Immigration : ఇక క్యూలో నిల్చోనవసరం లేదు.. ఎయిర్‌పోర్టులలో ఇమ్మిగ్రేషన్ చిటికెలో అయిపోతుంది
19 September 2024, 11:04 IST
- Immigration : విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ కోసం చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే ఇకపై ఈ విధానానికి గుడ్ బై చెప్పేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. సెకన్లలో ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసేలా ప్రణాళికలు వేసింది. ఇప్పటికే దీనిని దిల్లీలో అమలు చేశారు.
ఇకపై సెకన్లలో ఇమ్మిగ్రేషన్
ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి కనీసం 30 నిమిషాల సమయం పడుతుంది. ఇకపై అలాంటి సమస్యలేమీ లేకుండా కేవలం సెకన్లలో ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసుకుని వెళ్లవచ్చు. ఈ మేరకు కేంద్రం దిల్లీ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఇది త్వరలో 20 ఇతర నగరాలకు విస్తరించనున్నారు.
జూన్ 22న దిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MHA) ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (FTI-TTP) ప్రవేశపెట్టింది. దీని కింద ఇమ్మిగ్రేషన్ త్వరగా అయ్యేందుకు రిజిస్టర్ చేసుకున్న ప్రయాణికులకు బయోమెట్రిక్‌లు ఉపయోగిస్తున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ సమయంలో వీటిని ఉపయోగిస్తారు.
హైదరాబాద్‌లో కూడా
ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, అహ్మదాబాద్ వంటి ఏడు ప్రధాన విమానాశ్రయాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించే పని మెుదలైంది. ఇది త్వరలో దేశవ్యాప్తంగా 21 విమానాశ్రయాలలో అందుబాటులో ఉంటుంది. 'భారతదేశం అంతర్జాతీయ గమ్యస్థానంగా మారుతోంది. ప్రయాణ అనుభవాన్ని అందరికీ సునాయాసంగా అందించడానికి ఈ కార్యక్రమం ప్రవేశపెట్టాం. అర్హులైన ప్రయాణికులు ఆటోమేటెడ్ గేట్‌లను (ఇ-గేట్‌లు) ఉపయోగించుకోవడానికి, సాధారణ ఇమ్మిగ్రేషన్ క్యూలను దాటేందుకు అనుమతి ఉంటుంది.' అని ఒక సీనియర్ అధికారి ఎన్డీటీవీకి తెలిపారు.
ఈ కార్యక్రమం త్వరలో ముంబై, చెన్నై, కోల్‌కతా, ఆపై ఇతర నగరాల్లో ప్రారంభమవుతుందని ఆ అధికారి వెల్లడించారు. దీని కింద నమోదు చేసుకున్న భారతీయ పౌరులు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(OCI) కార్డుదారులకు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ సెకన్లలో జరుగుతుంది.
దిల్లీలో సక్సెస్
దిల్లీ విమానాశ్రయంలో ఇప్పటికే FTI-TTP విజయవంతమైంది. 18,400 మంది వ్యక్తులు నమోదు చేసుకున్నారు. ఈ పద్ధతి ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా అమలు చేస్తారు. ఈ కార్యక్రమం కింద ప్రయాణికుల ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ కోసం బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ నోడల్ ఏజెన్సీ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
వైట్ లిస్టులో పేర్లు
ధృవీకరణ తర్వాత ప్రయాణికులు ఇ-గేట్‌ల ద్వారా వెళ్లేందుకు 'నమ్మకమైన ప్రయాణికులు' వైట్ లిస్ట్‌లో ఉంటారు. గేట్‌ల గుండా వెళుతున్న సమయంలో బయోమెట్రిక్‌లు ద్వారా క్యాప్చర్ అవుతారు. ఇందులో నమోదు చేసుకున్న ప్రయాణికులు ఇ-గేట్‌లను చేరుకున్నప్పుడు తమ విమాన వివరాలను పొందడానికి విమానయాన సంస్థలు జారీ చేసిన బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేస్తారు. పాస్‌పోర్ట్ కూడా స్కాన్ అవుతుంది. ప్రయాణికుల గుర్తింపు తర్వాత ఇ-గేట్ ఆటోమెటిక్‌గా తెరుచుకుంటుంది. ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ మంజూరైనట్టుగా పరిగణిస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
అర్హత గల వ్యక్తులు www.ftittp.mha.gov.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన వివరాలను అందించాలి. ఇవి బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా ధృవీకరిస్తారు. వారి దరఖాస్తులు ఆమోదించన తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయాలు లేదా సమీపంలోని ప్రాంతీయ నమోదు కార్యాలయానికి వెళ్లాలి. దీనికి ముందు బయోమెట్రిక్‌లను అందించడానికి అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసే సందేశాన్ని అందుకుంటారు.
FTI రిజిస్ట్రేషన్ గరిష్టంగా ఐదు సంవత్సరాలు లేదా పాస్‌పోర్ట్ చెల్లుబాటు అయ్యే వరకు ఉంటుంది. ఏది ముందుగా వస్తే అది చెల్లుబాటు అవుతుంది. బయోమెట్రిక్‌లను అందించడం తప్పనిసరి. దరఖాస్తుదారులు FTI-TTP కోసం దరఖాస్తు చేసేటప్పుడు కనీసం ఆరు నెలల పాస్‌పోర్ట్ చెల్లుబాటును కలిగి ఉండాలని అధికారులు తెలిపారు.
ఇందుకోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెల్ప్‌డెస్క్ ఇమెయిల్ ఐడీని కూడా షేర్ చేసింది : india.ftittp-boi@mha.gov.in