NEET UG 2024 Registration: నీట్ యూజీ నోటిఫికేషన్ వచ్చేసింది; ఇలా అప్లై చేసుకోండి
09 February 2024, 21:18 IST
NEET UG 2024 Notification: దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన నీట్ యూజీ (NEET UG 2024) ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. విద్యార్థులు ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ neet.nta.nic.in ద్వారా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు.
నీట్ యూజీ ప్రతీకాత్మక చిత్రం
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ((NEET UG 2024)) పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శుక్రవారం విడుదల చేసింది. విద్యార్థులు ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ neet.nta.nic.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్.. తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
మే 5న పరీక్ష
నీట్ యూజీ 2024 ను ఎన్టీఏ మే 5, 2024న నిర్వహించనుంది. అభ్యర్థులు neet.nta.nic.in వెబ్ సైట్ ద్వారా ఫిబ్రవరి 9 వ తేదీ నుంచి మార్చి 9 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక వెబ్ సైట్ నుంచి బులెటిన్ ను డౌన్లోడ్ చేసుకుని అర్హత, పరీక్ష పథకం, సిలబస్, దరఖాస్తు ప్రక్రియ, ఫీజు వంటి అన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలించాలి.
పరీక్ష ఫీజు
ఈ నీట్ యూజీ 2024 (NEET UG 2024) పరీక్షను ఇంగ్లీష్, హిందీ, తెలుగు సహా మొత్తం 13 భాషల్లో రాయవచ్చు. ఇది కంప్యూటర్ బేస్డ్ పరీక్ష కాదు. ఓఎంఆర్ షీట్స్ పై ప్రత్యేక బాల్ పాయింట్ పెన్ తో సమాధానాలను మార్క్ చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు అప్లై చేసే విద్యార్థులు రూ. 1700 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. జనరల్ ఈడబ్య్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్ (నాన్ క్రీమీలేయర్) కేటగిరీల విద్యార్థులు రూ. 1600 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జండర్ విద్యార్థులు రూ. 1000 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి.
ఈ డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోండి
విద్యార్థులు నీట్ యూజీ (NEET UG 2024) కి అప్లై చేసే ముందు ఈ కింద పేర్కొన్న లిస్ట్ లోని డాక్యుమెంట్స్ ను సిద్ధంగా ఉంచుకోవాలి.
- జేపీజీ ఫార్మాట్ లో తాజా పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
- జేపీజీ ఫార్మాట్ లో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ (4"X6")
- జెపిజి ఫార్మాట్ లో సంతకం స్కాన్డ్ కాపీ
- జేపీజీ ఫార్మాట్ లో ఎడమ చేతి బొటనవేలు ముద్ర (ఎడమ చేతి బొటనవేలు లభ్యం కానట్లయితే, కుడి చేతి బొటనవేలు ముద్రను ఉపయోగించవచ్చు)
- పీడీఎఫ్ ఫార్మాట్ లో 10 వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్.
- ఎస్సీ / ఎస్టీ / ఓబీసీ / ఇడబ్ల్యుఎస్ మొదలైన కేటగిరీల వారు సంబంధిత ధ్రువీకరణ సర్టిఫికెట్స్ పిడిఎఫ్ ఫార్మాట్ లో.
- దివ్యాంగులు పీడీఎఫ్ ఫార్మాట్ లో వైకల్యం సర్టిఫికేట్.
- భారతీయులని నిర్ధారించే ధ్రువీకరణ పత్రం. లేదా సిటిజన్ షిప్ ను నిర్ధారించే ఏదైనా పత్రం.
- నీట్ (యుజి) పెన్ అండ్ పేపర్ పరీక్ష, అంటే అభ్యర్థులు ప్రత్యేకంగా రూపొందించిన మెషిన్-గ్రేడబుల్ ఓఎంఆర్ షీట్లపై జవాబులను మార్క్ చేయాల్సి ఉంటుంది. జవాబులను మార్క్ చేసే బాల్ పాయింట్ పెన్నును పరీక్ష హాల్లో అందిస్తారు.