Delhi CM Atishi : దిల్లీ సీఎంగా అతిషి- కేజ్రీవాల్​ ఆమెనే ఎందుకు ఎంపిక చేశారు?-atishi to become delhi chief minister arvind kejriwal proposes her name ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Cm Atishi : దిల్లీ సీఎంగా అతిషి- కేజ్రీవాల్​ ఆమెనే ఎందుకు ఎంపిక చేశారు?

Delhi CM Atishi : దిల్లీ సీఎంగా అతిషి- కేజ్రీవాల్​ ఆమెనే ఎందుకు ఎంపిక చేశారు?

Sharath Chitturi HT Telugu
Sep 17, 2024 01:31 PM IST

Delhi CM Atishi Marlena: అరవింద్​ కేజ్రీవాల్ రాజీనామా​ తర్వాత దిల్లీ సీఎంగా అతిషి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె పేరును కేజ్రీవాల్​ స్వయంగా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.

దిల్లీ మంత్రి అతిషి..
దిల్లీ మంత్రి అతిషి.. (Hindustan Times)

గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ.. దిల్లీ తదుపరి సీఎం పేరును ఆమ్​ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ప్రస్తుత సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ రాజీనామా అనంతరం మంత్రి అతిషి.. సీఎం బాధ్యతలను చేపట్టనున్నారు. ఆమె పేరును కేజ్రీవాల్​ స్వయంగా ప్రతిపాదించారని సమాచారం.

అతిషిని ఎందుకు ఎంపిక చేశారు?

దిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో గతవారం బెయిల్​పై బయటకు వచ్చిన ఆమ్​ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్​ కేజ్రీవాల్​.. దిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి.. దిల్లీ సీఎం కుర్చీ ఎవరిని వరిస్తుంది? అన్న ప్రశ్నపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అతిషి సహా ఆప్​కి చెందిన మరో ఐదుగురు పేర్లు రేసులో వినిపించాయి. కేజ్రీవాల్​, తన భార్యకు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉందని వార్తలు వినిపించాయి. చివరికి.. మంగళవారం సాయంత్రం కేజ్రీవాల్​ రాజీనామాకు రెడీ అవుతుండగా, సీఎం పదవికి అతిషి పేరు ఖరారైనట్టు మధ్యాహ్నం నాటికి వార్త బయటకు వచ్చింది. మంగళవారం ఉదయం 11 గంటలకు జరిగిన ఆప్ శాసనసభాపక్ష సమావేశంలో అతిషిని సీఎం చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు.

అయితే కొత్త సీఎం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయరని తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 26,27 తేదీల్లో దిల్లీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు స్పీకర్ కార్యాలయం తెలిపింది.

దిల్లీ లిక్కర్​ స్కామ్​ వ్యవహారంలో అరవింద్​ కేజ్రీవాల్​తో పాటు ఆమ్​ ఆద్మీ పార్టీ గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ సమయంలో అతిషి పార్టీ కోసం కీలకంగా వ్యవహరించారు. కేజ్రీవాల్​ లేని లోటును భర్తీ చేసే విధంగా చాలా ప్రయత్నాలు చేశారు. ఫలితంగా.. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించినప్పటి నుంచి ఆ బాధ్యతలు అతిషికి వెళతాయని ఊహాగానాలు జోరుగా సాగాయి. చివరికి అదే నిజమైంది!

అతిషి పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ కీలక నేతగా ఉంటూ ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ సహా 10కిపైగా పోర్ట్​ఫోలియోలను నిర్వహిస్తున్నారు. అరవింద్​ కేజ్రీవాల్​, మనీశ్​ సిసోడియాలు జైలులో ఉన్నప్పుడు.. దిల్లీ ప్రభుత్వాన్ని ఆమె ముందుండి నడిపించారు.

దిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధాన విద్యా సంస్కరణలకు నాయకత్వం వహించిన ఘనత అతిషికే దక్కుతుంది. ఉప ముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియా సలహాదారుగా, పాఠశాల మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంలో, బోధనా ప్రమాణాలను మెరుగుపరచడంలో, "హ్యాపీనెస్ కరిక్యులమ్" - "ఎంటర్​ప్రెన్యూర్షిప్ మైండ్​సెట్ కరిక్యులమ్" వంటి వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.

అతిషి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకురాలు. కల్కాజీ నియోజకవర్గం నుంచి దిల్లీ శాసనసభ సభ్యురాలు. తొలుత దిల్లీ ప్రభుత్వ విద్యాశాఖ సలహాదారుగా ఎదిగిన ఆమె 2020 ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు.

దిల్లీ యూనివర్సిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ పొందిన అతిషి ఆ తర్వాత చెవెనింగ్ స్కాలర్​షిప్​పై ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీ నుంచి విద్యలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆమె విద్యా నేపథ్యం దిల్లీలో చేపట్టిన విద్యా సంస్కరణలో ఆమె కృషిని గణనీయంగా ప్రభావితం చేసింది.

మాజీ మంత్రులు మనీశ్​ సిసోడియా, సత్యేందర్ జైన్​లు న్యాయపరమైన సమస్యల మధ్య రాజీనామా చేసిన తరువాత 2023 మార్చ్​లో అతిషి దిల్లీ మంత్రివర్గంలో విద్య, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ (పీడబ్ల్యూడీ), విద్యుత్, పర్యాటక శాఖలను చేపట్టారు.

విద్యా రంగంలో తన కృషితో పాటు, పర్యావరణ సమస్యల కోసం కూడా అతిషి బలంగా నిలబడతారు. దిల్లీలో పునరుత్పాదక ఇంధనం, కాలుష్య నియంత్రణ, సుస్థిరతకు సంబంధించిన విధానాలను ఆమె చురుగ్గా ప్రోత్సహించారు.

సంబంధిత కథనం