ఒడిలో చెల్లికి లాలి పాటలు.. స్కూల్లో అక్షర పాఠాలు
04 April 2022, 21:38 IST
- మణిపూర్: ఓ పదేళ్ల బాలికకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తన చెల్లిని ఒడిలో పెట్టుకుని.. స్కూల్లో పాఠాలు వింటోంది ఆ బాలిక
ఒడిలో చెల్లికి లాలి పాటలు.. స్కూల్లో అక్షర పాఠాలు
Girl babysitting sister | ఆ బాలిక వయస్సు కేవలం 10ఏళ్లు. సరదాగా ఆడుకుంటూ.. చదువుకుంటూ జీవితాన్ని గడపాల్సిన వయస్సు అది. కానీ పదేళ్లకే పెద్ద బాధ్యతలు చేపట్టింది. కానీ చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఓవైపు తన చెల్లిని ఒడిలో పెట్టుకుని లాలిపాటలు పాడుతూనే.. మరోవైపు స్కూల్లో పాఠాలు వింటోంది.
ఒడిలో చెల్లెలు.. మనసంతా చదువు
తామెంగ్లాంగ్లో నివాసముంటోంది మీనింగ్సిన్లియు పమీ కుటుంబం. ఆమె తల్లిదండ్రులు పొలం పని మీద బయటకు వెళ్లారు. ఈ క్రమంలోనే చంటిపిల్ల అయిన తన చెల్లిని తీసుకుని స్కూలుకు వెళ్లింది పమీ. పసికందును ఒడిలో పెట్టుకుని.. ఆమెను లాలిస్తూనే.. తానూ పాఠాలు వింది.
ఈ ఫొటోను మణిపూర్ విద్యుత్‌శాఖ మంత్రి బిశ్వజిత్ థోంగమ్.. ట్వీట్ చేశారు.
"చదువుకోవాలన్న ఆ బాలిక అంకితభావం నన్ను కదిలించింది. మణిపూర్ తామెంగ్లాంగ్కు చెందిన పమీ.. తన చెల్లికి లాలి పాటలు పాడుతూ.. స్కూల్లో పాఠాలు వింటోంది. ఒడిలో చంటిపిల్లను పెట్టుకుని చదువుకుంటోంది," అని రాసుకొచ్చారు బిశ్వజిత్.
ఈ క్రమంలోనే పమీ తల్లిదండ్రులతో బిశ్వజిత్ మాట్లాడారు. బాలికను ఇంపాల్‌కు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. బాలిక గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేంత వరకు తాను చూసుకుంటానని వారికి ఆయన హామీనిచ్చారు.
కొద్ది గంటల్లోనే ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఫొటోను చూసిన వారందరు ఆశ్చర్యపోతున్నారు. బాలికపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'ఈ ఒక్క ఫొటో.. వేల మాటలతో సమానం,' అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
టాపిక్