తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lic Ipo | ఎల్​ఐసీ ఐపీఓ సక్సెస్​ అవుతుందా?

LIC IPO | ఎల్​ఐసీ ఐపీఓ సక్సెస్​ అవుతుందా?

Sharath Chitturi HT Telugu

22 February 2022, 20:21 IST

    • LIC IPO news latest | ఎల్​ఐసీ ఐపీఓకు కౌంట్​డౌన్​ మొదలైపోయింది. ఇక ఇప్పుడు ఐపీఓ మార్కెట్​లోకి ఎప్పుడు వస్తుందా అని అందరు ఎదురుచూస్తున్నారు. ఈ ఐపీఓకు భారీ డిమాండ్​ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మార్కెట్​లో నెలకొన్న పరిస్థితులు, ఇతర కీలక విషయాలు.. ఈ ఐపీఓపై ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి ఎల్​ఐసీ ఐపీఓ సక్సెస్​ అవుతుందా?
ఎల్​ఐసీ
ఎల్​ఐసీ (REUTERS)

ఎల్​ఐసీ

LIC IPO invest or not | ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ఎల్​ఐసీ ఐపీఓ గురించే చర్చ! దేశంలోనే అతిపెద్ద ఐపీఓ లిస్టింగ్​కి ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. దీని కోసం సెబీకి ఈ నెలలో ముసాయిదా పత్రాలును సమర్పించింది ప్రభుత్వం. వచ్చే నెలలో మార్కెట్​లోకి ఎల్​ఐసీ రానుంది. ఇంతటి భారీ అంచనాలతో వస్తున్న ఐపీఓ.. దలాల్​ స్ట్రీట్​లో సక్సెస్​ అవుతుందా? అన్న ప్రశ్నకు మిశ్రమ స్పందన లభిస్తోంది. అందుకు కారణాలు..

రాంగ్​ టైమింగ్​!

2021లోనే ఎల్​ఐసీ ఐపీఓ రావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఆలస్యం చేసింది. అయితే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు సైతం ప్రతికూలంగా ఉన్నాయి. 2021లో ఆల్​టైమ్​ హై నమోదు చేసిన బీఎస్​ఈ సెన్సెక్స్​, ఎన్​ఎస్​ఈ నిఫ్టీలు.. ఇప్పుడు వెనకంజలో ఉన్నాయి.

ముఖ్యంగా రష్యా- ఉక్రెయిన్​ ఉద్రిక్తతలతో మార్కెట్లు పైకి, కిందకి కొట్టుమిట్టాడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతోందనని, మదుపర్లు జాగ్రత్త వహిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్​ తీసుకుంటున్న చర్యలు చూస్తే.. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

అటు విదేశీ మదుపర్లు సైతం భారత మార్కెట్లలో విపరీతంగా అమ్మకాలు చేస్తున్నారు. 2021లో కొనుగోళ్లవైపు ఆసక్తి చూపించిన ఎఫ్​ఐఐలు.. దాదాపు 4 నెలలుగా అమ్మకాలపై దృష్టిపెట్టారు. ఐపీఓ సమయానికీ వీళ్లు ఇదే పని కొనసాగిస్తే.. మార్కెట్లపై ఒత్తిడి తీవ్రంగా ఉండే అవకాశముంది.

ఫలితంగా.. ఐపీఓకు మంచి డిమాండే ఉన్నా.. ఈ సమయంలో వస్తుండటం కాస్త ప్రతికూల అంశం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పెట్టుబడిదారుల్లో భయం..!

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ సంస్థగా ఎల్​ఐసీకి గుర్తింపు ఉండటం సానుకూలాంశమైతే.. అది ఇప్పుడు కొంత నెగిటివ్​గానూ మారింది! సంస్థలో ప్రభుత్వ వాటా ఎక్కువగా ఉండటంతో ఐపీఓలో పెట్టుబడులు పెట్టేందుకు బాడా ఇన్​వెస్టర్లు.. కాస్త భయపడుతున్నట్టు తెలుస్తోంది. లిస్టింగ్​ తర్వాత కూడా.. ఎల్​ఐసీ ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉంటుందని, ఫలితంగా పెట్టుబడిదారుల ప్రయోజనాలను పట్టించుకోదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే వీరిని శాంతిపజేసేందుకు ఎల్​ఐసీ యాజమాన్యం తమవంతు ప్రయత్నం చేస్తోంది. ఎల్​ఐసీ నిర్ణయాలను.. సంస్థకు చెందిన బోర్డు సభ్యులే తీసుకుంటారని, ప్రభుత్వం జోక్యం ఉండదని హామీనిస్తోంది.

ఏదీ ఏమైనా.. లిస్టింగ్​ తర్వాత ఎల్​ఐసీలో ప్రభుత్వ వాటా 95శాతం ఉంటుందనేది వాస్తవం.

వాల్యుయేషన్​ కూడా ముఖ్యమే!

LIC IPO price band | ఎల్​ఐసీని ఏ వాల్యుయేషన్​లో(ప్రైజ్​ బ్యాండ్​) ప్రభుత్వం తీసుకురానుంది అనే అంశంపైనా ఐపీఓ సక్సెస్​ ఆధారపడి ఉంటుందని మార్కెట్​ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందరికి ఆమోదయోగ్యమైన వాల్యుయేషన్​లో వస్తే ఐపీఓ.. డిమాండ్​కు తగ్గట్టు ఓవర్​సబ్​స్క్రైబ్​​ అవుతుందని అంటున్నారు.

మరోవైపు 2021లో వచ్చిన ఐపీఓల్లో దేశీయ పెట్టుబడిదారులే 50శాతానికిపైగా పాల్గొన్నారు. అంటే.. 32శాతం మంది రీటైల్​ ఇన్​వెస్టర్లు, 21శాతం మంది డీఐఐ(డొమెస్టిక్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్​వెస్టర్లు)లు ఉన్నారు. ప్రజల సేవింగ్స్​పైనే రీటైల్​, డీఐఐలు ఆధారపడి ఉంటాయి. వాల్యుయేషన్​ ఆకర్షణీయంగా లేకపోతే డీఐఐలు ఆసక్తి చూపే అవకాశం ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునే.. ప్రభుత్వం ఐపీఓను తీసుకురానున్నట్టు తెలుస్తోంది.

5శాతం వాటా…

LIC IPO date | ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాలను ఈనెల 13న సెబీ వద్ద దాఖలు చేసింది కేంద్రం. మొత్తం 5శాతం వాటాను ఐపీఓలోకి తీసుకొచ్చింది. ఆ విలువ రూ. 5.4లక్షల కోట్లుగా ఉంది.

మొత్తం మీద 31.6కోట్ల ఈక్విటీ షేర్ల(5శాతం) వాల్యుయేషన్​తో సెబీ వద్దకు వెళ్లింది కేంద్రం. 2021 సెప్టెబర్​ 30 నాటికి ఈ 5శాతం షేర్ల విలువ రూ. 5.4లక్షల కోట్లుగా ఉంది.

LIC IPO | ఈ బీమా సంస్థకు 66శాతం మార్కెట్​ వాటా ఉంది. మొత్తం మీద 283మిలియన్​ పాలసీలు కంపెనీ వద్ద ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1.35 మిలియన్​ మంది ఏజెంట్లు ఉన్నారు.

వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వం.. ఇటీవలే ఎయిర్​ ఇండియాను టాటాలకు అప్పగించింది. అదే సమయంలో ఎల్​ఐసీ ఐపీఓను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 

గతంలో భారీ ఐపీఓలు వస్తున్న సమయంలో.. మార్కెట్లు అనేకమార్లు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఐపీఓలో పాల్గొనేందుకు మదుపర్లు భారీ మొత్తంలో డబ్బులు వెనక్కి తీసుకోవడంతో మార్కెట్​లో లిక్విడిటీ కొంతమేర తగ్గిపోయేది. 

ఎల్​ఐసీ ఐపీఓ సక్సెస్​ అవ్వాలని ప్రభుత్వం ప్రార్థనలు చేస్తోంది. ఈ ప్రార్థనలు ఏమేరకు ఫలిస్తాయనేది మరో నెల రోజుల్లో తెలిసిపోతుంది! 

తదుపరి వ్యాసం