Delhi coaching centre : తీవ్ర విషాదం- కోచింగ్ సెంటర్లోకి పోటెత్తిన వరద నీరు- ముగ్గురు బలి!
Delhi coaching centre flood : దిల్లీ రాజేంద్ర నగర్లోని ఓ కోచింగ్ సెంటర్లోకి వరద నీరు పొట్టెత్తింది. బేస్మెంట్ వరద నీటిలో కూరుకుపోయింది. అందులోని ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
దిల్లీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా రాజేంద్ర నగర్లోని ఓ ప్రముఖ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు పోటెత్తింది. వరద నీటిలో చిక్కుకుని ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి ఆచూకి కనిపించడంలేదని సమాచారం. ఈ వార్త నిమిషాల్లో దిల్లీ మొత్తం వ్యాపించగా.. కోచింగ్ సెంటర్ వద్ద విద్యార్థులు భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు.
బేస్మెంట్లోకి వరద నీరు..
రాజేంద్ర నగర్లోని రావ్స్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ కోచింగ్ సెంటర్లో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు రాజేంద్ర నగర్లోని అనేక వీధులు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు పోటెత్తింది. బేస్మెంట్లో విద్యార్థులు చిక్కుకున్నారని రాత్రి 7 గంటల 20 నిమిషాలకు అధికారులకు సమాచారం అందింది. వారు వెంటనే స్పందించి.. అగ్నిమాపక సిబ్బందిని ఘటనాస్థలానికి పంపించారు.
దిల్లీ కోచింగ్ సెంటర్లో సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది పలు గంటల పాటు శ్రమించి ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలను బయటకు తీశారు. అర్థరాత్రి దాటిన తర్వాత మరో విద్యార్థి మృతదేహం లభించింది.
"పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించాము. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. వరద నీటిని బయటకు పంప్ చేస్తున్నాము. బేస్మెంట్లో ఇంకా 7 అడుగుల నీరు ఉంది. ఇంకా ఎవరైనా లోపల చిక్కుకున్నారా? అని చూస్తున్నాము," అని కొన్ని గంటల క్రితం అధికారులు వెల్లడించారు.
కాగా దిల్లీ కోచింగ్ సెంటర్లోకి వరద నీరు పోటెత్తిన సమయంలో బేస్మెంట్లో ముగ్గురు చిక్కుకుపోయారని, మరో 30మంది వెంటనే బయటపడ్డారని నివేదికలు చెప్పాయి.
మరోవైపు దిల్లీ కోచింగ్ సెంటర్లోకి వరద నీరు చేరిన ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు.
పశ్చిమ దిల్లీలోని పటేల్ నగర్లో జలమైన రోడ్డులో యూపీఎస్సీ అభ్యర్థి విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయిన కొన్ని రోజులకే తాజా ఘటన జరగడం సర్వత్రా చర్చకు దారితీసింది.
తీవ్రస్థాయిలో నిరసనలు..
దిల్లీ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు చేరి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారన్న వార్త వేగంగా వ్యాపించింది. ఆ ప్రాంతానికి విద్యార్థులు తరలివెళ్లి, కోచింగ్ సెంటర్కి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. వారిని నియంత్రించేందుకు అధికారులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఫలితంగా రాజేంద్ర నగర్లో శనివారం అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనిపించింది.
మరోవైపు విద్యార్థులు వెనక్కి వెళ్లిపోవాలని, సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు విజ్ఞప్తి చేశారు.
రాజకీయ దుమారం..
దిల్ల కోచింగ్ సెంటర్లోకి వరద నీరు చేరి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో ఆప్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని బీజేపీ మండిపడింది.
ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని ఆప్ జవాబిచ్చింది.
"డ్రైనేజ్ కూరుకుపోవడం వల్ల ఈ ఘటన జరిగినట్టు అనిపిస్తోంది. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ని బీజేపీ 15ఏళ్లు నడిపింది. కానీ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయలేదు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు. విద్యార్థులను కాపాడాలి," అని ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ తెలిపారు.
సంబంధిత కథనం