తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  నరకయాతన అనుభవిస్తూ పరీక్షలకు సిద్ధమవుతున్నాం.. సీజేఐకి సివిల్స్ విద్యార్థి లేఖ

నరకయాతన అనుభవిస్తూ పరీక్షలకు సిద్ధమవుతున్నాం.. సీజేఐకి సివిల్స్ విద్యార్థి లేఖ

Anand Sai HT Telugu

29 July 2024, 18:23 IST

google News
    • Delhi Coaching Centres Tragedy : దిల్లీలోని కోచింగ్ సెంటర్‌లో ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అక్కడి పరిస్థితులను వివరిస్తూ.. ఓ విద్యార్థి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.
వరద నీటిలో కోచింగ్ సెంటర్
వరద నీటిలో కోచింగ్ సెంటర్

వరద నీటిలో కోచింగ్ సెంటర్

భారత ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్‌కు సివిల్స్ విద్యార్థి లేఖ రాశారు. నిత్యం నరకంలో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల చుట్టూ ఉన్న విద్యార్థుల జీవన స్థితిగతులను నరకంగా ఉన్నాయని అభివర్ణించారు. దిల్లీలోని కోచింగ్ సెంటర్ల చుట్టూ ఉన్న జీవితంపై విద్యార్థి అవినాష్ దూబే రాసిన లేఖలో మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యం, కోచింగ్ సెంటర్ల నిబంధనల ఉల్లంఘన గురించి ప్రస్తావించారు. తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.

దిల్లీలోని కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని బేస్‌మెంట్‌లో చనిపోయిన ముగ్గురు సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్థుల మృతికి కారణమైన నగర అధికారులు, ఇతరులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి డిమాండ్‌ చేశారు. అవినాష్ దూబే రాసిన ఈ లేఖ దిల్లీలోని రాజేంద్ర నగర్, ముఖర్జీ నగర్ వంటి కోచింగ్ సెంటర్లలో ఉన్న పేలవమైన మౌలిక సదుపాయాలను కూడా పేర్కొన్నారు. ఇక్కడ నివాసితులు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వరదలతో పోరాడుతున్నారని చెప్పుకొచ్చారు.

'వర్షం కారణంగా బేస్‌మెంట్‌లో వరద నీటితో నిండిపోయి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మోకాళ్ల లోతు మురుగునీటిలో నడవాల్సి వస్తోంది. నేడు మా లాంటి విద్యార్థులు నరకయాతన అనుభవిస్తూ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.' అని దూబే లేఖలో పేర్కొన్నారు.

మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యాన్ని అవినాష్ లేఖలో ధ్వజమెత్తారు. మురుగునీటి కాలువల సక్రమ నిర్వహణ గురించి కూడా ఇది ఆందోళనలను లేవనెత్తింది. వరదల సమయంలో వర్షపునీటిలో మురుగునీరు కలుస్తుంది. మురుగు కొన్నిసార్లు ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తుందని చెప్పారు.

ప్రభుత్వ అధికారుల ఉదాసీనత వల్లే విద్యార్థులకు భద్రత లేదని పేర్కొన్నారు అవినాష్. 'మాలాంటి విద్యార్థులు ఏ రకంగా చూసినా లక్ష్యం దిశగా పయనిస్తున్నాం. కానీ నిన్నటి సంఘటన విద్యార్థుల జీవితాలకు భద్రత లేదని రుజువు చేసింది. పై సంఘటన చాలా హృదయ విదారకమైనది. ఆందోళన కలిగిస్తుంది. నీటి ఎద్దడి కారణంగా (అటువంటి) కేంద్రాలలో చదువుతున్న విద్యార్థుల భద్రత, ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు ఉంది. విద్యార్థులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం అవసరం ఉంటే నిర్భయంగా చదువుకుని.. దేశాభివృద్ధికి భాగస్వాములవుతాం.' అని లేఖలో అవినాష్ పేర్కొన్నారు.

విద్యార్థుల ప్రాథమిక హక్కులను పరిరక్షించాలని, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడంతోపాటు చదువుకోవడం హక్కు అని విద్యార్థి లేఖలో తెలిపారు. దేశ రాజధానిలో నీటి సమస్యకు సంబంధించి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడానికి, అత్యవసర ప్రతిస్పందన, వైద్య చర్యలను పటిష్టం చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ లేఖను పిటిషన్‌గా పరిగణించాలా వద్దా అనేది సీజేఐ డీవై చంద్రచూడ్ ఇంకా నిర్ణయించలేదు.

తదుపరి వ్యాసం