Manipur viral video case : ‘మణిపూర్ పోలీసులు ఏం చేస్తున్నారు?’- సుప్రీంకోర్టు ఫైర్!
Manipur viral video case hearing : మణిపూర్ వైరల్ వీడియో బాధితులు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది.
Manipur viral video case hearing in Supreme court : మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా చేసి ఊరేగించిన కేసుకు సంబంధించి సోమవారం విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో మణిపూర్ పోలీసు వ్యవస్థపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. అదే సమయంలో.. ఇలాంటి ఘటనలు పశ్చిమ్ బంగాల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లనూ జరుగుతున్నాయని ఓ న్యాయవాది చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది.
"ప్రతి చోటా ఇలాగే జరుగుతోందని చెప్పి, మణిపూర్ వైరల్ వీడియో కేసును తక్కువ చేసి చూడకూడదు. ఇది చాలా దారుణమైన, హీనమైన ఘటన. దేశం మొత్తం ఇలాగే ఉందని ఆలోచించకుండా.. మణిపూర్ వ్యవహారంలో మనం ఏం చేయగలము? అని ఆలోచించాలి. కాపాడితే ఆడబిడ్డలను అందరిని కాపాడండి, లేదా ఎవరినీ కాపాడవద్దు? అని మీరు అంటున్నారా?" అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.
Manipur viral video case : మణిపూర్లో మే 3 నుంచి హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. కుకీ జాతికి చెందిన ఇద్దరు మహిళలను కొందరు నగ్నంగా చేసి, ఊరేగించిన ఘటన మే 4న చోటుచేసుకుంది. కాగా.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇటీవలే బయటకొచ్చాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో బాధిత మహిళలు.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ దర్యాప్తును వ్యాజ్యంలో వ్యతిరేకించారు. సోమవారం ఈ పిటిషన్పై విచారణ జరిగింది.
మణిపూర్ వైరల్ వీడియోపై సీబీఐ కాకుండా.. కోర్టు పర్యవేక్షణలో సిట్ బృందం దర్యాప్తు చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణ సీబీఐ దర్యాప్తు కొనసాగితే తమకు అభ్యంతరం లేదని కేంద్రం తరఫు న్యాయవాది తుషార్ మెహతా స్పష్టం చేశారు.
Manipur viral video parade : మణిపూర్ హింసకు సంబంధించి ఇప్పటివరకు 6వేలకుపైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని సుప్రీంకోర్టుకు వెల్లడించింది కేంద్రం. మహిళలపై నేరాలకు సంబంధించి.. వీటిల్లో ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం అడిగిన ప్రశ్నకు కేంద్రం వద్ద సమాధానం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆరు విషయాలను ప్రస్తావిస్తూ, వాటిపై సమాధానం ఇవ్వాలని కేంద్రానికి ఆదేశించింది సుప్రీంకోర్టు. అవి.. కేసుల విభజన, జీరో ఎఫ్ఐఆర్ల సంఖ్య, పోలీస్ స్టేషన్లకు ఎన్ని బదిలీ అయ్యాయి. ఇప్పటివరకు ఎంత మందిని అరెస్ట్ చేశారు? నిందితులకు ఇస్తున్న న్యాయపరమైన సాయం, ఇప్పటివరకు ఎన్ని సెక్షన్ 164 స్టేట్మెంట్స్ రికార్డు చేశారు.. వంటి ప్రశ్నలు సంధించింది. ఈ ప్రశ్నలకు ఒక రోజులో సమాధానం చెప్పాలని, విచారణను మంగళవారానికి వాయిదా వేసింది కోర్టు.
"ఇది నిర్భయ కేసు కాదు.."
విచారణలో మణిపూర్ పోలీసుల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసింది సర్వోన్నత న్యాయస్థానం.
Manipur violence latest news : "ఇది నిర్భయ తరహా కేసు కాదు. ఇది చాలా తీవ్రతతో కూడిన కేసు. మణిపూర్ వైరల్ వీడియో ఘటన మే 4న జరిగింది. మే 18 వరకు జీరో ఎఫ్ఆర్ కూడా నమోదు చేయలేదు. సంబంధిత పోలీస్ స్టేషన్కు ఈ కేసు జూన్లో బదిలీ అయ్యింది. జులై 19న వీడియో వైరల్ అయ్యింది. ఆ తర్వాతే కేసు వేగవంతమైంది. బాధితులకు దర్యాప్తులో, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉండాలంటే.. కేసును వేగంగా విచారించాలి. అసలు పోలీసులు 14 రోజుల వరకు ఏం చేస్తున్నారు?" అని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు.
సంబంధిత కథనం