MPs suspended : ఒకేసారి 30మంది ఎంపీలను సస్పెండ్ చేసిన లోక్‌సభ స్పీకర్..!
18 December 2023, 17:12 IST
MPs suspended from Lok Sabha : లోక్‌సభలో 30మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది! ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభలో 45మంది ఎంపీలపై వేటు పడింది!
31మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు
MPs suspended from Lok Sabha : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మరో కీలక పరిణామాం! 30మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా. గత వారం జరిగిన పార్లమెంట్ భద్రతా వైఫల్యం నేపథ్యంలో.. విపక్షానికి చెందిన ఎంపీలు.. స్పీకర్ ఛాంబర్ వద్ద నిరసనకు దిగడంతో ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నారు.
నిరసనలు చేశారని..!
పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై లోక్‌సభ అట్టుడుకుతోంది. సభ కార్యకలాపాలు సజావుగా సాగడం లేదు. విపక్షాల నిరసనలతో వాయిదాల మీద వాయిదా పడుతోంది. ఈ నేపథ్యంలోనే.. గత వారమే 13మంది విపక్షా ఎంపీలపై సస్పెన్ష్ వేటు పడింది. తాజాగా.. ఈ జాబితాలోకి మరో 30మంది ఎంపీలు చేరారు. మరో ముగ్గురిపై కూడా సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. వారిపైనా ఇదే తరహా చర్యలు తీసుకుంటే.. సస్పెన్షన్ వేటుకు గురైన ఎంపీల సంఖ్య 46కి చేరుతుంది!
Lok Sabha MP's suspended : తాజాగా సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత అధీర్ రంజన్ చౌదరితో పాటు గౌరవ్ గొగోయ్, టీఎంసీ ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ, కకోలి ఘోష్, సౌగతా రాయ్, శతాబ్ది రాయ్, డీఎంకే ఎంపీ ఏ రాజా, దయానథి మారన్లు కూడా ఉన్నారు.
లోక్‌సభలో ఎంపీల సస్పెన్షన్ గురించి మీడియాతో మాట్లాడారు అధీర్ రంజన్. కేంద్రం.. ఒక నియంతగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్‌ని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌గా భావిస్తోందని ఎద్దేవా చేశారు. శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి.. ప్రభుత్వానికి విపక్షం పూర్తిగా సహకరిస్తోందని ఆయన అన్నారు.
Lok Sabha MP's suspension : "పార్లమెంట్లో భద్రతా వైఫల్యం గురించి ప్రధాని గారు న్యూ మీడియాతో మాట్లాడారు. హోం మంత్రి గారు టీవీ ఛానెల్స్‌తో మాట్లాడతారు. కానీ ఒక్కరు కూడా పార్లమెంట్లో మాట్లాడట్లేదు ఎందుకు? ఈ షాకింగ్ ఘటనపై విపక్ష ఇండియా బృందం వేసిన ప్రశ్నలకు వారెందుకు సమాధానాలివ్వడం లేదు?" అని నిలదీశారు అధీర్ రంజన్.
గత బుధవారం నాడు.. కొందరు లోక్‌సభలోకి స్మోక్ క్యాన్లతో ప్రవేశించి గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను తీసుకుని విపక్షాలు పార్లమెంట్లో నిరసనలు చేస్తున్నాయి.
రాజ్యసభలో కూడా..!
లోక్‌సభలో 30మంది ఎంపీల సస్పెన్షన్ వార్త బయటకు వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే రాజ్యసభలో కూడా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఎగువ సభలో 45మంది విపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కి గురైనట్టు తెలుస్తోంది.