Kia Carens | ఇండియాలో లాంచ్ అయిన కియా కారెన్స్.. ధర ఎంతంటే?
15 February 2022, 12:58 IST
- ఇండియన్ మార్కెట్‌లోకి మరో మల్టీ పర్పస్ వెహికిల్ వచ్చేసింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కియా కారెన్స్ సెవన్ సీటర్ కారు మంగళవారం ఇండియాలో లాంచ్ అయింది.
కియా కారెన్స్ కారు
ముంబై: ఇండియన్ మార్కెట్‌లో సెల్టోస్, సోనెట్, కార్నివాల్ వంటి మోడల్స్‌తో సంచలనాలు సృష్టించిన కియా ఇండియా.. తాజాగా ఎంపీవీ సెగ్మెంట్‌లోనూ అడుగుపెట్టింది. తమ కొత్త సెవన్ సీటర్ మోడల్ కియా కారెన్స్‌ను లాంచ్ చేసింది.
ఈ కారు ఐదు వేరియెంట్లు.. ప్రీమియం, ప్రెస్టిజ్, ప్రెస్టిజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్‌లలో వస్తోంది. ఈ కారు ధర రూ.8.99 లక్షల నుంచి రూ.16.99 లక్షల మధ్య ఉంటుంది. ఇక ఏఆర్‌ఏఐ సర్టిఫైడ్ ఇంధన సామర్థ్యం ప్రకారం కారెన్స్ డీజిల్ వేరియెంట్ అయితే లీటర్‌కు 21.3 కి.మీ., పెట్రోల్ అయితే లీటర్‌కు 16.5 కి.మీ. మైలేజీ ఇస్తుంది.
ఈ కారు లాంచ్ అయిన తొలి రోజే కియాకు 7738 బుకింగ్స్ రావడం విశేషం. నిజానికి ఈ కియా కారెన్స్ ప్రపంచవ్యాప్తంగా గతేడాది డిసెంబర్ 16నే లాంచ్ అయింది. ఈ కారు అన్ని వేరియెంట్లలోనూ ఆరు ఎయిర్‌బ్యాగులతో వస్తోంది. ఇక కియా కనెక్ట్‌తో కూడిన 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ నావిగేషన్, 8 స్పీకర్లతో కూడిన బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.
సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, సెవన్ స్పీడ్ డీసీటీ, సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో కియా కారెన్స్ వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న కియా మోటార్స్ ఫ్యాక్టరీ నుంచి తొలి కారెన్స్ కారును రిలీజ్ చేసింది. అంతేకాదు ఈ కియా కారెన్స్ కారు ఇండియాలోనే తయారై 80 దేశాలకు ఎగుమతి కానుంది.