సమ్మె కొనసాగిస్తాం.. బెంగాల్ ప్రభుత్వంతో అసంపూర్తిగా ముగిసిన వైద్యుల రెండో విడత చర్చలు
19 September 2024, 9:20 IST
- Kolkata Rape Case : ఆర్‌జి కర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటన తర్వాత వైద్యులు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా జూనియర్ డాక్టర్లు, ప్రభుత్వం మధ్య జరిగిన రెండో విడత చర్చలు విఫలమయ్యాయని తెలుస్తోంది. లిఖితపూర్వక మినిట్స్ ఇవ్వడానికి బెంగాల్ ప్రభుత్వం నిరాకరించిందని వైద్యులు చెబుతున్నారు.
కోల్ కతా హత్యాచార ఘటనపై వైద్యుల నిరసన(ఫైల్ ఫొటో)
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో వైద్యుల రెండో విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సమావేశంలో అంగీకరించిన విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల భద్రతపై ప్రభుత్వం లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని, పనిని నిలిపివేస్తాం అని సమావేశం అనంతరం వైద్యులు ప్రకటించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి ప్రజారోగ్య టాస్క్‌ఫోర్స్, 30 మంది జూనియర్ డాక్టర్ల ప్రతినిధి బృందం మధ్య నబన్నాలోని రాష్ట్ర సచివాలయంలో సమావేశం జరిగింది. ఐదున్నర గంటలకు పైగా చర్చలు నడిచాయి.
చర్చలు సజావుగా సాగినప్పటికీ చర్చించిన అంశాలపై సంతకాలు, లిఖితపూర్వక మినిట్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. 'ప్రభుత్వ వైఖరితో నిరాశకు గురవుతున్నాం' అని ఆందోళన చేస్తున్న వైద్యుల్లో ఒకరైన డాక్టర్ అనికేత్ మహ ఆవేదన వ్యక్తం చేశారు.
తమ డిమాండ్లను వివరిస్తూ ఈమెయిల్ పంపుతామని వైద్యులు తెలిపారు. దాని ఆధారంగా ఆదేశాలు జారీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఆర్‌జి కర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిగమ్‌పై శాఖాపరమైన విచారణ చేపట్టాలన్న వైద్యుల డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించింది.
సోమవారం కాళీఘాట్ నివాసంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో తొలి రౌండ్ సమావేశం జరిగింది. ప్రభుత్వాసుపత్రి ఆవరణలో తమ భద్రతకు సంబంధించిన అంశాలను, టాస్క్ ఫోర్స్ విధివిధానాలను సమావేశంలో ప్రస్తావించినట్లు ఆందోళన చేస్తున్న వైద్యులు తెలిపారు. రిఫరల్ వ్యవస్థల్లో పారదర్శకత, రోగులకు పడకల కేటాయింపు, హెల్త్ కేర్ వర్కర్ల నియామకం, క్యాంపస్‌లలో కొనసాగుతున్న ఇబ్బందులకు ముగింపు పలకడం వంటి అంశాలను వైద్యులు లేవనెత్తారు.
యూనియన్లు, హాస్టళ్లు, ఆసుపత్రుల నిర్ణయాధికార సంస్థల్లో విద్యార్థుల ప్రాతినిధ్యం, కళాశాల స్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు, కాలేజీ కౌన్సిల్, రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణపై సమావేశంలో చర్చించారు. ఆర్‌జి కర్ ఆస్పత్రిలో జరిగిన ఘోరం పునరావృతం కాకూడదనే ఆందోళనతో తమ డిమాండ్లు విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయని వైద్యులు తెలిపారు.
మరోవైపు రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థపై సమగ్ర విచారణ అవసరమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నొక్కి చెప్పారు. భద్రతపై రాష్ట్ర టాస్‌ఫోర్స్ 4-5 మంది ప్రతినిధులను పంపాలని ప్రభుత్వం కోరగా, అన్ని మెడికల్ కాలేజీల నుంచి విస్తృత ప్రాతినిధ్యం కల్పించాలని వైద్యులు ప్రతిపాదించారు.
రాత్రి గస్తీ కోసం మహిళా పోలీసు అధికారులను నియమించాలని, శాఖల వారీగా పానిక్ బటన్లను ఏర్పాటు చేయాలని, సత్వర జోక్యం కోసం హెల్ప్‌లైన్స్ ఏర్పాటు చేయాలన్న కేంద్ర ఆదేశాలను అమలు చేయడానికి ఇరు పక్షాలు అంగీకరించాయన్నారు.
సోమవారం నాటికి నిరసన తెలుపుతున్న వైద్యులతో పాటు స్టెనోగ్రాఫర్లు సమావేశం మినిట్స్ రికార్డు చేశారు. అయితే బుధవారం సమావేశం తర్వాత వైద్యులు తమ చర్చల షరతులు నెరవేరే వరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం, స్వాస్థ్య భవన్ ముందు ధర్నా కొనసాగిస్తామని ప్రకటించారు. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య తర్వాత ప్రభుత్వ వైద్యశాలల్లో పెద్ద ఎత్తున అవినీతితోపాటు ఇతర అంశాలపై కోల్‌కతాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.