Nijjar killing: ‘భారతీయ హిందువులు కెనడా నుంచి వెళ్లిపోవాలి’- భారతీయులకు ఖలిస్తాన్ అనుకూల నేతల హెచ్చరిక
20 September 2023, 14:48 IST
Sikhs for Justice threatens Indians: కెనడాలో నివసిస్తున్న భారత్ అనుకూల హిందువులు, ఖలిస్తాన్ ను వ్యతిరేకించే వారు దేశం విడిచి వెళ్లిపోవాలని ఖలిస్తాన్ అనుకూల సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
Sikhs for Justice threatens Indians: కెనడాలో నివసిస్తున్న భారతీయులకు ఖలిస్తానీ (Khalistan) గ్రూప్ హెచ్చరికలు జారీ చేసింది. ఖలిస్తాన్ ను వ్యతిరేకించేవారు, భారత్ అనుకూల హిందువులు వెంటనే కెనడా విడిచి వెళ్లిపోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఖలిస్తానీ నాయకుడు నిజ్జర్ హత్య తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ హెచ్చరికలు వెలువడ్డాయి.
దేశం విడిచి వెళ్లండి..
ఖలిస్తాన్ అనుకూల నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న భారతీయ హిందువులు కెనడా నుంచి వెళ్లిపోవాలని సిక్స్ ఫర్ జస్టిస్ (Sikhs for Justice) ఉగ్ర సంస్థ న్యాయవాది గురుపత్వంత్ పన్నున్ హెచ్చరించారు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరస్ అయింది. సిక్స్ ఫర్ జస్టిస్ (Sikhs for Justice) సంస్థను భారత్ లో 2019లో నిషేధించారు. పన్నున్ ను ఉగ్రవాదిగా నిర్ధారించారు.
వీడియో వైరల్..
‘‘కెనడాలో నివసిస్తున్న హిందువులు దేశం విడిచి వెళ్లిపోవాలి. వారు ఇండియాకు వెళ్లి పోవాలి. భారత్ కు మద్దతిస్తున్నవారు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఖలిస్తాన్ విషయంలో మీరు ఇండియాకు సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాదు, ఖలిస్తాన్ అణచివేతను కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఖలిస్తానీ సిక్కుల భావ ప్రకటన స్వేచ్ఛ ను వ్యతిరేకిస్తున్నారు’’ అని ఆ వీడియోలో గురుపత్వంత్ పన్నున్ వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం జూన్లో హత్యకు గురైన నిజ్జర్ ‘ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (Khalistan Tiger Force) కు చీఫ్ గా ఉన్నారు. భారత్ లో పలు ఉగ్రవాద దాడులకు ఆయన కుట్ర పన్నినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. భారత్ లో ఆయన వాంటెడ్ క్రిమినల్. కెనడాలోని సర్రే లో ఈ జూన్ 18న ఒక గురుద్వారా వెలుపల హర్దీప్ సింగ్ నిజ్జర్ పై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. ఆ కాల్పుల్లో నిజ్జర్ చనిపోయాడు.
ట్రూడో వ్యాఖ్యలతో ముదిరిన వివాదం
ఈ అంశం ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలతో మరోసారి వివాదాస్పదమైంది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ప్రభుత్వమే కారణమని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. ఆ తరువాత ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ లోని కెనడా రాయబారిని భారత్, కెనడాలోని భారత రాయబారిని కెనడా.. తమ దేశం నుంచి వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించాయి. మరోవైపు పన్నున్ వీడియో వైరల్ కావడంతో కెనడాలోని హిందువులు భయాందోళనలకు గురవుతున్నారు. 1985లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ నెలకొంటాయన్న ఆందోళనలో ఉన్నారు. పన్నున్ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో కెనడా మంత్రి అనిత ఆనంద్ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.