Kohinoor diamond : ‘జగన్నాథుడిదే కోహినూర్.. భారత్‌కు తీసుకురావాలి’
13 September 2022, 7:20 IST
- Kohinoor diamond Lord Jagannath : బ్రిటన్ రాణికి చెందిన కిరీటంలో ఉన్న కోహినూర్ డైమండ్.. పూరీ జగన్నాథుడిది అని పలువురు పేర్కొన్నారు. దానిని ఇండియాకు తీసుకురావాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.
‘జగన్నాథుడిదే కోహినూర్.. భారత్‌కు తీసుకురావాలి’
Kohinoor diamond Lord Jagannath : క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత కోహినూర్ డైమండ్ ఉన్న కిరీటం వార్తలకెక్కింది. ఆ కోహినూర్ డైమండ్ పూరీలోని జగన్నాథుడిది అని, తమ పాలనలో బ్రిటీషర్లు దానిని తీసుకెళ్లిపోయారని తాజాగా కొందరు ఆరోపించారు. పూరీ జగన్నాథుడికి చెందిన కోహినూర్ డైమండ్‌ను తీరిగి దేశానికి తీసుకురావాలని, ఈ విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ద్రౌపది ముర్ముకు మెమొరాండమ్ని అందించింది పూరీలోని శ్రీ జగన్నాథ్ సేన.
'మా దేవుడిదే ఆ డైమండ్..'
96ఏళ్ల వయస్సులో.. అనారోగ్య సమస్యల కారణంగా కొన్ని రోజుల క్రితం తుదిశ్వాస విడిచారు క్వీన్ ఎలిజబెత్. ఆమె మరణం అనంతరం ఎలిజబెత్ కుమారుడు ప్రిన్స్ చార్లస్ రాజుగా బాధ్యతలు స్వీకరించారు.
Queen Elizabeth death : ఎలిజబెత్ మరణం అనంతం కోహినూర్ ఉన్న కిరీటం ఎవరికి దక్కుతుంది? అన్న అంశంపై తీవ్ర చర్చలు జరిగాయి. అందుకు తగ్గట్టుగానే సామాజిక మాధ్యమాల్లో ‘కోహినూర్’ ట్రెండింగ్‌గా మారింది. అయితే.. కోహినూర్‌పై ఇండియాకు 100శాతం హక్కులు ఉన్నాయని, దానిని తిరిగి ఇచ్చేయాలని వేలాది మంది ట్వీట్ల వర్షం కురిపించారు. ఫలితంగా ఈ కోహినూర్ వ్యవహారం మరోమారు హాట్‌టాపిక్‌గా మారింది.
ఇక ఇప్పుడు.. ఈ కోహినూర్ డైమండ్ పూరీ జగన్నాథుడిదే అని పలువురు ఆరోపించారు.
"ఆ కోహినూర్ డైమండ్ శ్రీ జగన్నాథుడికి చెందినది. మహారాజా రంజిత్ సింగ్.. దానిని జగన్నాథ భగవానుడికి విరాళంగా ఇచ్చారు. కానీ ఇప్పుడు అది క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద ఉంది. దానిని వెనక్కి తీసుకురావాలని మీరు ప్రధానికి విజ్ఞప్తి చేయండి," అని ద్రౌపది ముర్ముకు అందించిన మెమొరాండమ్‌లో పేర్కొంది శ్రీ జగన్నాథ్ సేన.
Queen Elizabeth Kohinoor crown : చరిత్రకారుల ప్రకారం.. పంజాబ్ మహారాజు రంజిత సింగ్, అఫ్గానిస్థాన్ రాజు నదీర్ షాపై యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో గెలిస్తే పూరీ జగన్నాథుడికి కోహినూర్‌ని విరాళంగా ఇస్తానని ఆయన మొక్కుకున్నారు. నదీర్ షాపై జరిగిన యుద్ధంలో ఆయన విజయం సాధించారు. అయితే.. కోహినూర్‌ని పూరీ జగన్నాథుడికి ఇవ్వలేదు!
1839లో రాజా రంజిత్ సింగ్ మరణించారు. 10ఏళ్ల తర్వాత.. రంజిత్ సింగ్ కుమారుడు దులీప్ సింగ్ నుంచి బ్రిటీషర్లు ఆ కోహినూర్ డైమండ్‌ను తీసుకుని ఇంగ్లాండ్‌కు పట్టుకెళ్లిపోయారు. అప్పటి నుంచి అది ఇండియాకు తిరిగిరాలేదు.
ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రంగా కోహినూర్ గుర్తింపు పొందింది. 14వ శతాబ్దంలో కాకతీయుల రాజ్యంలో.. కొల్లూర్ గనుల నుంచి దీనిని తొలిసారిగా బయటకు తీసినట్టు చరిత్ర సూచిస్తోంది.