తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Seven Seater Cars | ఇండియాలో ఏడు బెస్ట్‌ సెవన్‌ సీటర్‌ కార్లు ఇవే!

Seven Seater Cars | ఇండియాలో ఏడు బెస్ట్‌ సెవన్‌ సీటర్‌ కార్లు ఇవే!

Hari Prasad S HT Telugu

31 January 2022, 17:09 IST

    • Seven Seater Cars.. ముందు మనం కారు ఉంటే చాలనుకుంటాం. ఆ తర్వాత ఆ కారు ఇంకాస్త పెద్దదైతే బాగుంటుంది అనిపిస్తుంది. ఐదు సీట్ల కంటే ఏడు సీట్లు ఉంటే.. ఫ్యామిలీతోనో, ఫ్రెండ్స్‌తోనూ సరదాగా లాంగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేసుకోవచ్చని అనుకుంటాం. కార్ల కంపెనీలు కూడా సరిగ్గా ఇలా ఆలోచించే.. ఎన్నో 7 సీటర్‌ ఎంయూవీలు, ఎస్‌యూవీలను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి.
ఇండియాలో బెస్ట్ సెవన్ సీటర్ కార్లలో ఒకటి మారుతీ సుజుకీ ఎర్టిగా
ఇండియాలో బెస్ట్ సెవన్ సీటర్ కార్లలో ఒకటి మారుతీ సుజుకీ ఎర్టిగా

ఇండియాలో బెస్ట్ సెవన్ సీటర్ కార్లలో ఒకటి మారుతీ సుజుకీ ఎర్టిగా

వీటిలో కొన్ని కార్లు మధ్య తరగతి వాళ్లు కూడా భరించే ధరల్లో ఉండగా.. మరికొన్ని ప్రీమియం ఎంయూవీలు చాలా ఖరీదైనవి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇండియన్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్‌ సెవన్‌ సీటర్‌ కార్లు ఏమున్నాయో ఒకసారి చూద్దాం.

మారుతీ సుజుకీ ఎర్టిగా

దేశంలోని మధ్యతరగతి వారికి ఎంతో ఇష్టమైన, నమ్మకమైన కార్ల కంపెనీ మారుతీ సుజుకీ. ఈ కంపెనీ తీసుకొచ్చిన ఎర్టిగా కారుకు అందుకే అంత డిమాండ్‌. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటు ధరలో ఉన్న కార్లలో అత్యధిక డిమాండ్‌ ఉన్న కారు ఈ ఎర్టిగానే. పదేళ్ల కిందట మార్కెట్‌లోకి వచ్చిన ఈ కారు ఇప్పుడు ఈ సెవర్‌ సీటర్‌ మార్కెట్‌ను దున్నేస్తోంది. తక్కువ మెయింటెనెన్స్‌, ఎక్కడికి వెళ్లినా అందుబాటులో ఉండే మారుతీ సుజుకీ సర్వీసులు, అందుబాటు ధర కారణంగా ఎర్టిగాకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. 

కారు సైజు కూడా సిటీ ట్రాఫిక్‌కు తగ్గట్లుగా ఉండటం అదనపు ప్రయోజనం. ఇక మైలేజీలోనూ మేటే. సీఎన్జీ మోడల్‌ అయితే ఏకంగా లీటర్‌కు 26 కిలోమీటర్ల మైలేజీ ఇస్తోంది. ఇక పెట్రోల్‌ వేరియెంట్ కూడా 19 కి.మీ. వరకూ ఇస్తుండటం విశేషం. టాప్‌ ఎండ్‌ ఎర్టిగాలో ఏడు అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌, ఆటోమేటిక్ క్లైమేట్‌ కంట్రోల్‌, పుష్‌ స్టార్ట్‌/స్టాప్‌, ఫాగ్‌ ల్యాంప్స్‌, డ్యుయల్‌ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్‌, రివర్స్‌ పార్కింగ్‌ సెన్సర్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎర్టిగా ఆన్‌రోడ్‌ ప్రైస్ రూ.9.62 లక్షల నుంచీ ఉంది.

రెనాల్ట్‌ ట్రైబర్‌

ఇక ఎర్టిగా కంటే తక్కువ ధరలో కావాలంటే రెనాల్ట్ ట్రైబర్‌ కారు వైపు చూడొచ్చు. ఈ ఎంయూవీ కారు సైజు కూడా చిన్నదే. అయితే ఏడు మంది సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. రెనాల్ట్‌ ట్రైబర్‌ ఆన్‌రోడ్‌ ధర రూ.6.72 లక్షల నుంచే ప్రారంభమవుతుండటం విశేషం. టాప్‌ ఎండ్‌లో 8 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, రెండు, మూడు సీట్ల వరుసల కోసం ఏసీ వెంట్స్‌, పుష్‌ స్టార్ట్‌/స్టాప్‌, డ్యుయల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, పార్కింగ్‌ సెన్సార్స్‌, స్టీరింగ్‌లోనే ఆడియా, కాలింగ్‌ కంట్రోల్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా సఫారీ

ఇండియాలో ప్రయాణికుల కార్ల మార్కెట్‌లో మరో నమ్మకమైన బ్రాండ్‌ టాటా. ఈ సంస్థ తీసుకొచ్చిన సఫారీ కారు ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2021లో కొత్త లుక్‌లో మార్కెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సఫారీకి మరింత డిమాండ్‌ పెరిగింది. ఆరు, ఏడు సీట్ల వేరియెంట్లలో ఈ కారు అందుబాటులో ఉంది. కాకపోతే ధర కాస్త ఎక్కువే. బేసిక్‌ మోడల్‌ ఆన్‌రోడ్‌ ప్రైస్‌ రూ.18.15 లక్షలు. ఇక హైఎండ్‌ మోడల్‌ ధర రూ.28.15 లక్షలుగా ఉంది. ఇందులో 8.8 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, 9 స్పీకర్ల జేబీఎల్‌ సౌండ్‌ సిస్టమ్‌, వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జర్‌, పనోరమిక్‌ సన్‌రూఫ్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, మూడ్‌ లైటింగ్‌, టైర్‌ ప్రెజచ్‌ మానిటరింగ్‌, గరిష్ఠంగా ఆరు వరకూ ఎయిర్‌ బ్యాగులు వంటి ఫీచర్లు సఫారీలో ఉన్నాయి.

మహీంద్రా బొలెరో

భారత గ్రామీణ రోడ్లను తట్టుకొని నిలబడిన గట్టి కారు మహీంద్రా బొలెరో. ఎప్పుడో 2000లో తొలిసారి వచ్చిన ఈ కారు.. అప్పటి నుంచీ మార్కెట్‌లో తనదైన మార్క్‌ చూపిస్తూనే ఉంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బొలెరోకు మంచి డిమాండ్‌ ఉంది. ఈ 22 ఏళ్లలో లుక్‌ పరంగా బొలెరో కారు పెద్దగా మారిందేమీ లేదు. దీని ఆన్‌రోడ్‌ ధర రూ.10.64 లక్షల నుంచీ ప్రారంభమవుతోంది. కీలెస్‌ ఎంట్రీ, బ్లూటూత్‌ ఎనేబుల్డ్‌ మ్యూజిక్‌ సిస్టమ్‌, పవర్‌ స్టీరింగ్‌, ఏబీఎస్‌, డ్యుయల్‌ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్‌, పార్కింగ్ సెన్సారర్స్‌, స్పీడ్‌ అలెర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టొయోటా ఇన్నోవా క్రిస్టా

ఈ సెవన్‌ సీటర్ కార్ల సెగ్మెంట్‌లో ఇండియాలో టాప్‌లో ఉన్న కారు టొయోటా ఇన్నోవా క్రిస్టానే. ఎన్నో ఏళ్లుగా ఈ ఎంయూవీ సెగ్మెంట్‌లో ఏకఛత్రాధిపత్యం ప్రదర్శిస్తోంది. మోడర్న్‌ లుక్‌తోనూ అదరగొడుతోంది. కాకపోతే ఈ కారు ధర కాస్త ఎక్కువే. హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ధర రూ.21.02 లక్షల నుంచీ ప్రారంభమవుతోంది. అందుకు తగినట్లే ఇందులో ఫీచర్లు ఉన్నాయి. 8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, ఆంబియెంట్ లైటింగ్‌, ఆటోమెటిక్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, రెయిర్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌, గరిష్ఠంగా ఏడు ఎయిర్‌ బ్యాగులు, వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

హ్యుండాయ్‌ అల్కజార్‌

ఇండియాలో మారుతి సుజుకి, టాటా కంపెనీల తర్వాత ఆ స్థాయిలో మధ్యతరగతి వాళ్లు నమ్మే బ్రాండ్‌ హ్యుండాయ్‌. చాలా కాలం ఐదు సీట్ల హ్యాచ్‌బ్యాక్‌లకే పరిమితమైన ఈ కంపెనీ.. ఈ మధ్యే సెవన్‌ సీటర్‌ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది. హ్యుండాయ్‌ క్రెటా లుక్‌లోనే వస్తున్న సెవన్‌ సీటర్‌ కారు ఈ అల్కజార్‌. ఈ కారులో పనోరమిక్‌ సన్‌రూఫ్‌ అదనపు ఆకర్షణ. దీని ఆన్‌రోడ్‌ ధర హైదరాబాద్‌లో రూ.19.82 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, కలర్‌ స్క్రీన్‌తో కూడిన 10.25 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ప్యానెల్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, 360 డిగ్రీ కెమెరా, గరిష్ఠంగా 6 ఎయిర్‌బ్యాగులు, పార్కింగ్ అసిస్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఎంజీ హెక్టార్‌ ప్లస్‌

బ్రిటన్‌కు చెందిన ఈ సెవన్‌ సీటర్‌ ఎస్‌యూవీ ఏడాది కాలంగా ఇండియన్‌ మార్కెట్‌లో తన హవా కొనసాగిస్తోంది. ఎంజీ హెక్టార్‌కు ఇది కొనసాగింపుగా వచ్చింది. చాలా వరకూ ఫీచర్లు అవే ఉన్నా.. ఒక సీట్ల వరుస ఎక్కువగా ఉంటుంది. ఈ ఎంజీ హెక్టార్‌ ప్లస్‌ ఆన్‌రోడ్‌ ధర హైదరాబాద్‌లో రూ.17.40 లక్షల నుంచీ ఉంది. ఇందులో 10.4 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, 8-కలర్‌ ఆంబియెంట్‌ లైటింగ్‌, పనోరమిక్‌ సన్‌రూఫ్, వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జర్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, హిల్‌ హోల్డ్‌ కంట్రోల్‌, గరిష్ఠంగా ఆరు ఎయిర్‌బ్యాగులు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం