Kolkata rape case : డిమాండ్లు నెరవేర్చాలని.. ఆమరణ నిరాహార దీక్షకు దిగిన వైద్యులు
Kolkata rape case : కోల్‌కతాలోని కొందరు వైద్యులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని, అప్పటివరకు దీక్ష కొనసాగిస్తామని ప్రభుత్వానికి తేల్చిచెప్పారు.
తమ డిమాండ్లపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కోల్‌కతాలోని జూనియర్ డాక్టర్లు శనివారం సాయంత్రం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో అత్యాచారం, హత్యకు గురైన 31 ఏళ్ల వైద్యురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైద్యులు ఈ మేరకు చర్యలు చేపట్టారు.
‘రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది..’
వాస్తవానికి 42 రోజుల పాటు నిరసనలు చేపట్టిన వైద్యులు.. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం సెప్టెంబర్ 21న ఆందోళనలను విరమించారు. కానీ కోల్‌కతా ధర్మతాలాలోని డోరినా క్రాసింగ్ వద్ద శుక్రవారం తిరిగి ధర్నా ప్రారంభించారు.
"రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన గడువును వృథా చేసుకుంది. అందువల్ల మేము ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నాము. ఇది మా డిమాండ్లు నెరవేరే వరకు కొనసాగుతుంది. పారదర్శకత కోసం మా సహోద్యోగులు దీక్ష చేస్తున్న వేదిక వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం,' అని జూనియర్ డాక్టర్ ఒకరు మీడియాకు తెలిపారు.
తాము తిరిగి విధుల్లో చేరామని, కానీ ఏమీ తినబోమని వైద్యులు చెప్పారు. ఆరుగురు డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారని వారు తెలిపారు. వైద్యులకు ఏదైనా జరిగితే టీఎంసీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని తేల్చిచెప్పారు.
కోల్‌కతా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కి చెందిన స్నిగ్ధ హజ్రా, తనయ పంజా, అనుస్తుప్ ముఖోపాధ్యాయ, ఎస్ఎస్కేఎంకు చెందిన అర్నబ్ ముఖోపాధ్యాయ, ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కి చెందిన పులస్థ ఆచార్య, కేపీసీ మెడికల్ కాలేజీకి చెందిన సయంతనీ ఘోష్ హజ్రా ఆమరణ నిరాహర దీక్షకు దిగారు.
నిరసన స్థలంలో వేదిక ఏర్పాటుకు పోలీసులు అనుమతి నిరాకరించారని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై లాఠీఛార్జ్ చేశారని వైద్యులు ఆరోపించారు. అయితే, ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ రద్దీ ఉందని, లాఠీఛార్జికి పాల్పడిన పోలీసులపై ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.
వైద్యుల డిమాండ్లు..
వైద్యులు చేసిన తొమ్మిది డిమాండ్లలో అత్యంత వివాదాస్పదమైనది ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిగమ్‌ను తొలగించడం. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలకు సెంట్రలైజ్డ్ రిఫరల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని, పడకల ఖాళీల పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాలని, పని ప్రదేశాల్లో సీసీటీవీ, ఆన్ కాల్ గదులు, వాష్ రూమ్స్ వంటి అత్యవసర సదుపాయాలను కల్పించేందుకు టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలని మరికొన్ని డిమాండ్లు ఉన్నాయి.
ఆగస్టు 9న ప్రభుత్వాసుపత్రిలోని సెమినార్ హాల్లో 31ఏళ్ల వైద్యురాలు శవమై కనిపించింది. ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఇప్పటికే పోలీసుల కస్టడీలో ఉన్నాడు.
సంబంధిత కథనం