తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  కోల్‌కతా ఆర్‌జి కర్ ఘటన.. జూనియర్ డాక్టర్లకు మద్దతుగా 50 మంది సీనియర్ వైద్యుల రాజీనామా

కోల్‌కతా ఆర్‌జి కర్ ఘటన.. జూనియర్ డాక్టర్లకు మద్దతుగా 50 మంది సీనియర్ వైద్యుల రాజీనామా

Anand Sai HT Telugu

08 October 2024, 14:45 IST

google News
    • Kolkata Rape Case : కోల్‌కతాలో వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. వారి నిరసనకు మద్దతుగా దాదాపు 50 మంది సీనియర్ డాక్టర్లు తాజాగా డ్యూటీకి రాజీనామా చేశారు.
నిరసన చేస్తున్న వైద్యులు(ఫైల్ ఫొటో)
నిరసన చేస్తున్న వైద్యులు(ఫైల్ ఫొటో) (ANI)

నిరసన చేస్తున్న వైద్యులు(ఫైల్ ఫొటో)

జూనియర్ వైద్యుల ఆందోళనకు మద్దతుగా కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సీనియర్ డాక్టర్లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. బెంగాల్‌లో ఆగస్టు 9న ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య తర్వాత జూనియర్ డాక్టర్లు నిరసన మెుదలు పెట్టారు. బెంగాల్‌లో పబ్లిక్ హెల్త్‌కేర్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే తమ డిమాండ్లను ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదని నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు.

జూనియర్ల ఆందోళనకు మద్దతుగా ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సీనియర్ డాక్టర్లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. మంగళవారం దాదాపు 50 మంది సీనియర్ వైద్యులు రాజీనామా చేశారు. అయితే తాము ఉద్యోగాలకు రాజీనామా చేయలేదని సీనియర్ వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతానికి డ్యూటీకి 'రాజీనామా' మాత్రమేనని ప్రకటించారు.

అయినా ప్రభుత్వం సానుకూలంగా చర్యలు తీసుకోకుంటే ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తామని సీనియర్‌ వైద్యులను హెచ్చరించారు. అయితే వారు డ్యూటీకి రాజీనామా చేయడంతో RG కర్ ఆరోగ్య సేవల్లో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సామూహిక రాజీనామా సంబంధించి ఆరోగ్య భవన్‌కు లేఖ కూడా పంపారు. రోగులకు అత్యుత్తమ సేవలు అందించాలనే తపనతో ఉన్నామని ఆర్‌జి కర్ సీనియర్ వైద్యులు పేర్కొన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రోగులకు అవసరమైన సేవలు అందించడం కష్టంగా మారుతోందన్నారు.

నిరాహార దీక్షలు చేస్తున్న జూనియర్ డాక్టర్ల ఆరోగ్య పరిస్థితిపై సీనియర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలవాలని సామూహిక రాజీనామా ఇచ్చినట్టుగా సీనియర్ వైద్యులు తెలిపారు. జూనియర్‌ డాక్టర్లు నిరాహారదీక్షలు చేస్తున్నా ప్రభుత్వం కళ్లు మూసుకుందని ఆరోపించారు. అందుకు నిరసనగా ప్రస్తుతానికి సామూహిక రాజీనామాలు చేస్తున్నామన్నారు. ఆ తర్వాత అవసరమైతే అందరూ ఉద్యోగాలకు రాజీనామా బాటలో నడుస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో కొనసాగుతున్న ప్రాజెక్టులలో 90 శాతం వచ్చే నెలలోపు పూర్తి చేస్తామని పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ హామీ ఇచ్చారు. నిరసన చేస్తున్న వైద్యులు తిరిగి విధుల్లోకి రావాలని కోరారు. 'ప్రతిఒక్కరూ తిరిగి వచ్చి ప్రజలకు సేవలు అందించాలని నేను అభ్యర్థిస్తున్నాను. అందరం కోరుకునేది సురక్షితమైన వాతావరణం. మేం ఆ దిశగా కృషి చేస్తున్నాం. సానుకూల ఉద్దేశం ఉంది.' అని మనోజ్ పంత్ చెప్పారు.

ఇప్పటికే ప్రభుత్వం పలుసార్లు వైద్యులతో బెంగాల్ ప్రభుత్వం చర్చించింది. అయితే సానుకూల ఫలితాలు రాకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమ్మె కొనసాగిస్తు్న్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగింది. ఈ ఘటనలో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత కేసు సీబీఐకి వెళ్లింది. తాజాగా నిందితుడిపై సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆర్‌జి కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను కూడా సీబీఐ విచారించింది. అవినీతి కేసులో కూడా అతడిపై విచారణ జరుగుతోంది.

టాపిక్

తదుపరి వ్యాసం