SC slams Manipur police: ‘ఇంత దారుణంగానా దర్యాప్తు?’- మణిపూర్ పోలీసులపై సుప్రీం కోర్టు ఆగ్రహం
01 August 2023, 16:56 IST
- SC slams Manipur police: మణిపూర్ పోలీసులపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసుల దర్యాప్తులో పోలీసుల తీరు చాలా నీరసంగా, అనాసక్తంగా ఉందని మండిపడింది. కేసుల నమోదులోనే దారుణమైన జాప్యం కనిపిస్తోందని ఆగ్రహించింది.
సుప్రీంకోర్టు
SC slams Manipur police: మణిపూర్ లో కొనసాగుతున్న హింసపై మంగళవారం కూడా సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మణిపూర్ పోలీసుల తీరును ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది.
ఏడు అరెస్ట్ లేనా?
కేసుల దర్యాప్తులో మణిపూర్ పోలీసుల అసమర్ధత స్పష్టంగా కనిపిస్తోందని సుప్రీంకోర్టు మండిపడింది. ‘రాష్ట్ర పోలీసులు అసమర్ధులు. ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలనేవే కనిపించడం లేదు. మొత్తం 6 వేల ఎఫ్ఐఆర్ లు నమోదైతే, చేసిన అరెస్టులు కేవలం ఏడా?’’ అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహంగా ప్రశ్నించారు. ‘‘ఒకటి, రెండు ఎఫ్ఐఆర్ లను మినహాయిస్తే, వేరే ఏ కేసులోనే అరెస్ట్ లు జరగలేదు. దర్యాప్తు చాలా నీరసంగా, ఆనాసక్తంగా జరుగుతోంది. ఘటన జరిగిన రెండు మూడు నెలల తరువాత కేసులను నమోదు చేస్తున్నారు. ఆ తరువాత ఎప్పుడో స్టేట్మెంట్స్ ను రికార్డు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.
కారులో నుంచి బయటకు లాగి..
మే 4 న జరిగిన ఒక నేర ఘటనను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ‘‘ఆ రోజు కార్లో నుంచి ఒక మహిళను బయటకు లాగి, ఆమె కళ్ల ముందే ఆమె కొడుకుని దారుణంగా హత్య చేశారు. ఆమెపై దాడి చేశారు. ఈ ఘటన జరిగింది మే 4వ తేదీన అయితే, కేసు నమోదు చేసింది జులై 7వ తేదీన. ఇలా ఉంది మణిపూర్ పోలీసుల పని తీరు’’ అని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందించారు. మొత్తం 11 ఎఫ్ఐఆర్ లలో అరెస్ట్ లు జరిగాయని, దర్యాప్తులో అనాసక్తత ఏమీ లేదని కోర్టుకు తెలిపారు. కొందరు బాధితులను పోలీసులే నిందితులకు అప్పగించారని, వారిపై హింసాత్మక దాడులు జరుగుతోంటే, చూస్తూ ఉన్నారని స్టేట్మెంట్స్ లో రికార్డై ఉన్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. ఆ పోలీసులను ఇంటరాగేట్ చేశారా? అని ప్రశ్నించింది. వీటన్నింటికి శుక్రవారం సమాధానమిస్తామని, సీబీఐ దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయని ఎస్జీ తుషార్ మెహతా సమాధానమిచ్చారు.
కేసులను విభజించండి..
ఈ సందర్భంగా మణిపూర్ పోలీసులకు సుప్రీంకోర్టు పలు ఆదేశాలు ఇచ్చింది. మొత్తం 6500 కేసులను వాటి తీవ్రత ఆధారంగా విభజించాలని, హత్య, దాడి, రేప్, మహిళలపై హింస, చిన్నారులపై హింస వంటి అత్యంత తీవ్రమైన కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. కేసుల దర్యాప్తును ఫాస్ట్ ట్రాక్ చేయాలని స్పష్టం చేసింది. ‘‘మే 4వ తేదీ నుంచి జులై 7వ తేదీ వరకు పోలీసులు అసలు డ్యూటీ చేయలేదు. వారికి వారి బాధ్యతల పట్ల నిర్లక్ష్యమో, లేక వారు అసమర్ధులు కావడమో, లేక వారికి ఈ కేసులు దర్యాప్తు చేయడం ఇష్టం లేకపోవడమో.. అందుకు కారణం కావచ్చు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.