తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Monsoon 2024 : ఈసారి సాధారణ వర్షపాతం- కానీ.. ఆ రాష్ట్రాల్లో మాత్రం..

Monsoon 2024 : ఈసారి సాధారణ వర్షపాతం- కానీ.. ఆ రాష్ట్రాల్లో మాత్రం..

Sharath Chitturi HT Telugu

09 April 2024, 14:37 IST

    • Monsoon 2024 : 2024 రుతుపవనాలు సాధారణంగా ఉంటాయని స్కైమెట్​ వెల్లడించింది. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం లోటు వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.
'ఇండియాలో ఈసారి సాధారణ వర్షపాతం ఉంటుంది'
'ఇండియాలో ఈసారి సాధారణ వర్షపాతం ఉంటుంది' (Pappi Sharma )

'ఇండియాలో ఈసారి సాధారణ వర్షపాతం ఉంటుంది'

Monsoon 2024 in India : ఇండియాలో భానుడి భగభగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఇప్పుడే మొదలైన వేసవి కాలం.. ఎప్పుడు ముగుస్తుందా అని ఆలోచిస్తున్నారు. వీటన్నింటి మధ్య.. ప్రముఖ ప్రైవేట్​ వాతావరణ సంస్థ స్కైమెట్​.. కాస్త ఉపశమనాన్ని కలిగించే వార్తను చెప్పింది. ఈ ఏడాది రుతుపవనాల ప్రభావం సాధారణంగా ఉంటుందని వెల్లడించింది.

రుతుపవనాల ప్రభావం సాధారణం..!

జూన్​ నుంచి సెప్టెంబర్​ వరకు ఉండే రుతుపవనాలు.. భారత దేశానికి చాలా కీలకం. పైగా.. గతేడాది చాలా ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. ఇక ఇప్పుడు.. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగా ఉంటాయన్నది సానుకూల విషయం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​లలో వర్షాలు అధికంగా కురుస్తాయని స్కైమెట్​ చెప్పింది. కానీ.. బిహార్​, పశ్చిమ్​ బెంగాల్​లో మాత్రం లోటు వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.

Monsoon in India : "దక్షిణ, వాయువ్య, ఈశాన్య భారత రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడతాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​లో అధిక వర్షపాతం నమోదవుతుంది. కానీ బిహార్​, ఝార్ఖండ్​, ఒడిశా, పశ్చిమ్​ బెంగాల్​లో లోటు వర్షపాతం నమోదవ్వొచ్చు. రుతుపవనాలు పీక్​ దశలో ఉన్నా.. ఈ ప్రాంతాల్లో వర్షాలు పెద్దగా పడకపోవచ్చు," అని స్కైమెట్​ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇక రుతుపవనాల ప్రారంభంలో ఈశాన్య భారతంలో తక్కువ వర్షాలు పడతాయని స్కైమెట్​ చెప్పుకొచ్చింది. మొత్తం మీద చూసుకుంటే.. రుతుపవనాల లాంగ్​ పీరియడ్​ యావరేజ్​ (ఎల్​పీఏ) 102శాతంగా ఉంటుందని పేర్కొంది.

Heatwave in Telangana : "నిన్నటి వరకు ఇబ్బంది పెట్టిన ఎల్​ నినో.. లా నినోగా మారుతోంది. లా నినో ఉన్నప్పుడు.. రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంటుంది. పైగా.. ఎల్​ నినో నుంచి లా నినోకు వాతావరణ మారుతున్నప్పుడు.. బాగా వర్షాలు పడతాయని రికార్డులు కూడా చెబుతున్నాయి. కానీ రుతుపవనాల ప్రారంభంలో మాత్రం పెద్దగా వర్షాలు పడకపోవచ్చు," అని స్కైమెట్​ ఎండీ జతిన్​ సింగ్​ తెలిపారు.

ఇక 2024 రుతుపవనాల ప్రభావంపై భారత వాతావరణశాఖ (ఐఎండీ) ఏం చెబుతుందో వేచి చూడాలి. త్వరలోనే రుతుపవనాలపై ఐఎండీ ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.

తీవ్ర వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి..

Heatwave in Andhra Pradesh : ఇక వేసవి విషయానికొస్తే.. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒడిశ, పశ్చిమ్​ బెంగాల్​లోని గంగా నది తీర ప్రాంతం, ఝార్ఖండ్​, విదర్భ, ఉత్తర కర్ణాటక, ఆంధ్రప్రదేశ్​ తీర ప్రాంతం, యానాం, రాయలసీమ, తెలంగాణలో హీట్​వేవ్​ పరిస్థితి పెరుగుతుందని తెలుస్తోంది. రానున్న ఏడు రోజుల పాటు తీర ప్రాంతాలున్న రాష్ట్రాల్లో వడగాల్పులు తీవ్రమవుతాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికరులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

తదుపరి వ్యాసం