Yoga day | `యోగా ఇస్లాంకు వ్యతిరేకం`
21 June 2022, 21:41 IST
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మాల్దీవుల్లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కొందరు ఆందోళనకారులు అడ్డుకున్నారు. యోగా ఇస్లాంకు వ్యతిరేకమని వాదిస్తూ కార్యక్రమాన్ని కాసేపు అడ్డుకున్నారు.
మాలెలో యోగా డే ఉత్సవాలను అడ్డుకుంటున్న నిరసనకారులు
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాల్దీవుల రాజధాని మాలెలో యోగా, మెడిటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మాలెలోని ప్రముఖ నేషనల్ ఫుట్‌బాల్ స్టేడియంలో ఇండియన్ హై కమిషన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
నేషనల్ ఫుట్‌బాల్ స్టేడియంలో
ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా నేషనల్ ఫుట్‌బాల్ స్టేడియంలో మంగళవారం ఉదయం ఈ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమంలో దౌత్యవేత్తలు, వారి కుటుంబ సభ్యలు, దౌత్య కార్యాలయ సిబ్బంది, సాధారణ ప్రజలు హాజరయ్యారు. ఇంతలో, అకస్మాత్తుగా ఒక పెద్ద గుంపు స్టేడియంలోనికి దూసుకువచ్చింది. యోగా సాధన ఇస్లాం బోధనలకు వ్యతిరేకమని చెప్పే ప్లకార్డులను, బ్యానర్లను ప్రదర్శించారు. జెండాలు, చేతిలో కర్రలతో లోపలికి దూసుకురావడంతో పార్టిసిపెంట్స్ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
యోగా ఇస్లాంకు వ్యతిరేకం
యోగా ఇస్లాంకు వ్యతిరేకమని, అందువల్ల ఈ కార్యక్రమాన్ని నిలిపేసి వెళ్లిపోవాలని వారు డిమాండ్ చేశారు. గట్టిగా నినాదాలు చేస్తూ యోగా సాధనను అడ్డుకున్నారు. బలవంతంగా లోపలికి దూసుకువచ్చి, అక్కడి ఫర్నిచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్నవారిపై దాడికి పాల్పడ్డారు. అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోనట్లయితే, తీవ్ర పరిణామాలుంటాయని వారిని హెచ్చరించారు. దాంతో పార్టిసిపెంట్స్ భయాందోళనలకు గురయ్యారు. అలాగే, అక్కడ పార్టిసిపెంట్స్ కోసం ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్‌ను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఆరుగురి అరెస్ట్
స్టేడియంలో యోగా డే ఉత్సవాలను హింసాత్మకంగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆరుగురిని మాల్దీవుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి అరుపులు, నినాదాలు, దాడులతో కొద్దిసేపు అక్కడ భయానక వాతావరణం నెలకొన్నది. ఆ దుండగులను అదుపులోకి తీసుకుని, మరికొందరిని బయటకు పంపిన తరువాత, యోగా డే ఉత్సవాలు సజావుగా కొనసాగాయి. ఈ దాడిని మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సొలిహ్ తీవ్రంగా ఖండించారు. ఇది చాలా తీవ్రమైన విషయమని, వెంటనే ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని ఆదేశించారు.
టాపిక్