారంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అణుబాంబును పరీక్షించేందుకు కిమ్ జోంగ్ ఉన్ సన్నద్ధమవుతున్నారా? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఈ వ్యవహరంపై యూఎస్ ఇండో పెసిఫిక్ కమాండ్ స్పందించింది.
"తాజా మిసైల్ లాంచ్‌పై మాకు సమాచారం అందింది. ఇవి అమెరికా, అమెరికా సిబ్బంది, భూభాగానికి, మిత్రపక్షాలకు ముప్పు వాటిల్లేలాగా లేదు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటాము," అని యూఎస్ ఇండో పెసిఫిక్ కమాండ్ వెల్లడించింది.
స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం 1:49 గంటలకు ఉత్తర కొరియా క్షిపణిని ప్రయోగించినట్టు తెలుస్తోంది. పాంగ్యాంగ్లోని సునన్ ప్రాంతం నుంచి ఈ మిసైల్ లాంచ్ జరిగింది. ఫలితంగా ఈ ఏడాది.. ఇప్పటివరకు 41 బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది ఉత్తర కొరియా.