Khosta-2 virus : గబ్బిలాల నుంచి మనుషుల్లోకి మరో ప్రాణాంతక వైరస్..!
24 September 2022, 7:40 IST
- Khosta-2 virus : ఖోస్తా 2 అనే వైరస్.. జంతువుల నుంచి మనుషుల్లోకి వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది కూడా తొలుత గబ్బిలాల్లోనే గుర్తించినట్టు వెల్లడించారు.
గబ్బిలాల నుంచి మనుషులకు మరో ప్రాణాంతక వైరస్..!
Khosta-2 virus news : కరోనా వైరస్‌తో ఉక్కిరిబిక్కిరి అయిన మానవాళికి మరో బ్యాడ్ న్యూస్! మరో కొత్త రకం వైరస్‌ను అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఖోస్తా 2గా పిలుస్తున్న ఈ వైరస్.. మనుషుల్లో వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇది మనిషి కణాల్లోకి ప్రవేశించడంతో పాటు ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు దీనిపై ప్రభావం చూపించడం లేదని స్పష్టం చేశారు.
కరోనా వైరస్.. 2019 చివర్లో తొలుత చైనాలో వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ వైరస్‌కు బలయ్యారు. దీని పుట్టుకపై ఉన్న ప్రశ్నలకు ఇంకా ఎలాంటి సమాధానాలు లేవు. అయితే.. ఇది గబ్బిలాల నుంచి మనుషులకు సోకి ఉంటుందని పలు అభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇప్పుడు అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించిన ఖోస్తా 2 వైరస్‌ని కూడా.. 2020లో తొలిసారిగా రష్యాలోని గబ్బిలాల్లోనే కనిపించడం గమనార్హం.
Khosta 2 virus in bats : 2020లోనే ఈ ఖోస్తా 2పై పరిశోధనలు చేపట్టిన శాస్త్రవేత్తలు.. ఇది మనుషులపై ప్రభావం చూపించదు అని భావించారు. తాజాగా మరోమారు జరిగిన పరిశోధనల్లో మాత్రం.. ఈ వైరస్ మనుషులకు సోకుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్‌కి టీకా వేసుకున్న వారిపైనా ఇది ప్రభావం చూపిస్తుండటం ఆందోళనకర విషయం. ఇందుకు సంబంధించిన రీసెర్చ్.. జర్నల్ పీఎల్ఓఎస్ పాథోజెన్స్లో పబ్లీష్ అయ్యింది.
ఖోస్తా 2 వైరస్ అంటే ఏంటి?
ఈ సార్స్ కోవ్2, ఖోస్తా 2 వైరస్లు.. సర్బెకొవైరస్ జాతికి చెందినవి. టైమ్స్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం.. ఖోస్తా 1.. మనుషులపై ప్రభావం చూపించదు. కానీ ఖోస్తా 2.. మనుషులకు ముప్పుగా మారే అవకాశం ఉంది. మనిషి కణాల్లోకి కొవిడ్ ఏ విధంగా ప్రవేశించిందో.. ఈ ఖోస్తా 2 వైరస్ కూడా అదే విధంగా వెళుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
Khosta 2 virus news : అయితే ఇక్కడ ఒక ఊరటనిచ్చే విషయాన్ని చెప్పారు శాస్త్రవేత్తలు. ఒమిక్రాన్లాగా.. తీవ్రమైన ఆనారోగ్య సమస్యలను సృష్టించే జీన్స్ ఈ ఖోస్తా 2కు ప్రస్తుతం లేదని వెల్లడించారు. అయితే.. సార్స్ కొవ్ 2 జీన్స్‌తో ఇది కలిస్తే.. ప్రమాదం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఖోస్తా 2 వ్యాప్తి ఎలా ఉంటుంది?
ఈ ఖోస్తా 2 ప్రస్తుతం జంతువుల్లోనే వ్యాపిస్తోంది. ఇది మరో మహమ్మారిగా మారుతుందా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు.
"సార్స్ కొవ్ 2, ఖోస్తా 2లు కలిసే అవకాశం చాలా తక్కువగా ఉంది. కానీ జంతువుల్లో ఇవి వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇలాంటి వైరస్ల నుంచే కాకుండా ఇతర సర్బెకొవైరస్ల నుంచి రక్షణ పొందే విధంగా టీకాల తయారీకి కృషి జరుగుతోంది. ఇప్పుడున్న టీకాలు.. కేవలం ఒక్క వైరస్ కోసమే రూపొందించారు. అందువల్ల వేరే వైరస్‌లపై అవి పనిచేయం లేదు. అన్ని రకాల వైరస్ల నుంచి రక్షణ పొందే విధంగా టీకాలను అభివృద్ధి చేయడం ఇప్పుడు అత్యావశ్యకం," అని పరిశోధనలో పాల్గొన్న ఓ శాస్త్రవేత్త వెల్లడించారు.