తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nhai Guinness Record: 105 గంటల్లో 75 కి.మీ. హైవే నిర్మాణం

NHAI Guinness Record: 105 గంటల్లో 75 కి.మీ. హైవే నిర్మాణం

HT Telugu Desk HT Telugu

08 June 2022, 14:18 IST

google News
    • 105 గంటల్లో 75 కి.మీ. జాతీయ రహదారి నిర్మాణం చేపట్టిన ఎన్‌హెచ్ఏఐ సరికొత్త గిన్నీస్ రికార్డును సృష్టించింది.
రికార్డుస్థాయి సమయంలో జాతీయ రహదారుల సంస్థ నిర్మించిన రహదారి
రికార్డుస్థాయి సమయంలో జాతీయ రహదారుల సంస్థ నిర్మించిన రహదారి (NitinGadkari)

రికార్డుస్థాయి సమయంలో జాతీయ రహదారుల సంస్థ నిర్మించిన రహదారి

న్యూ ఢిల్లీ, జూన్ 8: జాతీయ రహదారి - 53 పైన 105 గంటల 33 నిమిషాల వ్యవధిలో సింగిల్ లేన్‌లో 75 కిలోమీటర్ల మేర తారు రోడ్డు (బిటుమినస్ కాంక్రీట్‌) ను వేయడంలో జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ప్రకటించారు.

ట్విటర్‌లో షేర్ చేసిన వీడియో సందేశంలో ‘భారత స్వాతంత్య్రానికి 75 సంవత్సరాల జ్ఞాపకార్థం, ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా ధృవీకరించిన ప్రపంచ రికార్డును ఎన్‌హెచ్ఏఐ సృష్టించింది..’ అని గడ్కరీ వివరించారు.

ఈ ప్రపంచ రికార్డును విజయవంతంగా పూర్తి చేయడంలో సహాయపడిన ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేసినందుకు ఎన్‌హెచ్ఏఐ, రాజ్ పాత్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు, కార్మికులందరినీ గడ్కరీ అభినందించారు.

అమరావతి నుంచి అకోలా జిల్లాల మధ్య ఎన్‌హెచ్‌- 53లో 105 గంటల 33 నిమిషాల్లో 75 కిలోమీటర్ల మేర బిటుమినస్‌ కాంక్రీట్‌ వేయడంతో రికార్డు సృష్టించామన్నారు.

2,070 మెట్రిక్‌ టన్నుల బిటుమెన్‌తో కూడిన 36,634 మెట్రిక్‌ టన్నుల బిటుమినస్‌ మిశ్రమాన్ని ఈ పనిలో వినియోగించినట్లు మంత్రి తెలిపారు.

ఈ పనిని పూర్తి చేయడానికి పగలూ రాత్రీ పనిచేసిన స్వతంత్ర కన్సల్టెంట్ల బృందంతో సహా 720 మంది కార్మికులు ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేశారని ఆయన చెప్పారు.

ఫిబ్రవరి 2019లో ఖతార్‌లోని దోహాలో 25.275 కి.మీ.లను చేపట్టిన నిర్మాణం అత్యంత పొడవైన బిటుమినస్‌ హైవే నిర్మాణంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉందని గడ్కరీ తెలిపారు. ఆ పని పూర్తి చేయడానికి 10 రోజులు పట్టింది.

కోల్‌కతా, రాయ్‌పూర్, నాగ్‌పూర్, సూరత్ వంటి ప్రధాన నగరాలను కలిపే ముఖ్యమైన తూర్పు-తూర్పు కారిడార్‌‌లో అమరావతి నుంచి అకోలా సెక్షన్ ముఖ్యమైన భాగమని అన్నారు.

ఈ స్ట్రెచ్ పూర్తయితే ఈ మార్గం ట్రాఫిక్, సరకు రవాణాను సులభతరం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం