Maruti Suzuki sales up: 26 శాతం పెరిగిన మారుతీ సుజుకీ ఆగస్టు అమ్మకాలు
01 September 2022, 17:57 IST
Maruti Suzuki's total sales up 26 percent: మారుతీ సుజుకీ కార్ల అమ్మకాలు ఆగస్టు నెలలో 26 శాతం పెరిగాయి.
ఆగస్టులో 26 శాతం పెరిగిన మారుతీ సుజుకీ అమ్మకాలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఆగస్టులో మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ మొత్తం అమ్మకాలు 26.37 శాతం పెరిగి 1,65,173 యూనిట్లకు చేరుకున్నాయి.
గత ఏడాది ఇదే నెలలో కంపెనీ మొత్తం 1,30,699 యూనిట్లను విక్రయించినట్లు మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్‌ఐఎల్) ఒక ప్రకటనలో తెలిపింది.
మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 1,03,187 యూనిట్లతో పోలిస్తే ఈ ఆగస్టులో 1,34,166 యూనిట్లుగా ఉన్నాయి. ఈ విభాగం 30 శాతం వృద్ధిని సాధించింది.
ఆల్టో, S-ప్రెస్సోతో కూడిన మినీ సెగ్మెంట్ కార్ల అమ్మకాలు ఆగస్టు 2021లో 20,461 యూనిట్ల నుండి ఈ ఆగస్టులో 22,162 యూనిట్లకు పెరిగాయి.
బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వ్యాగన్ఆర్‌తో సహా కాంపాక్ట్ కార్ల అమ్మకాలు 57 శాతం పెరిగి 71,557 యూనిట్లకు చేరాయి. ఇది గత ఏడాది ఆగస్టు నెలలో 45,577 యూనిట్లుగా ఉంది.
బ్రెజ్జా, ఎర్టిగా, S-క్రాస్, XL6తో కూడిన యుటిలిటీ వాహనాలు గత ఏడాది ఆగస్టు నెలలో 24,337 యూనిట్లు విక్రయించగా, ఈ ఆగస్టు నెలలో 26,932 యూనిట్లు విక్రయించారు.
‘ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కొరత వాహనాల ఉత్పత్తిపై స్వల్ప ప్రభావం చూపింది. ప్రధానంగా దేశీయ మోడళ్లలో ఈ ప్రభావం కనిపించింది..’ అని మారుతీ సుజుకీ తెలిపింది.
ఆగస్ట్ 2021లో 10,666 యూనిట్ల నుండి వాన్ ఈకో అమ్మకాలు గత నెలలో 11,999 యూనిట్లకు పెరిగాయి. లైట్ కమర్షియల్ వెహికల్ సూపర్ క్యారీ 2,588 యూనిట్ల నుండి 3,371 యూనిట్లకు పెరిగింది.
ఆగస్టు 2022లో ఎగుమతులు 21,481 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే నెలలో 20,619 యూనిట్లు ఉన్నాయి.