Nitin Gadkari | కేంద్రమంత్రికీ పెట్రోల్ సెగ తగిలిందా.. హైడ్రోజన్ వెహికిల్‌లో పార్లమెంట్‌కు గడ్కరీ
30 March 2022, 17:58 IST
Nitin Gadkari బుధవారం పార్లమెంట్‌కు హైడ్రోజన్ వెహికిల్‌లో వచ్చారు. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయం గురించి తరచూ మాట్లాడే గడ్కరీ.. ఇప్పుడు చేతల్లోనూ చేసి చూపించారు.
తన గ్రీన్ హైడ్రోజన్ కారులో పార్లమెంట్ కు వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
Nitin Gadkari బుధవారం పార్లమెంట్‌కు హైడ్రోజన్ వెహికిల్‌లో వచ్చారు. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయం గురించి తరచూ మాట్లాడే గడ్కరీ.. ఇప్పుడు చేతల్లోనూ చేసి చూపించారు.
న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు ఇప్పుడెంతలా పెరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. గత 9 రోజుల్లో 8 సార్లు ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115 దాటింది. సామాన్యుడికి పెట్రో ధరల సెగ గట్టిగానే తగులుతోంది. అయితే ఈ సెగ కేంద్రమంత్రి అయిన నితిన్ గడ్కరీకి కూడా తగిలినట్లుంది. అందుకే బుధవారం ఆయన పార్లమెంట్‌కు హైడ్రోజన్ ఆధారిత ఎలక్ట్రిక్ కారులో వచ్చారు. ఇండియాలో ఇలాంటి వెహికిల్ వాడటం ఇదే తొలిసారి. తరచూ గడ్కరీ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయం గురించి మాట్లాడుతుంటారు. ఇప్పుడీ గ్రీన్ హైడ్రోజన్ వెహికిల్స్‌పై అవగాహన పెంచేందుకే స్వయంగా ఆయనే తన ఇంటి నుంచి పార్లమెంట్ వరకూ ఈ కారులో వచ్చారు.
ఈ కారు గురించి అక్కడున్న మీడియాకు కూడా వివరించారు. ఇండియా త్వరలోనే గ్రీన్ హైడ్రోజన్‌ను ఎగుమతి చేసే దేశంగా మారనుందని గడ్కరీ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ విజన్, గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించాలన్న తమ ప్రభుత్వ లక్ష్యం మేరకు నేషనల్ హైడ్రోజన్ మిషన్ ద్వారా త్వరలోనే ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతి దేశంగా మారనుందని గడ్కరీ వెల్లడించారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్, పెట్రోలియం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, దీనివల్ల సగటు పౌరుడు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గడ్కరీ గుర్తు చేశారు.
నీటి నుంచే గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారు. దీనిద్వారానే కారు నడుస్తుంది. ఒకసారి ఫుల్‌ట్యాంక్ చేయిస్తే 600 కి.మీ. వరకూ వెళ్లగలదని అంచనా. అంటే కి.మీ. ఖర్చు కేవలం రూ.2 మాత్రమే అవుతుంది. పెట్రోల్ కన్నా గ్రీన్ హైడ్రోజన్ చాలా చీప్ అని గడ్కరీ చెప్పారు. సేంద్రీయ వ్యర్థాల నుంచి కూడా గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.
ఇప్పటికే బొగ్గు, గ్యాస్ ఉపయోగిస్తున్న స్టీల్, కెమికల్, ఫార్మాసూటికల్ కంపెనీల్లోనూ ఈ గ్రీన్ హైడ్రోజన్‌ను వాడొచ్చని, ఇదొక విప్లవాత్మక మార్పు అని, దీని ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని గడ్కరీ స్పష్టం చేశారు. గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడంతోపాటు దేశవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.