Kim unwell | నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్‌కు తీవ్ర అస్వస్థత
11 August 2022, 15:38 IST
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో ఆ వైరస్ బారిన కిమ్ కూడా పడ్డారు. ఆ సమయంలో ఆయన తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధ పడ్డారు. ఈ వివరాలను కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ వెల్లడించారు.
సోదరి కిమ్ యో జోంగ్ తో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (ఫైల్ ఫొటో)
Kim unwell | నియంతృత్వ పాలనలో ఉన్న ఉత్తర కొరియా వార్తలు సాధారణంగా బయటకు రావు. ముఖ్యంగా అధ్యక్షుడు కిమ్, ఆయన కుటుంబానికి సంబంధించిన వార్తావిశేషాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు కిమ్ ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన వార్త తాజాగా ప్రపంచానికి వెల్లడైంది.
Kim unwell | అనారోగ్యంపై ఊహాగానాలు
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అనారోగ్యంపై ఇప్పటికే చాలాసార్లు చాలా వార్తలు వచ్చాయి. కొన్నాళ్ల పాటు ఆయన బహిరంగంగా కనిపించని ప్రతీసారి.. ఆయన చాలా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడన్న వార్తలు ప్రపంచ మీడియాలో చక్కర్లు కొట్టేవి. ముఖ్యంగా ఇటీవల ఉత్తర కొరియాలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభించిన సమయంలోనూ కిమ్ కరోనా బారిన పడ్డారని, పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వచ్చాయి. ఆ తరువాత, ఆయన ఒక బహిరంగ వేదికపై కనిపించడంతో ఆ ఊహాగానాలకు తెరపడింది.
Kim unwell | ఊబకాయం, స్మోకింగ్
కిమ్ ఊబకాయుడు. దాంతో పాటు చైన్ స్మోకర్. పలుమార్లు సీరియస్‌గానే అనారోగ్యం పాలయ్యారు. అయితే, అందుకు సంబంధించిన కచ్చితమైన వివరాలైతే ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో తాజాగా, ఆయన సోదరి కిమ్ యో జోంగ్ చేసిన వ్యాఖ్యలు ఆయన అనారోగ్యానికి సంబంధించి కొంత సమాచారాన్ని వెలుగులోకి తెచ్చాయి. ఇటీవల దేశంలో కోవిడ్ 19 విజృంభించిన సమయంలో అధ్యక్షుడు కిమ్ కూడా తీవ్రమైన అస్వస్థతకు లోనయ్యారని ఆమె వెల్లడించారు.
Kim unwell | దక్షిణ కొరియాపై ఆరోపణలు
పొరుగునున్న శత్రుదేశం దక్షిణ కొరియా వల్లనే ఉత్తర కొరియాలో కరోనా ప్రబలిందని ఉత్తర కొరియా బలంగా నమ్ముతోంది. సరిహద్దుల నుంచి బెలూన్ల ద్వారా వైరస్‌ను తమ దేశంలోకి పంపుతున్నారని విశ్వసిస్తోంది. ఇదే విషయంపై తాజాగా నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ దక్షిణ కొరియాపై మరోసారి ఆరోపణలు చేశారు. ఉత్తర కొరియాలోకి కరోనా వైరస్‌ను పంపే కుట్రను నిలిపేయనట్లైతే.. తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె సౌత్ కొరియాను హెచ్చరించింది. అవసరమైతే, కరోనా వైరస్‌తో పాటు దక్షిణ కొరియాను కూడా నాశనం చేస్తామని హెచ్చరిస్తారు. ఈ సందర్భంగానే తన సోదరుడి అనారోగ్యం గురించి ఆమె వెల్లడించారు.