Modi in US: మోదీ అమెరికా పర్యటన ప్రారంభం; మూడు రోజులు బిజీ షెడ్యూల్
21 September 2024, 19:48 IST
మూడు రోజుల పర్యటనకు గానూ ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా బయల్దేరి వెళ్లారు. అమెరికాలో ఆయన మొదట క్వాడ్ లీడర్స్ సమ్మిట్ లో పాల్గొంటారు. ఆ తరువాత అక్కడి భారతీయులను కలుస్తారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి కొనసాగుతున్న సమయంలో ప్రధాని మోదీ అక్కడ పర్యటిస్తుండడం విశేషం.
మోదీ అమెరికా పర్యటన ప్రారంభం; మూడు రోజులు బిజీ షెడ్యూల్
మూడు రోజుల అమెరికా పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఉదయం బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో మోదీ క్వాడ్ లీడర్స్ సమ్మిట్ లో పాల్గొంటారు, ఐక్యరాజ్యసమితిలో చర్చల్లో పాల్గొంటారు. పలు ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటారు.
క్వాడ్ లీడర్స్ సమ్మిట్
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ 6వ క్వాడ్ లీడర్స్ సమ్మిట్, ఐక్యరాజ్యసమితి 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్'లో పాల్గొని ప్రసంగిస్తారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వస్థలం డెలావేర్ లోని ని విల్మింగ్టన్ లో క్వాడ్ లీడర్స్ సమ్మిట్ జరుగుతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దేశాల అభివృద్ధి లక్ష్యాలు, ఆకాంక్షలను చేరుకోవడంలో సహాయపడటానికి ఈ శిఖరాగ్ర సమావేశంలోని నాయకులు గత ఏడాది పురోగతిని సమీక్షిస్తారని, రాబోయే సంవత్సరానికి ఎజెండాను నిర్ణయిస్తారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. శిఖరాగ్ర సమావేశం అనంతరం అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
ప్రధాని మోడీ ఎజెండాలో ఏముంది?
సెప్టెంబర్ 22న లాంగ్ ఐలాండ్ లోని ప్రవాస భారతీయులతో సంభాషించడానికి మోడీ న్యూయార్క్ వెళ్లనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence), క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్స్, బయోటెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాల్లో ఇరు దేశాల మధ్య మరింత సహకారాన్ని పెంపొందించడానికి అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీల సీఈవోలతో ఆయన భేటీ అవుతారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అమెరికా పర్యటన చివరి రోజున న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి (UNO) సర్వసభ్య సమావేశంలో 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ 'లో ప్రధాని ప్రసంగిస్తారు. 'మెరుగైన రేపటి కోసం బహుళపక్ష పరిష్కారాలు' అనేది ఈ సదస్సు థీమ్.
క్వాడ్ లీడర్స్ సమ్మిట్ లో చర్చించే కీలక అంశాలు
క్వాడ్ కూటమిలో నాలుగు దేశాలున్నాయి. అవి భారతదేశం, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా. ప్రపంచ శ్రేయస్సు కోసం ఒక శక్తిగా పనిచేయడానికి మరియు బహిరంగ, స్వేచ్ఛాయుత, సమ్మిళిత, సంపన్న ఇండో-పసిఫిక్ ను రూపొందించడానికి ఈ క్వాడ్ కూటమి ఏర్పడింది. ఈ 6వ క్వాడ్ (QUAD) శిఖరాగ్ర సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇండో-పసిఫిక్ లో పరిస్థితులు వంటి అంతర్జాతీయ సవాళ్లపై నేతలు చర్చించనున్నారు. ఇండో-పసిఫిక్ అభివృద్ధి ప్రాధాన్యాలపై భాగస్వాముల కృషి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDG) అమలు, ప్రజావసరాల పంపిణీ వంటి నిర్మాణాత్మక ఎజెండాను ఈ సదస్సు కలిగి ఉంటుంది.
కేన్సర్ నివారణకు..
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కేన్సర్ (cancer) ను నివారించడానికి, గుర్తించడానికి, చికిత్స చేయడానికి ప్రత్యేక చొరవ అయిన కేన్సర్ మూన్ షాట్ (Cancer Moonshot) ను కూడా క్వాడ్ నాయకులు ప్రారంభించనున్నారు. వీటితో పాటు పెట్టుబడులు, సామర్థ్యం పెంపు సహా పలు రంగాల్లో కొత్త కార్యక్రమాలు, కట్టుబాట్లపై నలుగురు నేతలు చర్చించనున్నారు. మోదీ, బైడెన్ (Biden) మధ్య జరిగే ద్వైపాక్షిక సమావేశంలో ఇరువురు నేతలు ఇరు దేశాల మధ్య సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షిస్తారు. ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ (IPEF)లోని నాలుగు స్తంభాల్లో రెండింటిలో భారత్ చేరడంపై ఒప్పందాలు, భారత్-అమెరికా డ్రగ్ ఫ్రేమ్ వర్క్ పై అవగాహన ఒప్పందం (MoU)ను ఇరు పక్షాలు ఆవిష్కరించే అవకాశం ఉంది.