Bharat jodo yatra - Day 4: ‘జీససే నిజమైన దేవుడు’.. మరో వివాదంలో రాహుల్ గాంధీ
10 September 2022, 15:06 IST
- Bharat jodo yatra - Day 4: కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజం లక్ష్యంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రను చేపట్టిన రాహుల్ గాంధీని వరుస వివాదాలు పలుకరిస్తున్నాయి. తాజాగా, తమిళనాడులో వివాదాస్పద ప్రీస్ట్ తో ఆయన భేటీ మరో వివాదానికి తెర తీసింది.
భారత్ జోడో యాత్రలో తమిళనాడు యువతతో రాహుల్ గాంధీ
Bharat jodo yatra - Day 4: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నాలుగో రోజుకు చేరింది. ప్రస్తుతం తమిళనాడులో ఈ యాత్ర సాగుతోంది. తమిళనాడులోని ములగమూడు నుంచి నాలుగో రోజు యాత్ర ప్రారంభమైంది. శనివారం సాయంత్రం యాత్ర కేరళలోకి ప్రవేశించనుంది. యాత్రలో భాగంగా ఆయా ప్రాంతాల్లోని ప్రముఖులతో రాహుల్ సమావేశమవుతున్నారు. అలాగే, తమిళనాడులో వివాదాస్పద ప్రీస్ట్ గా పేరుగాంచిన జార్జ్ పొన్నయ్యతోనూ సమావేశమయ్యారు. అయితే, ఆ భేటీలో ఆ ప్రీస్ట్ జార్జి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.
Bharat jodo yatra - Day 4: ‘శక్తి నో మరొకరో కాదు.. జీససే నిజమైన దేవుడు’
రాహుల్ తో ప్రీస్ట్ జార్జ్ పొన్నయ్య సమావేశం సందర్భంగా ప్రీస్ట్ పొన్నయ్య చేశారంటూ కొన్ని వివాదాస్పద కామెంట్లున్న వీడియోను బీజేపీ ట్వీట్ చేసింది. అందులో, ``జీసస్ మాత్రమే నిజమైన దేవుడు.. శక్తి, లేదా మరొకరు కాదు.. జీసస్ మాత్రమే నిజమైన దేవుడు`` అంటూ పొన్నయ్య వ్యాఖ్యలు చేసినట్లుగా ఉంది. దీనిపై బీజేపీ మండి పడుతోంది. `రాహుల్ చేస్తోంది భారత్ జోడో యాత్ర కాదు.. భారత్ తోడో యాత్ర` అని ఎద్దేవా చేస్తోంది. `మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడే వారితో సమావేశం కావడమే రాహుల్ యాత్ర ఉద్దేశమైతే.. భారత్ జోడో అనేది ఒక ముసుగు మాత్రమే` అని బీజేపీ నేత మాలవీయ ట్వీట్ చేశారు.
Bharat jodo yatra - Day 4: కాంగ్రెస్ రియాక్షన్
బీజేపీ దాడిపై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. భారత్ జోడో యాత్ర కు లభిస్తున్న ప్రజాదరణను బీజేపీ తట్టుకోలేకపోతోందని, అందువల్లనే ఇలాంటి ఫేక్ వీడియోలతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించింది. రాహుల్ గాంధీ, ప్రీస్ట్ జార్జ్ పొన్నయ్యల భేటీకి సంబంధించి బీజేపీ ట్వీట్ చేసిన వీడియోలో ఆడియోను మార్చారని ఆరోపించింది. బీజేపీ `హేట్ ఫ్యాక్టరీ` పనే ఇదని మండిపడింది.
Bharat jodo yatra - Day 4: గతంలోనూ వివాదాలు
తమిళనాడు లోని ఈ వివాదాస్పద ప్రీస్ట్ జార్జ్ పొన్నయ్య గతంలోనూ పలు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. హిందుత్వపై ఆయన చేసిన విద్వేష వ్యాఖ్యలకు గానూ 2021లో అరెస్ట్ కూడా అయ్యారు. భరత మాత కలుషితాలు తనకు అంటుకోకుండా ఉండడం కోసమే తాను షూస్ ధరిస్తున్నానని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్నాయి. ‘‘భూమా దేవీ(మదర్ ఎర్త్) లేదా భారత్ మాత(మదర్ ఇండియా) చాలా ప్రమాదకరమైన వ్యాధి. అది నాకు అంటకుండా ఉండడం కోసమే షూస్ ధరిస్తున్నా’’ అని అన్నారాయన. తాను చెప్పడం వల్లనే తమిళనాడులోని క్రిస్టియన్లు, ముస్లింలు డీఎంకేకు ఓటేశారని, అందువల్లనే డీఎంకే గెలిచిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.