Manipur violence case : మణిపూర్ హింస కేసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!
07 August 2023, 17:07 IST
Manipur violence case : మణిపూర్ హింసకు సంబంధించి పలు కీలక ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. పలు కేసులకు సంబంధించి విచారణ చేపట్టిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.
మణిపూర్ హింసపై సూప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!
Manipur violence case : మణిపూర్ హింసకు సంబంధించిన కేసులపై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పలు కీలక ఆదేశాలు వెలువరించింది. బాధితుల పునారావసం, ఉపశమనం కల్పించే కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ముగ్గురు మాజీ న్యాయమూర్తులను నియమిస్తున్నట్టు ప్రకటించింది.
ఈ కమిటీలో జమ్ముకశ్మీర్ మాజీ సీజే జస్టిస్ గీత మిట్టల్‌తో పాటు రిటైర్డ్ జస్టిస్ షాలిని పీ జోషి, జస్టిస్ ఆశా మేనన్‌లు ఉంటారని సీజేఐ డీవై చంద్రచూడ్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ కమిటీకి జస్టిస్ గీత మిట్టల్ నేతృత్వం వహిస్తారని స్పష్టం చేసింది. మణిపూర్‌లో శాంతిభద్రతలను పునరుద్ధరించి, ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు ఈ చర్యలు చేపడుతున్న ధర్మాసనం వెల్లడించింది.
Manipur violence case Supreme court : పునరావాస కార్యకలాపాలను చూసేందుకు కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు.. రాష్ట్రంలో దాఖలైన క్రిమినల్ కేసులను విచారిస్తున్న సిట్ బృందాలను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. మరోవైపు వివిధ రాష్ట్రాల నుంచి కనీసం డిప్యూటీ ఎస్పీ స్థాయి ఆఫీసర్లను సీబీఐ తన దర్యాప్తులో చేర్చుకోవాలని తెలిపింది. అంతేకాకుండా సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసులను మాజీ ఐపీఎస్ అధికారి దత్తాత్రేయ పద్సల్గిర్కర్ పర్యవేక్షిస్తామని చెప్పింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు సోమవారం సాయంత్రం నాటికి సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెడతామని స్పష్టం చేసింది.
మణిపూర్ హింసతో పాటు పునరావాస కార్యక్రమాలు వంటి 10కిపైగా కేసులను సోమవారం విచారించింది సుప్రీంకోర్టు.
'ప్రభుత్వం చాలా మెచ్యూర్‌గా హ్యాండిల్ చేస్తోంది..!'
సోమవారం జరిగిన విచారణకు మణిపూర్ డీజీపీ రాజివ్ సింగ్ హాజరయ్యారు. రాష్ట్రంలో తెగల మధ్య ఘర్షణలు, వాటిని అడ్డుకునేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. మెరుగైన విచారణ కోసం కేసుల విభజనకు సంబంధించిన వివరాలను సైతం కోర్టుకు వెల్లడించారు.
Manipur violence latest news : కేంద్ర ప్రభుత్వం తరఫు వాదనలు వినిపించారు అటార్నీ జనరల్ ఆర్ వెంకరమణ, సోలసిటర్ జనరల్ తుషార్ మెహతా. "మణిపూర్ హింస విషయంలో కేంద్ర ప్రభుత్వం పరిణతితో ప్రవర్తిస్తోంది," అని న్యాయవాదులు అన్నారు.